జగన్ రెడ్డి పాలనలో ప్రజల ఆహార భద్రతకు తూట్లు

టీడీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తహశీల్దార్ కార్యాలయాల్లో వినతిపత్రాలు

జగన్‌ రెడ్డి పాలనలో పేద ప్రజలకు ఆహార భద్రత ప్రశ్నార్ధకంగా మారిందని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఉచిత బియ్యం పంపిణీలో చేస్తున్న మోసం, రేషన్ కార్డుల ఎగవేత, రేషన్ షాపుల్లో ఇచ్చే సరుకుల కుదింపు, ధరల పెంపు, ధరల నియంత్రణలో వైఫల్యాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. అనంతరం తహశీల్దార్, కలెక్టర్, జాయింట్ కలెక్టర్, కార్యాలయాల్లో వినతిపత్రాలు అందజేశారు.

కేంద్ర ప్రభుత్వం పేదల ఆకలి తీర్చేందుకు ఉచిత బియ్యం పథకాన్ని ప్రవేశపెడితే… ఏప్రిల్‌ నుంచి బియ్యం పంపిణీని నిలిపివేయడం దారుణమన్నారు. ఆహార భద్రతను కాపాడేలా చేపట్టిన ఉచిత బియ్యం పథకాన్ని కూడా జగన్ రెడ్డి నాశనం చేశారన్నారు. నాలుగు నెలలుగా పథకాన్ని నిలిపివేసి, ఈ నెల చేపట్టే పంపిణీలో కూడా కొంత మందికి మాత్రమే పంపిణీ చేయడాన్ని ఆక్షేపించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు చేపట్టిన ఉచిత బియ్యం పంపిణీని NFSA కార్డులతో పాటు మిగిలిన కార్డుదారులకు కూడా అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు.

అదే సమయంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 1.47 కోట్ల రేషన్ కార్డులు అందుబాటులో ఉంటే.. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక కార్డుల్ని అడ్డగోలుగా తొలగించడం దుర్మార్గమన్నారు. రేషన్ కార్డులను పునరుద్దరించాలి. అదే సమయంలో రేషన్ షాపుల్లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇచ్చినట్లుగా బియ్యం, కందిపప్పు, పంచధార, గోధుమలు, గోధుమ పిండి, చిరుధాన్యాలు, వంట నూనె, ఉప్పు వంటి సరుకుల పంపిణీని పునరుద్దరించాలి. రేషన్ వ్యవస్థను ఉద్దరిస్తున్నామంటూ ప్రచారం చేసుకుంటూ.. కేవలం బియ్యం పంపిణీకి మాత్రమే పరిమితం చేయడం ఆహార భద్రతా చట్టాన్ని ఉల్లంఘించడమేనని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేషన్ షాపుల్లో కందిపప్పు, పంచధార ధరల్ని పెంచడాన్ని కూడా ఆక్షేపించారు.

“ప్రజలకు ఆహార భద్రత అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు. ఆ హక్కును కాలరాస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిత్యవసర వస్తువుల ధరల్ని నియంత్రించకపోవడం దారుణమన్నారు. నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు రూ.3వేల కోట్లు బడ్జెట్లో పెడతామని మేనిఫెస్టోలో పెట్టిన జగన్ రెడ్డి.. ఇప్పుడు ధరల నియంత్రణను గాలికి వదిలేశారన్నారు. నియంత్రణ పక్కన పెట్టి అధికార పార్టీ నేతలతో బ్లాక్ మార్కెట్ ను పెంచి పోషిస్తున్నారన్నారు. తెలుగుదేశం అధికారంలో ఉన్నపుడు ఏటా సుమారు రూ.1000 కోట్ల వ్యయంతో సంక్రాంతి కానుకలు, క్రిస్మస్ కానుకలు, రంజాన్ కానుకను 1.47 కోట్ల రేషన్ కార్డుదారులకు అందించేది. కానీ నేడు కానుకలు రద్దు చేశారు. ఇచ్చే సరుకుల సంఖ్యనూ కుదించారు. చివరికి పేదలకు ఉచిత బియ్యం ఇచ్చేందుకు రాష్ట్ర వాటాగా రూ.250 కోట్లు ఇవ్వడానికి మనసొప్పక ఏకంగా ఉచిత బియ్యం పంపిణీకే తిలోదకాలివ్వడం అత్యంత దుర్మార్గం అన్నారు.

ప్రజల ఆకలి తీర్చడానికి మనసొప్పని జగన్ రెడ్డి.. రాష్ట్రాన్ని ఉద్దరించేస్తానంటూ ప్రతిపక్ష నేతగా అడ్డగోలు హామీలిచ్చి.. అధికారంలోకి వచ్చాక ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని నేతలు మండిపడ్డారు. జగన్ రెడ్డి ఇప్పటికైనా ప్రజల్ని మాయ మాటలతో మోసం చేయడం మాని ప్రజల ఆకలి తీర్చడంపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. జగన్ రెడ్డి ఇంకా మాయ మాటలతో కాలం వెలిబుచ్చాలని చూస్తే.. ప్రజల తరపున తెలుగుదేశం పార్టీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తుందని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో పొలిట్‌బ్యూరో సభ్యులు గుమ్మడి సంధ్యారాణి, చింతకాయల అయ్యన్నపాత్రుడు, నిమ్మకాయల చినరాజప్ప, మాజీ మంత్రులు కిడారి శ్రావణ్, గొల్లపల్లి సూర్యరావు, దేవినేని ఉమా, పార్లమెంట్ అధ్యక్షులు కిమిడి నాగార్జున, బుద్దా నాగజగధీష్, రెడ్డి అనంతకుమారి, గన్ని వీరాంజనేయులు, తోట సీతారామలక్ష్మి, గొల్లా నరసింహ యాదవ్, పులివర్తి నాని, అబ్ధుల్ అజీజ్, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి భవాని, నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజు, ఎమ్మెల్సీ అంగరరామ్మోహన్, దొరబాబు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, మాజీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply