– ఇఫ్కో సెజ్ లో పరిశ్రమల ఏర్పాటుకు ఎంపి వేమిరెడ్డి కృషి చేస్తున్నారు
– సూపర్ సిక్స్ లో 80 శాతం హామీలు అమలు చేసాం
– సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొంటున్న నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు
– పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు సముచిత స్థానం కల్పిస్తాం
– మంత్రి లోకేష్ ప్రవేశపెట్టిన ఒన్ క్లాస్ ఒన్ టీచర్ విధానంతో ప్రభుత్వ విద్యారంగం బలోపేతం అయింది
– పదవులు రాని వారు నిరుత్సాహ పడవద్దు, దశల వారీగా అందరికీ న్యాయం చేస్తాం
– కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
కొడవలూరు: చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చాక ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యాయన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి . సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో భాగంగా ఆమె కొడవలూరు మండలంలోని చంద్రశేఖర పురం, రేగడి చెలిక గ్రామాలలో పర్యటించారు.
ప్రభుత్వ పథకాల అమలు తీరుపై ఆరా తీశారు. మీ ఇంట్లో చదువుకుంటున్న పిల్లలందరికీ ‘తల్లికి వందనం’ పథకం అందిందా అని అడిగి తెలుసుకున్నారు. ఏం పెద్దమ్మా పెన్షన్ వస్తుందా అంటూ ఇంటింటికెళ్లి పలకరించిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి కి గ్రామస్థులు ఆత్మీయ స్వాగతం పలికారు. ఏడాది పాలనలో ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలను ‘ఆమె ఇంటింటికెళ్లి వివరించారు. ప్రజల యోగ క్షేమాలు విచారిస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ప్రతి ఇంట్లోనూ చదువుకుంటున్న పిల్లల గురించి.. ‘ఏం చదువుతున్నారు. చదువెలా సాగుతోందని’ ప్రశ్నిస్తూ.. చదువుతోనే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని చైతన్యపర్చారు. స్థానిక సమస్యలపై వినతి పత్రాలు స్వీకరించారు. ప్రజల సమస్యలను ఓప్పిగా వింటూ చిన్న చిన్న సమస్యలను వెంటనే పరిష్కరించవల్సిందిగా అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ ఇఫ్కో కిసాన్ సెజ్ మరియు మిధాని లలో పరిశ్రమల స్థాపన ద్వారా స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు. ఇఫ్కో, మిధానిలలో పరిశ్రమలకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో కేంద్ర స్థాయిలో కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా చేసిన సూపర్ సిక్స్ హామీలలో 80 శాతం అమలు చేసామన్నారు.
రానున్న నాలుగేళ్లలో కోవూరు నియోజకవర్గంలో రోడ్లు, డ్రైన్లు, తాగునీరు, లాంటి మౌలిక సదుపాయాలతో పాటు పేదల సొంతింటి కల సాకారం చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి కొడవలూరు మండల అధ్యక్షులు నాపా వెంకటేశ్వర్లు నాయుడు, టిడిపి నాయకులు ముంగమూరు శ్రీహరి రెడ్డి, బెల్లం వెంకయ్య నాయుడు, జీవిఎన్ శేఖర్ రెడ్డి, చెముకుల వెంకయ్య, సతీష్ తదితరులు పాల్గొన్నారు.