– మంత్రి మండిపల్లి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా
గాజువాక: తెలుగుదేశం ప్రభుత్వం ప్రారంభించిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ప్రజల్లో కూటమి పాలనపై విశ్వాసాన్ని పెంచుతోంది… ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ఇంటింటికీ వెళ్లి నేరుగా ప్రజలకు తెలియజేయడం ద్వారా పాలన ప్రజల గుండెల్లో స్థానం సంపాదిస్తోందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు వారు మంగళవారం గాజువాక నియోజకవర్గంలోని 70వ వార్డులో పర్యటించారు.
వర్షం పడుతున్నా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు కార్యక్రమానికి తరలివచ్చి, మంత్రికి ఘన స్వాగతం పలికారు.
నేతలు కాలనీలో నడుచుకుంటూ ఇంటింటికీ వెళ్లి ప్రజలతో మమేకమయ్యారు. ఇప్పటివరకు ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించడం, రానున్న రోజుల్లో ప్రారంభించబోయే పథకాల గురించి కూడా ప్రజలకు వివరించారు.
ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై నేతలు స్పందించారు. అనంతరం మంత్రి మండిపల్లి కార్యకర్తలతో సమావేశమై ‘సుపరిపాలన – తొలి అడుగు’ కార్యక్రమం లక్ష్యాలు, పార్టీ బాధ్యతలు, ప్రజలతో అనుబంధాన్ని మరింత బలపరిచే మార్గాలను వివరించారు. కార్యకర్తలు ప్రజల సమస్యలకు ప్రాధాన్యం ఇచ్చి, వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లగలిగే శక్తివంతమైన ప్రతినిధులుగా ఉండాలని, నియోజకవర్గ అభివృద్ధిలో క్రియాశీల భాగస్వాములవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.