* ఏ దేశంలో ఉన్నా భావజాలం వదులుకోవాల్సిన పనిలేదు
* హమాస్ చేస్తున్న తప్పులే ఇజ్రాయెల్ చేస్తోంది
* అమెరికాలో ప్రగతిశీల రాజకీయాలు- భారతీయ సమాజానికి వర్తింపు సెమినార్‌లో మేరీలాండ్ మాంట్‌గోమేరీ కౌంటీ ఎగ్జిక్యూటివ్
హైదరాబాద్: సిద్ధాంతాలు, భావజాలం ముందుపెట్టి ప్రజల మనసులు గెలవడం కంటే, అవి వెనుకపెట్టి సేవాభావం ద్వారానే వారి మనసులు గెలవడం సాధ్యమవుతుందని మార్క్ ఎల్రిచ్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని టూరిజం ప్లాజాలో ”అమెరికాలో ప్రగతిశీల రాజకీయాలు- భారతీయ సమాజానికి వర్తింపు” అనే అంశంపై ఎన్ ఆర్ఐ నాగేందర్ మాధవరం అధ్యక్షతన ఆదివారం సాయంత్రం జరిగిన సదస్సులో ఎల్రిచ్ గౌరవ అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
మార్క్ ఎల్రిచ్ అమెరికాకు చెందిన ప్రగతిశీల రాజకీయవేత్త. ప్రస్తుతం ఆయన మేరీల్యాండ్‌లోని మాంట్‌గోమెరీ కౌంటీకి ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నారు. అతను మోంట్‌గోమేరీ కౌంటీ కౌన్సిల్, టకోమా పార్క్ సిటీ కౌన్సిల్‌లో మాజీ సభ్యుడుగా కూడా ఉన్నారు. అమెరికా జనరల్ ఎన్నికల్లో గెలవడానికి ముందు 2018 ప్రైమరీలో మోంట్‌గోమెరీ కౌంటీ ఎగ్జిక్యూటివ్‌కు డెమోక్రటిక్ పార్టీ తరఫున ఎల్రిచ్ నామినీ అయ్యారు.
ఈ సందర్భంగా ఎల్రిచ్ మాట్లాడుతూ…స్థానిక పాలనలో అనేక సంస్కరణలు తెచ్చామని, అందరికీ అందుబాటులో ఇళ్లు, అందరికీ విద్య, అందరికీ ఆరోగ్యం, సుస్థిర అభివృద్ధి విధానాలు, పురుగుమందులు లేని పంటలను ప్రోత్సహించడం వంటి పాలసీల ద్వారా ప్రజల మనసుల్లో స్థానం సంపాదించానన్నాను.
తనకు పోటీగా అత్యంత ధనవంతుడు పోటీ చేసినా, వాషింగ్టన్ పోస్టు లాంటి బలమైన మీడియా తనపై రోజుకో నెగటివ్ వార్త రాసినా కూడా ప్రజలు తనను ఎన్నుకున్నారని చెప్పారు. కోవిడ్ సమయంలో తాను తన ప్రజలకు అవసరమైన మందులు, దుస్తులు, ఆహారపధార్థాలు ముఖ్యంగా చిన్నపిల్లల అవసరాలు ఇంటింటికీ వెళ్లి అందించానని, అందుకే ఎన్నికల్లో కోటీశ్వరులను కాదని తనను ఎన్నుకున్నట్లు చెప్పారు.
అత్యంత ధనవంతుడిపై పోటీ చేస్తున్నా తనకు ఏనాడు ఓటమి భయం లేదని, ఎన్నికల సమయంలో తాను ఇంట్లో హాయిగా బెడ్‌పై పడుకున్నప్పుడు ఒకరు ఇంత ప్రశాంతంగా ఎలా ఉన్నావని అడిగితే..తాను మాత్రం ప్రజలకు వారి తరఫున పనిచేసే నాయకుడు కావాలనుకుంటే తనను ఎన్నుకుంటారని, ఒకవేళ వారు తనను వద్దనుకుంటే హాయిగా విశ్రాంతి తీసుకుంటానని చెప్పినట్లు మార్క్ ఎల్రిచ్ గుర్తు చేశారు.
హమాస్‌కు ఇజ్రాయెల్‌కు తేడాలేదు!
పాలస్తీన- ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధంపై వేసిన ప్రశ్నకు మార్క్ ఎల్రిచ్ సమాధానం చెబుతూ…ఉగ్రవాద సంస్థ హమాస్ చేస్తున్నది తప్పు అన్నారు. హమాస్ చేసిన తప్పులనే ఇజ్రాయెల్ పాలకులు కూడా చేస్తున్నారని, ఇది సమర్థనీయం కాదన్నారు. ప్రతీకారానికి ప్రతీకారం ఎప్పటికీ ఫలితాన్ని ఇవ్వదన్నారు. గాజాలో ప్రజల ఇళ్లలోకి వెళ్లి విధ్వంసం, రక్తపాతం సృష్టించే అధికారం ఇజ్రాయెల్‌కు లేదన్నారు. రెండు దేశాలూ అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలన్నారు.
