– సొసైటీలు, మార్క్ ఫెడ్ లకు ఎరువుల సరఫరా ఆలస్యం అవ్వకూడదు
– వ్యవసాయ అధికారులను ఆదేశించిన వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు
విజయవాడ: రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ కు అన్ని సహకార సంస్థలలో, ప్రైవేట్ కంపెనీలలో రైతులకు ఎరువులు అందుబాటులో ఉండాలని, కొరత సంభవించే అవకాశం ఉంటే ముందుగానే గ్రహించి ఎరువుల సరఫరా పెరిగేలా వ్యవసాయ అధికారులు ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఎరువులు, వాటి సరఫరా, కొన్ని ప్రాంతాల్లో యూరియా సరఫరాపై అందుతున్న సమాచారం పై మంగళవారం విజయవాడలో వ్యవసాయ అధికారులు, జిల్లా కలెక్టర్లతో మంత్రి అచ్చెన్నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఉద్దేశించి మాట్లాడారు.
రాష్ట్రంలో ఏ రైతు ఎరువుల కోసం ఇబ్బంది పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతి సహాకార సంస్థను అధికారులు పర్యవేక్షిస్తూ, అందరికి ఎరువులు అందుతున్నాయా లేదా అని తనిఖీ చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చాలా ముందు చూపుతో కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తో సంప్రదించి మిగిలిన రాష్ట్రాల కంటే ఎక్కువ పరిమాణంలో ఎరువులను రాష్ట్రానికి తెప్పించినా కూడా పలు ప్రాంతాలలో యూరియా సరఫరాపై పత్రికలలో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్న వార్తలు వస్తున్నాయన్న విషయాన్ని గ్రహించి వాటి కారణాల గురించి మంత్రి వాకబు చేశారు.
ఎక్కువ మొత్తంలో ఎరువులు పంపిణీ
శ్రీకాకుళం జిల్లాలో ఎరువుల కొరత అంటూ వచ్చిన వార్తలపై కలెక్టర్ ను మంత్రి ప్రశ్నించగా వంశధార ప్రాజెక్టు లో ముందుగా నీటిని విడుదల చేయడం వల్ల విస్తీర్ణం పెరిగిందని, జిల్లాకు 12000 మెట్రిక్ టన్నుల ఎరువుల అవసరం ఉందని అందుకు 18000 మెట్రిక్ టన్నుల ఎరువులు (9000 సొసైటీలు+ 9000 ప్రైవేట్ కంపెనీలకు) అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ స్వప్నీల్ దినకర్ మంత్రికి వివరించారు. రైతులు ప్రైవేట్ డీలర్ల వద్ద ఎరువులు కొనటానికి విముఖత చూపిస్తున్నారని, వారు గ్రామంలో ఉన్న రైతు సేవాకేంద్రాలకు ఎరువులు అందించాలని కోరుతున్నారని తెలిపారు.
గతంలో ఎరువుల తక్కువ అవసరం ఉన్న ఆర్ ఎస్ కే లకు ఎక్కువ మొత్తంలో ఎరువులు పంపిణీ చేశారని తెలిపారు. ప్రభుత్వ కోట 50 శాతం ఎరువులు మన్యం, విజయనగరం జిల్లాల సొసైటీలు, ఆర్ ఎస్ కే లకు వెళ్తున్నాయని, శ్రీకాకుళం జిల్లాకు ప్రైవేట్ డీలర్ లకు వెళ్తున్నాయని తెలిపారు. ప్రైవేట్ డీలర్ల వద్ద వీఆర్ఓ ల పర్యవేక్షణలో అమ్మిస్తున్నామని తెలిపారు. నంద్యాల, అవనిగడ్డ కు సంబంధించి వచ్చిన వార్తలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని, చిన్న చిన్న విషయాలను కొండంతలుగా ప్రచారం చేసి కొంత మంది ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయాలని చూస్తున్నారని, వారికి అవకాశం ఇవ్వకూడదు కలెక్టర్లకు మంత్రి సూచించారు.
జూలై, ఆగస్ట్ నెలలకు సంబంధించి రాష్ట్రానికి రావల్సిన బకాయి ఎరువులను వెంటనే రాష్ట్రానికి పంపాలని కేంద్రాన్ని కోరామని వ్యవసాయ సంచాలకుడు ఢిల్లీ రావు మంత్రికి వివరించారు. ఈ విషయంపై కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తో మాట్లాడి త్వరితగతిన యూరియాను రాష్ట్రానికి వచ్చేలా చొరవ చూపుతామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎరువుల కొరత అంటూ కొన్ని పత్రికలు, వైసీపీ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను రైతులు నమ్మోద్దని మంత్రి తెలిపారు.
ఈ టెలికాన్ఫరెన్స్ కార్యక్రమంలో ప్రత్యేక వ్యవసాయ ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్, వ్యవసాయ సంచాలకులు ఢిల్లీ రావు, రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ అధికారులు, జిల్లా సహకార అధికారులు, జిల్లా మార్క్ ఫెడ్ జనరల్ మేనేజర్లు, ఇతర మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు