– ప్రతి ఎన్నికలోనూ వైఎస్ఆర్సీపీ ఓట్ల శాతం పెరుగుతోంది
– ఊహించినట్టే ఆత్మకూరులో వైఎస్ఆర్సీపీ ఘన విజయం
– అభివృద్ధి – సంక్షేమ పథకాల ఫలితమే వరుస విజయాలు
– విషం మద్యంలో కాదు.. దుష్టచతుష్టయం బుర్రల్లోనే ఉంది.
– మీరే విష పదార్థాలు కలిపి, మీరే ప్రైవేటు ల్యాబ్ ల్లో టెస్టు చేసి, ఎల్లో మీడియాలో మద్యంపై దుష్ప్రచారమా..?
– మద్యంలో ఏ విష పదార్థాలు లేవని ఎస్ జీ ఎస్ ల్యాబ్ రాతపూర్వకంగానే సమాధానం ఇచ్చింది
– రాష్ట్రంలోని 20 డిస్టలరీల్లో ఒక్కటి కూడా జగన్ పర్మిషన్ ఇవ్వలేదు.
– 2014-19 మధ్య చంద్రబాబు 7 డిస్టలరీలకు పర్మిషన్ ఇచ్చాడు.
– ఆ బ్రాండ్లన్నీ చంద్రబాబు దిగిపోయేటప్పుడు అనుమతులు ఇచ్చిన బ్రాండ్లే..
– ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్న మీడియాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి
– రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి
మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ..ఇంకా ఏమన్నారంటే…
ఆత్మకూరులో వైఎస్ఆర్సీపీ ఘన విజయం
ఆత్మకూరు ఉప ఎన్నికలో ఫలితం.. అనుకున్న విధంగానే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. మేకపాటి గౌతంరెడ్డి హఠాన్మరణంతో ఆత్మకూరు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నికలో ఆయన సోదరుడు విక్రమ్ రెడ్డి పోటీ చేశారు. టీడీపీ పోటీ చేయకపోయినా, బీజేపీతో కలిసి ఎన్ని కుట్రలు చేయాలో అన్నీ చేసింది. టీడీపీ క్యాడర్‌ను ఈ ఎన్నికలో ఉపయోగించుకున్నారు. ఏదో విధంగా ఓడించాలనో, ఓట్ల శాతాన్ని తగ్గించాలనో తీవ్ర ప్రయత్నం చేసినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మాండమైన మెజార్టీని ఆత్మకూరు ప్రజలు కట్టబెట్టారు. 2019 ఎన్నికల్లో మేకపాటి గౌతం రెడ్డి 22,276 ఓట్ల మెజార్టీతో గెలిచారు. అదే ఈ ఉప ఎన్నికలో మేకపాటి గౌతమ్ సోదరుడు విక్రమ్ రెడ్డి 74.47శాతం ఓట్లు సాధించి, 82,888 ఓట్ల మెజార్టీతో విజయం కైవసం చేసుకున్నారు.
ప్రతి ఎన్నికలో వైఎస్ఆర్సీపీ ఓట్ల శాతం పెరుగుతోంది
ఈ రాష్ట్రంలో ఏ ఉప ఎన్నిక జరిగినా, 2019 ఎన్నికల్లో వచ్చిన ఓట్ల మెజార్టీ కన్నా చాలా గణనీయమైన మెజార్టీతో గెలుస్తూ వస్తున్నాం. గత ఎన్నికల్లో సాధించిన ఓట్ల శాతం కంటే… ఈ ఉప ఎన్నికల్లో అంతకన్నా ఎక్కువ శాతం ఓట్లను వైఎస్ఆర్సీపీ చేజిక్కించుకుంది. దాంతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో వైయస్సార్ సీపీ ఘన విజయం సాధించింది. 2021లో తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక జరిగింది. టీడీపీ కూడా చాలా బలంగా పోటీ చేయాలని నిర్ణయించుకుని, మాజీ ఎంపీ పనబాక లక్ష్మిని తమ అభ్యర్థిగా నిలబెట్టారు. దాంతో పాటు బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా రత్నప్రభ ని బరిలోకి దించారు.
అతి సామాన్యమైన కుటుంబంలో పుట్టిన విద్యావంతుడైన గురుమూర్తిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఉప ఎన్నికల్లో పోటీ పెట్టడం జరిగింది. హోరా హోరాగా పోటీ జరిగినట్లు కనిపించింది. కరోనా ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు, వాళ్ల అబ్బాయి, కాళ్లకు బలపాలు కట్టుకుని ప్రచారం చేశారు. తమ ప్రచారంలో జగన్ మోహన్ రెడ్డిని తీవ్రంగా దూషించారు, నోటికి వచ్చినట్లు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. పోలీసుల్ని బెదిరించారు. ఇది పార్లమెంట్ ఎన్నిక, కేంద్ర ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకుంటుంది, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఏమీ సంబంధం లేదనే మాటలు మాట్లాడి బెదిరించాలనే ప్రయత్నాలు చేశారు.
పవన్ కల్యాణ్ ఆ ఉప ఎన్నికల సందర్భంగా తిరుపతిలో మకాం వేసి రత్నప్రభను గెలిపించాలని ప్రచారం చేశారు. తీరా ఫలితాలు చూస్తే వాళ్లు ఊహించని విధంగా, మేము ఊహించిన విధంగా అత్యధికమైన మెజార్టీతో 2,71,592 ఓట్ల మెజార్టీతో విజయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. అంతకు ముందు 2019 ఎన్నికల్లో బల్లి దుర్గాప్రసాద్‌కి 2,28,376 ఓట్లు వస్తే.. అంతకన్నా ఎక్కువ మెజార్టీతో గురుమూర్తి గెలిచారు. 2019 తిరుపతి లోక్ సభ ఎన్నికల్లో 55.03 శాతం ఓట్లు వస్తే, ఉప ఎన్నికల్లో 56.67 శాతం వచ్చాయి. ఇక టీడీపీకి 2019 ఎన్నికల్లో 37.65శాతం ఓట్లు వస్తే… తిరుపతి ఉప ఎన్నికల్లో 32.09 శాతానికి ఓట్లు తగ్గాయి. జనసేన మద్దతుతో పోటీచేసిన బీజేపీకి 5.17 శాతం ఓట్లు వచ్చాయి.
ఇలా తిరుపతిలో ఘన విజయం సాధించాక బద్వేల్ ఉప ఎన్నికలు వచ్చాయి. బద్వేలులో వైయస్సార్సీపీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య మరణంతో ఆయన సతీమణి సుధాని పోటీకి నిలబెట్టాం. బీజేపీ మాకు వ్యతిరేకంగా పోటీ చేసింది. తాము సంప్రదాయబద్దంగా ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని చంద్రబాబు చెప్పినా, తమ ఏజెంట్లను బీజేపీ తరఫున పోలింగ్ బూతుల్లో పెట్టి.. పరోక్షంగా బీజేపీకి మద్దతు పలికారు.
అధికారికంగా బీజేపీ – జనసేన మధ్య పొత్తు ఉన్నప్పటికీ, టీడీపీ పరోక్ష మద్దతు తెలిపినా, అక్కడ 90,533 ఓట్ల మెజార్టీతో వైయస్సార్సీపీ రికార్డు స్థాయిలో విజయం సాధించింది. పోలైన ఓట్లలో 76.25 శాతం ఓట్లు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. 2019 ఎన్నికలతో పోలిస్తే వైయస్సార్సీపీకి 15.33 ఓట్లు శాతం పెరిగాయి. ఈ రకమైన మెజార్టీ రావడం చాలా గొప్ప విషయం. బీజేపీ మాత్రం 14.27శాతం ఓట్లకు మాత్రమే పరిమితమై డిపాజిట్ కోల్పోయింది. 2019 తర్వాత జరిగిన ఏ ఉప ఎన్నికను చూసినా.. ప్రతి ఎన్నికలో వైఎస్ఆర్ సీపీ ఓట్లశాతం పెరుగుతోంది.