ఎరిక్ విజయం నియంతలకు గుణపాఠం- నాగేందర్ మాధవరం
మార్క్ ఎరిక్‌పై మల్టీ మిలియనీర్లు పోటీచేసి ఓడిపోయారని, పెట్టుబడిదారుల నుంచి, రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి ఎన్నికల విరాళాలు తీసుకోకుండా ప్రజల మనసు గెలిచిన ఎల్రిచ్ విజయం రాజకీయ నియంతలకు ఒక గుణపాఠం అన్నారు ఎన్ ఆర్ ఐ నాగేందర్ మాధవరం. కమ్యూనిస్టు, చెగువేరా అభిమాని అయిన ఎల్రిచ్ అత్యంత ధనికులపై పోటీ చేసి ఎలా గెలిచారని ఆశ్చర్యపోయాయని, ఆయన ప్రజలతో మమేకమైన తీరు చూశాక భారత్‌లో కూడా ఈ తరహా రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఎన్నో ఇబ్బందులు, నిర్బంధాలు ఎదుర్కొని మార్క్ ఎల్రిచ్ అమెరికా రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారన్నారు. భారత్‌లో వాట్సప్ వేదికగా తప్పుడు ప్రచారం జరుగుతోందని, ఇటీవల ఎర్రకోటను కట్టింది మోడీ అన్న మెసేజ్ చూసి ఆశ్చర్యపోయానన్నారు. డబ్బు, మ్యాన్‌పవర్ లేకుండా ఢిల్లీలాంటి చోట్ల పార్టీలు అధికారం చేపట్టడం అభినందనీయం అన్నారు.
శ్రమదోపిడీని గుర్తించకపోతే మళ్లీ బానిసత్వమే- కట్టా శేఖర్‌రెడ్డి
అమెరికాలాంటి దేశాల్లో మార్క్ ఎల్రిచ్ లాంటి ప్రగతిశీల రాజకీయవేత్తలు విజయం సాధిస్తుండటం చాలా అభినందనీయమని సీనియర్ పాత్రికేయులు, సమాచారహక్కు చట్టం పూర్వ కమిషనర్ కట్టా శేఖర్‌రెడ్డి అన్నారు. ఈ సదస్సుకు గెస్ట్ స్పీకర్‌గా హాజరై ప్రసంగించారు. ఏ దేశంలో ఉన్నా వారి వారి భావజాలాన్ని వదులుకోవాల్సిన పనిలేదని ఎరిక్ విజయం స్పష్టం చేసిందని, ఏ భావజాలం లేని ఒక ప్రమాదకర పరిస్థితిలోకి ప్రస్తుతం దేశం వెళుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఎలాన్ మస్క్ రోజుకు 18 గంటలు పనిచేయాలని పిలుపునిస్తే, ఇంకో అంతర్జాతీయ కంపెనీ చెప్పాపెట్టకుండా ఉద్యోగులను ఇంటికి పంపించేశారన్నారు. ఇటీవల ఇన్ఫోసిస్ నారాయణమూర్తి వారానికి 70 గంటలు పనిచేయమన్నారని, ఇవన్నీ చూస్తుంటే చికాగో వీధుల్లో వీధిపోరాటాలు చేసి సాధించుకున్న రోజుకు 8 గంటల పని హక్కులన్నీ ఏమయ్యాయని ప్రశ్నించారు. కార్మిక హక్కులను చెరిపేసే దుర్మార్గపు పాలనలోకి దేశాన్ని తీసుకెళ్లాలనుకుంటున్నారని, మేల్కొని పోరాడకపోతే మళ్లీ బానిస సంకెళ్లు తగిలించుకోవాల్సి వస్తుందన్నారు.
ఒకే పనికి అమెరికాలో ఉద్యోగి 3 లక్షలు సంపాదిస్తుంటే, భారత్‌లో కేవలం 25 వేలు సంపాదిస్తున్నారని, ఇది కనీస వేతనం కంటే హీనమైన సంపాదన అన్నారు. ఇలా శ్రమను దోచుకోవడానికే పనిగంటలు పెంచే కుట్ర జరుగుతోందన్నారు. ఈ సదస్సులో మాట్లాడిన తెలంగాణ ఆమ్ అద్మీ పార్టీ కన్వీనర్ సుధాకర్ డిండి మోదీ నియంత పోకడలను ఎండగట్టారు. ఈడి, సిబిఐని అస్త్రాలుగా చేసుకుని మోడీ ప్రభుత్వం దేశంలో అరాచకం సృష్టిస్తోందన్నారు.
ప్రత్యర్థి రాజకీయ నాయకులపై ఇప్పటివరకు 5 వేలకుపైచిలుకు కేసులు నమోదు చేసిన మోడీ ఏజెన్సీలు బిజేపీలో చేరిన 2000 మందిపై కేసులు కొట్టేయడం ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. ఆప్ నేతలను అక్రమ కేసుల్లో ఢిల్లీ జైల్లో నిర్బంధించారని, వారు బిజేపీలో చేరుతామంటే వెంటనే విడుదలవుతారన్నారు. ఎల్రిచ్ తరహాలోనే ఆప్ పార్టీ భారత్‌లో ప్రగతిశీల రాజకీయాలు చేస్తోందన్నారు. ఈ సదస్సులో ప్రొ. సత్యనారాయణ పాల్గొని ప్రసంగించారు.