జనసేన పార్టీ కి పీతల మూర్తి యాదవ్ రాజీనామా

- సిట్టింగ్ కార్పొరేటర్ అయినా టిక్కెట్ ఇవ్వకుండా అన్యాయం చేశారు
- 6000 జనసేన ఉద్యమి సభ్యత్వం చేసినా గుర్తింపే లేదు
- స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగితే ఓడించటానికి కుట్రలు చేశారు
- పార్టీలో లేకపోయినా పోరాటాలు కొనసాగుతాయి
- విలేకర్ల సమావేశంలో పీతల మూర్తి యాదవ్
విశాఖపట్నం: జనసేనకు విశాఖ నగర సీనియర్ నేత, మాజీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ రాజీనామా చేశారు. మంగళవారం విశాఖలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు రాసిన రాజీనామా లేఖను మూర్తి యాదవ్ విడుదల చేశారు. జనసేన లో తనకు అవకాశం కల్పించి విశాఖ నగరం తో పాటు ఉత్తరాంధ్రలో వేల కోట్ల ప్రభుత్వ ఆస్తులను కాపాడే పోరాటాలు చేసే స్వేచ్ఛను, స్ఫూర్తినిచ్చిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు .
జనసేనలో గత 2021 జీవీఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్ టిక్కెట్ ఇవ్వటంతో పాటు నా పోరాటాలకు మద్దతు గా నిలచి రాష్ట్రవ్యాప్తంగా జనసేనకు తద్వారా వ్యక్తిగతంగా నాకు పేరు ప్రఖ్యాతలు రావడానికి ఎంతగానో మీరు సహకరించారని, అయితే స్థానిక నేతలు టికెట్ ఇవ్వకుండా ఎన్నికలలో గెలవకుండా అడుగడుగున అడ్డుపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఋషికొండ పై పోరాటం
గత వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా రుషికొండపై నిర్మించిన ప్యాలస్ లోకి అప్పటి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అడుగు పెట్టకుండా మీ సహకారంతో న్యాయపోరాటం చేసి అడ్డుకోగలిగాను. నా పట్ల నమ్మకంతో మీరు కూడా స్వయంగా వచ్చి ఋషికొండ ప్యాలెస్ ను సందర్శించి దీనిని అడ్డుకొని తీరతామని శపథం చేశారు.
అదేవిధంగా విశాఖ నగరం నడిబొడ్డున సి.బి.సి.ఎన్.సి క్రైస్తవ సంస్థ స్థలంలో నిబంధనలకు విరుద్ధంగా అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ లోక్ సభ సభ్యుడు ఎం.వీ.వీ సత్యనారాయణ ప్రారంభించిన బహుళ అంతస్తుల నిర్మాణాన్ని పిటిషన్ల ద్వారా న్యాయ పోరాటాల ద్వారా మీ సహాయ సహకారాలతో ఆపగలిగాను. నాపై నమ్మకంతో మీరు కూడా ఆ స్థలాన్ని సందర్శించారు. అందులోని 3600 గజాల స్థలం సాంఘిక సంక్షేమ శాఖకు చెందుతుందని ఆధారాలతో లేఖలు అధికార యంత్రాంగానికి సమర్పించి 100 కోట్ల విలువైన భూమిని ప్రభుత్వానికి అప్పగించగలిగాను. దాని వెనుక మీ సహాయ సహకారాలు ఉన్నాయి అని పేర్కొన్నారు.
హయగ్రీవ ఆగింది
అదేవిధంగా ఋషికొండలో పేదలు వృద్ధులు వికలాంగుల కోసం హయగ్రీవ సంస్థ కు కేటాయించిన స్థలంలో అప్పటి లోక్సభ సభ్యుడు ఎం.వి.వి సత్యనారాయణ మరికొందరు వైసీపీ పెద్దలు విల్లాల ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభిస్తే న్యాయపోరాటం ద్వారా దానిని కూడా అడ్డుకున్నాను. దానిని నా పోరాటం కారణంగా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని నిర్మాణాలను నిలిపివేసింది. ఇప్పటికీ అదే పరిస్థితి అక్కడ కొనసాగుతోంది అని పేర్కొన్నారు.
విజయ సాయి పునాదుల తొలగింపు
భీమిలి బీచ్ రోడ్ లో అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు పి.విజయసాయిరెడ్డి సి.ఆర్.జెడ్ నిబంధనలకు విరుద్ధంగా ప్రారంభించిన వాణిజ్య సముదాయాన్ని హైకోర్టు ఉత్తర్వుల ద్వారా ఆపించగలిగాను. సముద్రంలో నిర్మించిన కట్టడాలను 80 లక్షల రూపాయలు ఆయన ఖర్చుతోనే తీయించగలిగాను. జీవీఎంసీ చరిత్రలోనే మొదటిసారిగా కబ్జాదారుడు ద్వారానే కబ్జా స్థలాన్ని తొలగించడానికి అయిన ఖర్చులను ఆయనతోనే జీవీఎంసీ కి ఖర్చులను జమ చేయించ గలిగాను అని స్పష్టం చేశారు.
వేల కోట్ల ప్రీ హోల్డ్ భూముల కుంభకోణం వెలుగులోకి
ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వేల కోట్ల రూపాయల ప్రీ హోల్డ్ భూములను వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి నేతృత్వంలో కాజేయటానికి ప్రయత్నించినప్పుడు వాటన్నింటినీ బయటపెట్టాను. వేల కోట్ల డి పట్టా భూములు ఫ్రీ హోల్డ్ ముసుగులో దళితుల నుంచి పెద్దల చేతుల్లోకి వెళ్ళకుండా కాపాడ గలిగాను. ఇప్పటికీ ఆ భూముల విషయంలో నా పోరాటం కారణంగా అదే పరిస్థితి కొనసాగుతోంది.
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అప్పటి పెద్దలు ఐటి హిల్స్ సమీపంలోని 97 ఎకరాల ఎన్.సి.సి భూములను నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం చేశారు. వాటిపై పోరాటం చేసి నిలువురించడం తో పాటు 36 కోట్ల రూపాయల వి.ఎల్.టి పన్ను విధించేలా పోరాటాల ద్వారా చేయగలిగాను. ఆ స్థలాల వినియోగంలో నిబంధనల అతిక్రమణ జరగకుండా చూశాను అని మూర్తి యాదవ్ పేర్కొన్నారు.
వైసీపీ కార్యాలయంగా మారిన ఏ.యూ పై పోరాటం
గత ప్రభుత్వ హయాంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు గా మారిన వైనాన్ని ప్రజల దృష్టికి తీసుకురావడంతో పాటు విశ్వవిద్యాలయంలో చెట్లు కొట్టి చెరువులు పూడ్చివేసి పెద్ద ఎత్తున చేసిన పర్యావరణ నష్టంపై హైకోర్టులో కేసులు వేసి కొంతమేర ఆప గలిగాను. విశ్వవిద్యాలయం పాలన వ్యవహారాల్లో వైసీపీ పెద్దల పాత్రను వెలుగులోకి తీసుకువచ్చి విద్యాలయం పాలన గాడి తప్పకుండా మీ సహాయ సహకారాలతో చేయగలిగాను అని స్పష్టం చేశారు
వందల కోట్ల ఆధ్యాత్మిక ఆస్తులు
విశాఖలో వందల కోట్ల విలువైన శాంతి ఆశ్రమం ,ప్రేమ సమాజం భూములపై ప్రైవేటు వ్యక్తులు కన్ను వేసినప్పుడు అవి సొసైటీ చేతిలో నుంచి వెళ్లకుండా చూడగలిగాను. వీటికి సంబంధించిన కార్యక్రమంలో ముల్లంగిందలపై ప్రభుత్వానికి ఫిర్యాదులు చేయటం అధికారుల దృష్టికి తీసుకువెళ్లి తక్షణ చర్యలు తీసుకునేలా చూడగలిగాను అని స్పష్టం చేశారు.
