– హెలీ-బోర్న్ సర్వేకు శ్రీకారం
– ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై దృష్టి
– ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిష్ఠాత్మకమైనది
– 2028 జనవరి మాసాంతానికి పూర్తి
– ఎస్.ఎల్.బి.సి పూర్తితో ఏపీ అనధికారికంగా వాడుకుంటున్న నీటికి చెక్
– టన్నెల్ నిర్మాణంలో నిపుణున ఇంజినీర్లతో మూడు షిఫ్ట్ లలో పనులు
– భద్రతా ప్రమాణాలపై నిరంతరం పర్యవేక్షణ
– ఎస్.ఎల్.బి.సి పనుల పునరుద్ధరణపై గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం
-మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్: ఎస్.ఎల్.బి.సి. పనుల పునరుద్ధరణ కోసం ప్రణాళికలు రూపొందించామని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని సంకల్పించినట్టు ఆయన పేర్కొన్నారు. ఎస్.ఎల్.బి.సి పనుల పునరుద్ధరణపై గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం కానున్నట్టు మంత్రి తెలిపారు. అందులో భాగంగా ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించి త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టినట్టు ఆయన ప్రకటించారు. ఎస్.ఎల్.బి.సి పునరుద్ధరణ పనుల పురోగతిపై బుధవారం రోజున డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సచివాలయం ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.
నీటిపారుదల శాఖ ప్రధాన కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, సలహాదారులు అదిత్యా దాస్ నాథ్, లెఫ్టినెంట్ జెనరల్ హార్పల్ సింగ్, సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్, ఇ. ఎన్.సి లు అంజత్ హుస్సేన్, శ్రీనివాస్, రమేష్ బాబు లతో పాటు ఆర్ అండ్ ఆర్ కమిషనర్ శివకుమార్ నాయుడు, సి.ఇ నల్గొండ అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నెలకు 178 మీటర్ల సొరంగం తవ్వడం లక్ష్యంగా పెట్టుకుని జనవరి 2028 నాటికి పూర్తి చేయనున్నట్టు ఆయన ప్రకటించారు.
మొత్తం 44 కిలోమీటర్ల సొరంగమార్గానికి ఇప్పటికే 35 కిలో మీటర్ల సొరంగం తవ్వడం పూర్తి అయ్యిందని మిగిలిన తొమ్మిది కిలోమీటర్ల సొరంగ మార్గం తవ్వడానికి గాను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించ బోతున్నట్లు ఆయన తెలిపారు. ప్రపంచం మొత్తంలో అత్యాధునిక సాంకేతికతో కూడిన హెలీ-బోర్న్ సర్వే నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు.
నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇనిస్ట్యూట్ ద్వారా ఈ సర్వే నిర్వహించ తలపెట్టినట్లు ఆయన తెలిపారు. తద్వారా సొరంగ మార్గం తవ్వకాల సమయంలో ప్రమాదాలను ముందుగానే పసిగట్టి ముందస్తు జాగ్రత్తలు తీసుకునే వెసులుబాటు ఇంజినీర్లకు ఉంటుందన్నారు. నీటిపారుదల సలహా దారుడిగా లెఫ్టినెంట్ జెనరల్ హార్పల్ సింగ్ నియామకం ఈ సొరంగ మార్గం పూర్తికి దోహద పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సొరంగ మార్గం తవ్వకాల సమయంలో గాలి,వెలుతురు ఆవశ్యకతతో పాటు నీటిపారుదల రంగంలో యువ ఇంజినీర్లకు శిక్షణ ఇచ్చే ఆవశ్యకతను ఆయన వివరించారు. ఎటువంటి జాప్యం లేకుండా సత్వరమే సర్వే ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
రెండువైపులా మొదలు పెట్టిన ఎస్.ఎల్.బి.సి సొరంగ మార్గం తవ్వకాలలో ఒక భాగం నుండి 21 కిలోమీటర్లు పూర్తి కాగా మరో వైపు 14 కిలో మీటర్లు పూర్తి అయిందని మిగిలిన తొమ్మిది కిలోమీటర్లు పూర్తికి మూడు షిఫ్ట్ లలో పనిచేసేవిదంగా ప్రణాళికలు రూపొందించుకుంటే నిర్ణిత వ్యవధిలో పనులు పూర్తి అవుతాయన్నారు. ఆయా షిఫ్ట్ లలో యువ ఇంజినీర్లను నియమించి రోజువారీ పురోగతిని రికార్డ్ చేయాలన్నారు. అందుకు యువ ఇంజినీర్లకు శిక్షణతో పాటు ప్రోత్సాహకాలు కల్పించి సొరంగ మార్గం తవ్వకాలలో అనుభవం గడించేలా చూడాలన్నారు. సవరించిన అంచనాల పరిధిలోనే ప్రాజెక్టును పూర్తి చేయాలని ఆయన ఏజెన్సీ లకు సూచించారు.
కాగా, శ్రీశైలం నుండి 824 అడుగుల నుండి ఎస్.ఎల్.బి.సి సొరంగ మార్గానికి నీరు వస్తుండగా 840 అడుగుల నుంసి పోతిరెడ్డి పాడు కు నీరు చేరుతుందని ఎస్.ఎల్.బి.సి పూర్తి అయితే అనధికారికంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు కు తరలించుకు పోయో అవకాశం ఉండదని ఆయన స్పష్టం చేశారు. ప్రాజెక్టును పూర్తి చేసే అంశంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు