– ఉదయం 4, 5 గంటల నుంచి కాకుండా 7 గంటల నుంచి ఫించన్ల పంపిణీ
– పింఛన్ల పంపిణీకి సంబంధించి కీలక నిర్ణయం
అమరావతి: ఏపీలో పింఛన్ల పంపిణీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి నెలా ఒకటో తేదీన ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్ పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే..
అయితే ఇకపై పింఛన్ల పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఎన్టీఆర్ భరోసా పింఛను పథకాన్ని ప్రభుత్వం ప్రచార విధానంలోకి చేర్చింది. పింఛన్ల పంపిణీలో నాణ్యతను, పింఛనుదారుల సంతృప్తి స్థాయిని మెరుగుపరచడానికీ పింఛను పంపిణీ మొబైల్ అప్లికేషన్‌లో మార్పులు చేశారు. రాష్ట్రంలో వేకువజామున 4, 5 గంటల నుంచి పింఛన్ పంపిణీ ప్రారంభిస్తున్నారు.
ఉదయం 7 గంటల నుంచి మాత్రమే యాప్ పనిచేసేలా మార్పులు
వాస్తవానికి ప్రభుత్వం తెల్లవారుజామునే పంపిణీ చేయాలని ఎక్కడా నిబంధనలు పెట్టలేదు..వేకువజామునే పింఛన్ పంపిణీతో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగులతోపాటు లబ్ధిదారులు కూడా ఇబ్బందిపడుతున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు, లబ్ధిదారుల ఇబ్బందుల్ని ప్రభుత్వం గుర్తించింది. అందుకే ఇకపై ప్రతి నెలా ఉదయం 7 గంటలకు పింఛన్ పంపిణీ ప్రారంభించాలని ఆదేశించారు. ఈ మేరకు ఉదయం 7 గంటలకు మాత్రమే పింఛన్ పంపిణీ చేసే యాప్ పనిచేసేలా అవసరమైన మార్పులు చేశారు.
యాప్‌లో 20 సెకన్ల ఆడియోని ప్లే
అంతేకాదు లబ్ధిదారుల ఇళ్ల దగ్గర నుంచి 300 మీటర్లలోపే పింఛన్ పంపిణీ చేయాల్సి ఉంటుంది. మరోవైపు ఆస్పత్రుల్లో ఉన్నవారు, వృద్ధాశ్రమాలు, స్కూల్స్, కాలేజీల్లో, దివ్యాంగ విద్యార్థులకు, ఉపాధి హామీ పని ప్రదేశంలో, బంధువుల ఇళ్ల దగ్గర పింఛను పంపిణీ చేసినా నమోదుకు అవకాశం కల్పించారు.
ప్రభుత్వ తరఫున పింఛన్ తీసుకునే లబ్ధిదారుల కోసం మెసేజ్‌ను తెలిపేందుకు యాప్‌లో 20 సెకన్ల ఆడియోని ప్లే చేయనున్నారు. ఆ యాప్‌లో లబ్ధిదారుల వివరాలు నమోదు చేసిన తర్వాత ఆ ఆడియో ఆటోమెటిక్‌గా ప్లేకానుంది.