వేలకోట్ల టిడిఆర్ ల కుంభకోణం పై పోరాటం
రాష్ట్రవ్యాప్తంగా వేలకోట్ల టిడిఆర్ కుంభకోణం వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగినప్పుడు దానిని బట్టబయలు చేసి చాలావరకు నియంత్రించ గలిగాను. ఆ పోరాటాన్ని విశాఖలో మొట్టమొదట నేనే ప్రారంభించాను. వందల కోట్ల విలువైన టిడిఆర్ బాండ్ల కోసం అక్రమంగా చేసిన దరఖాస్తులను వెలుగులోకి తీసుకువచ్చి ఆపించగలిగాను. అప్పటి టిడిఆర్ దరఖాస్తులు ఇప్పటికీ పెండింగ్ లోనే ఉన్నాయి అంటే అందుకు కారణం జనసేన ద్వారా నేను చేసిన పోరాటమే. మురికివాడల నివారణ పేరుతో విశాఖ నగరంలోని పలు ప్రాంతాల్లో వేల కోట్ల టీడిఆర్లు కొట్టే సేందుకు వైసిపి పెద్దలు చేసిన ముమ్మర ప్రయత్నాలను పోరాటాల ద్వారా నిలువరించ గలిగాను అని వివరించారు.
ప్రభుత్వ పార్కులు కాపాడటం
వందల కోట్ల విలువైన విశాఖలోని పార్కు స్థలాలను కొందరు ప్రభుత్వ పెద్దల సహకారంతో నేతలు కబ్జా చేయడానికి ప్రయత్నించినప్పుడు వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చి పోరాటాల ద్వారా వాటిని కాపాడటంలో క్రియాశీలక పాత్ర పోషించాను. మధురవాడ లోని బటర్ఫ్లై పార్క్, నరవ లోని సోషల్ వెల్ఫేర్ పార్క్, ఈస్ట్ పాయింట్ కాలనీలోని రెండు పార్కులు, ఫ్యాకర్ లేఔట్ పార్కులు ఇలా కాపాడిన జాబితాలో ఉన్నాయి. పార్కు స్థలాలకు స్మశానాల కు టీడీపీ పొందేందుకు కొందరు నేతలు చేసిన ప్రయత్నాలను బహిర్గతం చేసి నిలువరించగలిగాను అని అన్నారు.
వి.ఎం.ఆర్.డి.ఏ మాస్టర్ ప్లాన్ అక్రమాలు
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ ఆ తరువాత వి.ఎం.ఆర్.డి.ఏ మాస్టర్ ప్లాన్ లో వేలకోట్ల విలువైన అక్రమాలు జరిగాయి. వాటన్నిటిని ప్రజల దృష్టికి తీసుకువచ్చి పోరాటాలు చేయటం వల్ల కూటమి ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ లో మార్పులు తీసుకువచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విఎంఆర్డీఏలో ఫిక్స్ డిపాజిట్ లో కుంభకోణానికి పాల్పడిన అప్పటి కమిషనర్ తేజ్ భరతును బదిలీ చేయించగలిగాను అని వివరించారు.
పవన్ కళ్యాణ్ కోసం జైలుకు
పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ వచ్చినప్పుడు ఆయనకు స్వాగతం పలికేందుకు విమానాశ్రయానికి వెళ్లిన నేతలపై వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో పోలీసు అక్రమంగా కేసులు పెట్టి జైలుకు పంపిన కొద్దిమందిలో నేను ఉన్నాను. పదిరోజుల పాటు విశాఖ సెంట్రల్ జైల్లో ఉన్నాను. జైలుకు వెళ్లిన పలువురు దానిని క్లైమ్ చేసుకొని పార్టీలో ప్రభుత్వంలో పదవులు పొందగా నాకు మాత్రం ఉన్న కార్పొరేటర్ టిక్కెట్ కూడా ఇవ్వకుండా అన్యాయం చేశారు. ఈ కేస్ తో పాటు వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో పోరాటాలు చేసినందుకు పలు కేసులను ఎదుర్కొని ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నాను అని ఆవేదన వ్యక్తం చేశారు.
