Suryaa.co.in

Telangana

టీఆర్ఎస్ కు భజన చేసేవారికి పబ్ ల అనుమతి

• మైనర్లకు అనుమతి ఎలా ఇచ్చారు..?
• లైసెన్స్ నిబంధనల ఉల్లంఘనలతోనే రాష్ట్రంలో అఘాయిత్యాలు
• డ్రగ్స్ కేసును సీబీఐకి అప్పగించేందుకు భయమెందుకు..?
• సర్కారు తీరుపై సిఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆగ్రహం

రాష్ట్ర రాజధానిలో జరిగిన బాలిక అత్యాచారం ఘటనలో పోలీసుల దర్యాప్తు నిష్పక్షపాతంగా లేదని, అందువల్ల ప్రభుత్వం సి.బి.ఐ విచారణకు అనుమతించాలని సిఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. టీఆరెస్ కు భజన చేసేవారికి పబ్ ల అనుమతి ఇస్తున్నారని, పబ్ లకు లైసెన్స్ నియంత్రించే ప్రయత్నం చేయకపోవడం వల్ల దారుణ ఘటనలు జరుగుతున్నాయని అన్నారు. పబ్ లలోకి మైనర్లకు అనుమతి లేకపోయినా.. మద్యం సరఫరా చేయకూడదనే నిబంధన ఉన్నప్పటికీ ఎందుకు ఉల్లంఘించారని ప్రశ్నించారు.

అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద శనివారం మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తో కలిసి ఆయన మాట్లాడుతూ.. డ్రగ్స్ కు అడ్డాగా హైదరాబాద్ మారుతోంది.. లా అండ్ ఆర్డర్ లో ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీకు లేదా అని హోంమంత్రిని నిలదీశారు. పబ్, డ్రగ్ కల్చర్ ని నియంత్రించలేని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఘటనకు బాధ్యత వహించాలన్నారు.

సర్కారుకు భయమెందుకు..?
డ్రగ్స్ కేసును సిబిఐ విచారణకు అప్పగించడానికి ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని భట్టి విక్రమార్క ప్రశ్నించారు. హోంమంత్రి తన విధిని సక్రమంగా నిర్వర్తించడని, దీనిపై అడిగితే కలవకుండా అరెస్ట్ చేస్తారా? అని మండిపడ్డారు. దోషులను శిక్షించాలని హోంమంత్రి, డీజీపీని కలవడానికి వెళ్లిన మహిళ కాంగ్రెస్ నేతలను అక్రమ అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

“తెలంగాణ తెచ్చుకున్నది మద్యాన్ని విచ్చలవిడిగా అమ్మడానికేనా? మద్యాన్ని ఆదాయ వనరుగా ప్రభుత్వం చూడటం వల్లనే రాష్ట్రంలో క్రైమ్ రేటు పెరిగిపోతున్నది. డ్రగ్స్, మద్యం మత్తులో అమ్మాయిలపై ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నా నియంత్రించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందుతున్నది” అని తెలిపారు. మైనర్ బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే నిందితులను అరెస్టు చేయడానికి ఎందుకు తాత్సరం చేస్తున్నారని, హోంమంత్రి, పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు భయపడుతుందో చెప్పాలన్నారు. రాజకీయ పలుకుబడి ఎంత ఉన్నవారైనా నిందితులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

LEAVE A RESPONSE