– ఇద్దరిదీ విధ్వంసకర భావజాలమే
– కేంద్రం ఇచ్చిన పేదల బియ్యాన్ని బొక్కేసిన వైసీపీ నేతలు
– 10 లక్షల టన్నుల్లో 5 లక్షల బియ్యం విదేశాలకు తరలింపు
– సంపదను కుటుంబ ఖాతాలోకి మళ్లిస్తున్నారు
– పులివెందులలో జగన్‌కు మద్దతు సగమే
– పులివెందులకు వెళితే ప్రొద్దుటూరులో బ్యారికేడ్లా? హవ్వ
– తన వైఫల్యాన్ని ఎమ్మెల్యేలపై రుద్దుతున్న జగన్
– బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ అధికార వైసీపీపై విభ్రాంతికర-సంచలన ఆరోపణలు గుప్పించారు. జగన్ నేతృత్వంలోని వైసీపీని ఇటీవల కేంద్రం నిషేధించిన పిఎఫ్‌ఐ ఉగ్రవాద సంస్థతో పోల్చారు. ఆ పార్టీది విధ్వంసకర భావజాలమంటూ విరుచుకుపడిన వైనం, ఏపీ రాజకీయాలను కుదిపివేసింది. ఇప్పటివరకూ వైసీపీని గూండాపార్టీ-రౌడీలపార్టీ-అవినీతి పార్టీ అని విపక్షాలు విమర్శిస్తున్న నేపథ్యంలో.. బీజేపీ ఒక్కసారిగా స్వరం పెంచి దానిని పిఎఫ్‌ఐ ఉగ్రవాద సంస్థలతో పోల్చడంతో రాజకీయవర్గాలు ఉలిక్కిడ్డట్టయింది. కారణం .. ఇప్పటివరకూ అంత తీవ్రంగా, ఒక నిషేధిత ఉగ్రవాద సంస్థతో పోల్చినవారెవరూ రలేకపోవడమే! దీనితో ఇప్పటివరకూ బీజేపీ-వైసీపీ రహస్యమిత్రులంటూ జరుగుతున్న ప్రచారానికి తెరపడి.. ‘బీజేపీనే వైసీపీకి అసలైన శత్రువ’న్న భావన మొగ్గతొడిగేందుకు అవకాశం ఏర్పడింది.
‘‘వైసీపీ-పిఎఫ్‌ఐ రెండూ ఒకటే. నిషేధిత ఉగ్రవాద సంస్ధ పిఎఫ్‌ఐ మనస్తత్వానికి, వైసీపీ మనస్తత్వానికీ పెద్దగా తేడా లేదు. ఇద్దరూ విధ్వంసకర భావజాలంతోనే పనిచేస్తున్నారు. ప్రజావ్యతిరేకతపై సీఎం జగన్ ఆత్మపరిశీలన చేసుకోవాలి. పులివెందులలో కూడా జగన్‌కు 50 శాతం ప్రజలు మాత్రమే మద్దతునిస్తున్నట్లు ప్రశాంత్‌కిశోర్ టీం సర్వేలో వెల్లడైంది. కానీ జగన్ మాత్రం, ఎమ్మెల్యేలపై నెపం నెట్టేందుకు ప్రయత్నిస్తున్నార‘’ని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.జగన్ చివరకు తన సొంత నియోజకవర్గమైన పులివెందులకు వెళ్లినా బారికేడ్లు కట్టుకోవలసిన దుస్థితి ఏర్పడిందని ఎద్దేవా చేశారు. అందుకే ఆయనకు సొంత గడ్డపై సగం బలమే ఉన్నట్లు పీకే సర్వేలో తేలిందన్న విషయాన్ని సత్యకుమార్ బయటపెట్టారు. బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ, బీజేపీ ఫీడ్‌బ్యాక్ ప్రముఖ్ లంకాదినకర్, జిల్లా అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణతో కలసి గుంటూరులో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో సత్యకుమార్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో తీవ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నందుకు కేంద్రం ఇటీవలే పిఎఫ్‌ఐను నిషేధించిన విషయం తెలిసిందే.
పనిలోపనిగా ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకాన్ని రాష్ట్రంలో వైసీపీ నేతలు బొక్కేస్తున్నారంటూ మరో సంచలన విషయాన్ని బయటపెట్టారు. ఏపీకి 10 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఇస్తే అందులో 5 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అధికార వైసీపీ నేతలు విదేశాలకు అక్రమంగా తరలించాలని ఆరోపించారు.
ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని మరో మూడు నెలలు పొడిగించినట్లుసత్యకుమార్ తెలిపారు. శాసన సభ్యుల సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ ఆత్మస్తుతి, పరనిందకు పాల్పడ్డారని, గడపగడపకు వెళ్తున్న వారికి ప్రజల నుంచి ఛీత్కారాలు ఎదురవుతున్నాయన్నారు. సీఎం జగన్ కూడా సొంత ఊరికి వెళ్లలేని పరిస్థితి నెలకొందన్నారు.
ముఖ్యమంత్రి పులివెందుల వస్తుంటే ప్రొద్దుటూరులో కూడా బారికేడ్లు పెట్టారని, ప్రజా వ్యతిరేకతపై ముఖ్యమంత్రి ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. పులివెందులలో కూడా జగన్‌కు 50 శాతం ప్రజలు మాత్రమే మద్దతు ఇస్తున్నట్లు పీకే టీం సర్వేలో వెల్లడైందని, కానీ ఆయన మాత్రం ఎమ్మెల్యేలపైన నెపం మోపేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు.
గృహ నిర్మాణంపై ముఖ్యమంత్రి జగన్ ఎన్నిసార్లు సమీక్ష చేసినా పనుల్లో పురోగతి లేదని సత్యకుమార్ విమర్శించారు. మూడున్నరేళ్లలో గృహ నిర్మాణానికి ముఖ్యమంత్రి చేసిందేంటి?.. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లను ఎందుకు నిర్మించడం లేదు? కేంద్రం ఇచ్చిన నిధులు ఏమయ్యాయో కూడా సమాధానం లేదని విమర్శించారు. గుంటూరులో గత ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను కూడా లబ్ధిదారులకు ఇవ్వటం లేదన్నారు. రాష్ట్రంలో ఎక్కడా పది శాతం కంటే ఎక్కువ ఇళ్లు నిర్మించలేదని ఆరోపించారు.
పులివెందుల నియోజకవర్గంలో 21 వేల ఇళ్లు మంజూరైతే కేవలం 15 వందలు మాత్రమే నిర్మాణం చేశారన్నారు. ఈ క్రాప్ విషయంలో ప్రభుత్వ వైఖరితో రైతులు నష్టపోతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతి విషయంలోనూ విఫలమైందని సత్యకుమార్ విమర్శించారు.
‘‘రాష్ట్రంలో ఎక్కడా పది శాతం కంటే ఎక్కువ ఇళ్లు నిర్మించలేదు. ఈ క్రాప్ విషయంలో ప్రభుత్వ వైఖరితో రైతులు నష్టపోతున్నారు కేవలం 60 శాతం మాత్రమే ఈ క్రాప్ జరిగింది. మరి ప్రభుత్వం నియమించిన వాలంటీర్ల వ్యవస్థ ఏం చేస్తోంది?
సూక్ష్మసేద్యానికి కేంద్రం నిధులు మంజూరు చేసినా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందించటం లేదు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతి విషయంలోనూ విఫలమైంది. రాష్ట్రంలో కొత్తగా ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా?కేంద్రం ఇచ్చే ఉద్యోగాలు కూడా తమ ఖాతాలో వేసుకుంటున్నారు.అవినీతిలో రాష్ట్రాన్ని మొదటి స్థానానికి చేర్చారు. సంపదను కుటుంబ ఖాతాలోకి మళ్లిస్తున్నారు.
ప్రజాపోరు ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు,ప్రజాపోరు కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం కుట్రలు.ప్రభుత్వం చౌకబారు చర్యలకు దిగుతోంది.తెనాలిలో ప్రజాపోరు రథాన్ని కాల్చి వేశారు.రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు.ప్రజల పక్షాన నిలిచే బిజెపిని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు.తెనాలిలో బిజెపి ప్రజాపోరు వాహనం దహనం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి‘‘అని సత్యకుమార్ డిమాండ్ చేశారు.
విలేఖరుల సమావేశంలోప్రజా పోరు ప్రోగ్రాం జిల్లా కన్వీనర్లు పాలపాటి రవికుమార్, ఆవుల నాగేంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శిలు కుమార్ గౌడ్, గారపాటి పూర్ణ, రాచుమల్లు భాస్కర్, కోపరేటివ్ సెల్ రాష్ట్ర కో కన్వీనర్ వనమా నరేంద్ర, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.