కార్పొరేటర్ గా అభివృద్ధి
విశాఖ 22వ వార్డు కార్పొరేటర్ గా వార్డు అభివృద్ధికి కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించి పలు ప్రాజెక్టులు పూర్తి చేయించ గలిగాను. జీవీఎంసీ లోనే అధికంగా రికార్డు స్థాయిలో 50 కోట్ల రూపాయల పైగా పనులు మా వార్డులో జరిగాయి. వీటితో పాటు నిబద్ధత గల జన సైనికుడిగా పార్టీ కార్యక్రమాలన్నీ తూచా తప్పకుండా నిర్వహించాను. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తదితరులపై విపక్షాలు చేసే ఆరోపణలను ఎప్పటికప్పుడు ఖండిస్తూ కార్యక్రమాలు చేయటం విలేకరుల సమావేశాలు నిర్వహించడం జరిగింది. దీనితోపాటు రాష్ట్రంలోనే అత్యధికంగా ఒక కార్పొరేటర్ స్థాయిలో 6000 జనసేన సభ్యత్వాలను ఈ ఏడాది చేర్పించాను. ఇందుకు గుర్తింపుగా మంగళగిరి కార్యాలయానికి పిలిచి సన్మానం కూడా చేశారు. విచిత్రంగా తర్వాత టిక్కెట్ నిరాకరించారు అని పేర్కొన్నారు.
టిక్కెట్ విషయంలో అన్యాయం
జనసేనకు విశాఖలోనే కాక రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మంచి పేరు రావడానికి ప్రజా సమస్యలపై పోరాడే సంస్థగా గుర్తింపు పొందటానికి ఎంతో కృషి చేసిన నాకు వార్డు కార్పొరేటర్ గా తిరిగి టికెట్ కేటాయించే విషయంలో పార్టీ అన్యాయం చేసింది. 2021లో నాతోపాటు ఎన్నికైన మిగిలిన ఇద్దరు జనసేన కార్పొరేటర్ లో ఒక డిప్యూటీ మేయర్ గా,మరొకరు పార్టీ పక్ష నేతగా ప్రమోట్ అయ్యారు. అప్పుడు కూడా నాకు ఎటువంటి పదవి జనసేనలో ఇవ్వలేదు. నేను కూడా ఏ రోజు పదవి కోసం పార్టీని ఇబ్బంది పెట్టలేదు. జనసేన బీ ఫారంపై 2021 లో గెలిచిన వారందరికీ టిక్కెట్లు లభిస్తాయని పార్టీ అధిష్టానం ప్రకటించింది. అయితే ఎందుకో విశాఖ నగరంలో 32 మందికి కార్పొరేటర్ టికెట్ అవకాశం కల్పించిన అధిష్టానం నాకు మాత్రం మొండి చేయి చూపించింది అని పేర్కొన్నారు.
స్వతంత్ర అభ్యర్థి గా పోటీ
అయినప్పటికీ స్వతంత్రంగా పోటీ చేసి విజేతగా జనసేనకు సేవలందిద్దామని భావించాను. అయితే 62 స్వల్ప ఓట్ల తేడాతో కొందరు నేతల కుట్ర వల్ల ఎన్నికలలో ఓటమి చవిచూశాను. ఈ పరిణామాల నేపథ్యంలో జనసేన నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాను. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా సమర్పిస్తున్నాను. ఇప్పటివరకు మీరు అందించిన సహాయ సహకారాలకు ధన్యవాదాలు అని అన్నారు.
పోరాటాలు కొనసాగిస్తా
జనసేన నుంచి తప్పుకుంటున్నప్పటికీ ప్రజా పోరాటాల విషయంలో వెనెక్కిఅడుగు వేసే ప్రశ్న లేదు. విశాఖ అభివృద్ధికి ఉత్తరాంధ్ర అభివృద్ధికి నిత్యం పోరాటాలు చేస్తూనే ఉంటానని స్పష్టం చేస్తున్నాను. ఇప్పటికే పలు అంశాలపై చేస్తున్న న్యాయ పోరాటాలు ఎటువంటి రాజీ లేకుండా కొనసాగుతాయి. జనసేనకు రాజీనామా చేయడం ద్వారా మరింత స్వేచ్ఛగా ప్రజల పక్షాన పోరాటం చేసే అవకాశం లభించింది అని భావిస్తున్నాను అని మూర్తి యాదవ్ స్పష్టం చేశారు
