Home » హైకోర్టుకు చేరిన ఫోన్ ట్యాపింగ్ కేసు

హైకోర్టుకు చేరిన ఫోన్ ట్యాపింగ్ కేసు

– సుమోటోగా తీసుకున్న తెలంగాణ హైకోర్టు
– న్యాయమూర్తి ఫోన్ కూడా ట్యాప్ అయిందన్న ఆరోపణ
– కేసీఆర్‌కు ఫోన్‌ట్యాపింగ్ ఉచ్చు
(అన్వేష్)

ఇప్పటిదాకా సోషల్‌మీడియా గాసిప్స్.. కాంగ్రెస్-బీఆర్‌ఎస్-బీజేపీ ఆరోపణలు, ప్రత్యారోపణలకే పరిమితమైన తెలంగాణ పోలీసుల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. ఆ కేసును సుమోటోగా తీసుకుంటున్నట్లు హైకోర్టు స్పష్టం చేసింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీజేజీ వ్యవహారంలో హైకోర్టు న్యాయమూర్తి ఫోన్‌ను సైతం, నాటి కేసీఆర్ సర్కారు ట్యాపింగ్ చేసినట్లు మీడియాలో కథనాలు రావడంతో, హైకోర్టు స్పందించింది.

బీఆర్‌ఎస్ ముచ్చటగా మూడోసారి అధికారం లోకి వచ్చేందుకు కాంగ్రెస్-బీజేపీ నేతలతోపాటు, హైకోర్టు న్యాయమూర్తులు, సినిమా తారలు, పారిశ్రామికవేత్తల ఫోన్లు ట్యాపింగ్ చేశామని, నాటి పోలీసు అధికారి భుజంగరావు వాంగ్మూలం ఇచ్చినట్లు మీడియాలో వెలువడిన కథనాలను తేల్చేందుకు హైకోర్టు రంగంలోకి దిగటం సంచలనం సృష్టిస్తోంది. పోలీసుల వాహనాలలోనే బీఆర్స్ అభ్యర్ధులకు డబ్బులు సమకూర్చామని భుజంగరావు వెల్లడించారు. ఈ కథనాలను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక అరాదే ధర్మాసనం, మంగళవారం మధ్యాహ్నం ఈ పిటిషన్‌ను విచారించాలని నిర్ణయించింది.

హైకోర్టు నిర్ణయంతో కేసీఆర్ చిక్కుల్లో పడక తప్పదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ కేసులో అరెస్టయిన పోలీసు అధికారుల వాంగ్మూలాల ఆధారంగా హైకోర్టు తీర్పు ఇస్తే, బీఆర్‌ఎస్ అధినేతకు కష్టాలు తప్పవంటున్నారు. ఎవరి ఆదేశాల మేరకు తాము ఫోన్ ట్యాపింగ్ చేశామన్న వివరాలు హైకోర్టు దృష్టికి వెళితే, ట్యాపింగ్ చేసిన వారితోపాటు, ఆదేశించిన వారికీ శిక్ష తప్పదని అటు న్యాయవాద వర్గాలు సైతం స్పష్టం చేస్తున్నాయి.

అయితే కేసీఆర్ అలాంటి ఆదేశాలన్నీ మౌఖికంగానే తప్ప, రాతపూర్వకంగా ఇవ్వనందున, ఆయనకు వచ్చిన భయమేమీ లేదని మరికొందరు వాదిస్తున్నారు. అయితే గియితే ట్యాపింగ్ చేసిన అధికారులే బలి అవుతారంటున్నారు. అసలు ఈ కేసు తేలదని, దానికి సాక్ష్యాలు లేకపోవడమే కారణమని ఇంకొందరు వాదిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఎన్నికల ఫతితాల రోజునే.. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు రావడం, బీఆర్‌ఎస్‌కు ఇబ్బందికర పరిణామమేనంటున్నారు.

Leave a Reply