డబుల్ ఇంజన్ సర్కారుపై పెట్టుబడిదారుల్లో పెరిగిన విశ్వాసం
సీఐఐ సదస్సు విజయంతంపై మంత్రి సత్యకుమార్
విశాఖలో సీఐఐ-30వ పారిశ్రామిక భాగస్వామ్య సదస్సు విజయవంతం కావడం పట్ల రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రశంసల జల్లు కురిపించారు. ప్రధాని మోదీ దిశా, నిర్దేశం, సహకారం, అండదండలు, సీఎం చంద్రబాబు పరిపాలనా దక్షత, కార్యాచరణవల్ల ఏపీలో పెట్టుబడులు వెలువెత్తాయని పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఓ పత్రికా ప్రకటన జారీచేశారు “గత వైకాపా పాలనలో గతి తప్పిన రాష్ట్ర అభివృద్ధిని గాడిలో పెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేస్తున్న కృషివల్ల ఏపీకి అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి లభిస్తోంది.
విశాఖలో మూడురోజులపాటు పెట్టుబడులపై జరిగిన వరుస సమావేశాల ద్వారా అంచనాలకు మించి, 12 రంగాల్లో రూ.13.25 లక్షల కోట్ల పెట్టుబడులు రావడం పీఎం, సీఎంల దార్శనికత, ఐక్యత, సమర్ధతకు నిదర్శనం సీఎం చంద్రబాబు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం పెట్టుబడులు పెట్టే వారికి ప్రోత్సాహాకరంగా ఉంది. ఒప్పందాలు జరిగిన వెంటనే పారిశ్రామిక సంస్థలకు అనుకూల ఉత్తర్వులు ఇవ్వడం ఓ చరిత్ర ఇలాంటి ఉత్తమ విధానాలు పెట్టుబడిదారుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి.
ఏడాది వ్యవధిలోనే పీఎం మోదీ రాష్ట్రంలో 3సార్లు పర్యటించి, రూ.2.80 లక్షల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు, పరిశ్రమలకు సంబంధించి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసారు. వరుస పర్యటనల ద్వారా రాష్ట్రంపై తనకు ఉన్న ప్రత్యేక శ్రద్ధ గురించి పీఎం మోదీ చాటిచెబుతున్నారు. రాష్ట్ర అభివృద్ధిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమష్టి కృషితో వ్యవహరిస్తున్నందున ఫలితాలు బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయి.
గూగుల్ సంస్థ అమెరికా వెలుపల తొలిసారిగా దేశంలోనే తొలిసారిగా విశాఖ సాగరతీరంలో కృత్రిమ మేధ హబ్ నిర్మించబోతుంది. అదే సాగరతీరంలో పారిశ్రామిక సంస్థలు తాజాగా ప్రకటించిన పెట్టుబడులతో విశాఖ మహానగర ఖ్యాతి మరింత విస్తరించబోతుంది. 2040 నాటికి వికసిత భారత్ లక్ష్య సాధనకు జరిగే కృషిలో ఆంధ్రప్రదేశ్ కీలకంగా వ్యవహరించబోతుంది. మరోపక్క సంక్షేమ పథకాల అమల్లోనూ కూటమి ప్రభుత్వం దూసుకుపోతోంది. సూపర్ సిక్స్ హామీలు ‘సూపర్ హిటు అయ్యాయి’ అని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు