– డొల్ల బోర్డులు, బినామీ లింకుల బండారం!
(చాకిరేవు)
‘లిక్కర్ స్కామ్’ దర్యాప్తులో సిట్ బృందాలు బయటపెడుతున్న నిజాలు చూస్తే, వీరు కేవలం స్కామే కాదు, అసలు ‘డొల్ల కంపెనీల’ సామ్రాజ్యాన్నే సృష్టించారని అర్థమవుతోంది.
చిత్తూరు, తిరుపతి, హైదరాబాద్‌లలో జరిగిన సిట్ సోదాలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్. ఈ సోదాల్లో ప్రధానంగా చిక్కుకున్న పేర్లు – చిత్తూరు బిగ్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆయన కుమారుడు ‘పిల్ల’ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి.
వీరికి చెందిన కంపెనీల్లో సిట్ బృందాలు తనిఖీలు చేస్తే బయటపడింది కేవలం డొల్ల కంపెనీల వ్యవహారం మాత్రమే కాదు, అధికార పార్టీ పెద్దల లింకుల బండారం కూడా.
చిత్తూరులోని మోహిత్‌రెడ్డికి చెందిన ఇన్ఫ్రా కంపెనీకి వెళ్తే, వెల్‌టాస్క్ ఫుడ్ అండ్ బెవరేజెస్ బోర్డు స్వాగతం పలికిందట. ఈ వెల్‌టాస్క్ ఫుడ్ కంపెనీ చిత్తూరు పుష్పా విజయానంద్రెడ్డికి చెందినదిగా గుర్తించారు.
బహుశా ఇది ‘స్కామ్ ఆర్కిటెక్చర్’లో మొదటి అడుగు కాబోలు. పేరుకు ఒక కంపెనీ, బోర్డుకు మరో కంపెనీ.. ఈ ‘కార్పొరేట్ టెక్నిక్’లను చూసి ఐఐఎం విద్యార్థులు కూడా ఆశ్చర్యపోతారేమో!
హైదరాబాద్‌లోని ప్రశాంతి హిల్స్‌లో ఉన్న భీం స్పేస్ ఆఫీసుకు వెళ్తే, అక్కడ ఇషా ఇన్ఫ్రా పేరుతో ఒక బోర్డు కనిపించిందట. ఈ కంపెనీ డైరెక్టర్లుగా ఉన్నది మరెవరో కాదు.. పిల్ల సజ్జల భార్గవరెడ్డి, ప్రద్యుమ్న. ఈ ప్రద్యుమ్న ఎవరంటే.. ఎన్నికల్లో పట్టుబడిన రూ.8 కోట్లు తనవే అని క్లెయిమ్ చేసుకున్న మహాశయుడు.
లిక్కర్ స్కామ్ నిందితులు, రికార్డుల్లో ఒక కంపెనీ, వాస్తవంలో మరొక కంపెనీని చూపించడం వెనుక ఉన్న మతలబు ఏమిటి? ఇది కేవలం ‘బినామీ’ల వ్యవహారమేనా?
నిఘా వర్గాలను, దర్యాప్తు సంస్థలను సైతం ఆశ్చర్యపరుస్తున్న ఈ ‘డొల్ల కంపెనీల’ నెట్వర్క్ ఎంత పెద్దది?
చిత్తూరు, కడప జిల్లాలకు చెందిన ‘లిక్కర్ రెడ్డి’లు, ‘పిల్ల రెడ్డి’లు రాష్ట్రాన్ని ఒక అప్పుల కుప్పగా మార్చడమే కాకుండా, స్కామ్‌ల కోసం డొల్ల కంపెనీలను జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసే స్థాయికి తెగించి, ఇలా పట్టుబడుతున్నారు.