అభివృద్ధి- సంక్షేమ పథకాల ఫలితమే వరుస ఘన విజయాలు
మరో రెండేళ్లలో సాధారణ ఎన్నికలు జరుగుతాయి, మళ్లీ మేము అధికారంలోకి వస్తామంటూ రోజూ గప్పాలు కొట్టుకునే తెలుగుదేశం పార్టీ, ఇతర ప్రతిపక్షాలు గమనించాల్సిన అంశం ఏంటంటే… వైయస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు నిరాఘాటంగా సాగుతున్నాయి. వాటి ఫలాలను అందుకుంటున్న ప్రజలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఘన విజయం కట్టబెడుతున్నారు. ప్రతి ఎన్నికలోనూ మా పార్టీ ఓట్ల శాతాన్ని పెంచుకుంటూ ముందుకు వెళుతోంది.
మద్యంలో కాదు.. ఎల్లో మీడియా బుర్రలోనే విషం
ఈ విషయాన్ని గమనించిన తర్వాత టీడీపీ, దానికి అనుబంధంగా ఉన్న ఎల్లో మీడియా టీవీ5, ఏబీఎన్, ఈనాడు.. ఏదోవిధంగా ప్రభుత్వంపై కుట్రలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. వైయస్సార్ సీపీ సర్కార్ మీద బురద చల్లేందుకు కట్టుకథలు అల్లుతున్నారు. ఈనాడు దినపత్రికలో ఇవాళ ‘మద్యంలో విషం’ అంటూ అబద్ధాలతో కూడిన ఒక కథనాన్ని ప్రచురించి దానికి తెలుగుదేశం నాయకులతో స్టేట్‌మెంట్లు ఇప్పించింది. మద్యంలో విషపూరితమైన కాంపోండ్స్ ఉన్నాయి, వాటిని తాగడం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. టీడీపీ వాళ్లు లిక్కర్ బాటిల్స్ తీసుకువెళ్లడం, వాటిని ప్రయివేట్ ల్యాబ్‌ల్లో పరీక్షలు నిర్వహించడం, ఆ తర్వాత వాటి గురించి ఈనాడులో ప్రచురించడం ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం చేస్తున్న దుష్ప్రచారం. వైయస్సార్ సీపీ సర్కార్‌పై టీడీపీ చేస్తున్న దుష్ప్రచారం తప్ప, అందులో వీసమెత్తు అయినా వాస్తవం లేదు.
మద్యం పరీక్షలు చేయించినవాళ్లు ఏమైనా సంఘ సంస్కర్తలా? మద్యపాన నిషేధం కోసం పోరాడిన యోధులా? ఎవరు వీళ్లు? వీళ్లంతా చంద్రబాబు చెంచాలు. వైయస్సార్ సీపీ పై ప్రతిరోజు బురదచల్లే వ్యక్తులు. చంద్రబాబు ఒక ప్లాన్ చెబితే దాని ప్రకారం వీళ్లంతా విషం ఉందనో, లేక వాళ్లే కలిపో మద్యం బాటిళ్లను టెస్ట్‌కు తీసుకువెళ్లడం, దాన్నేమో ఈనాడు ఫ్రంట్ పేజీలో ప్రచురించి ప్రభుత్వాన్ని బదనాం చేయడం అనేది టీడీపీ దురుద్దేశమని ప్రజలు గమనించాలి.
విషం ఉన్నది మద్యంలో కాదు. టీడీపీ వాళ్లు బుర్రల్లోనే. విషపూరిత ప్రచారం చేయడానికి మద్యాన్ని కూడా వాడుకుంటున్నారు. ఇది ప్రజలు గమనించాలి. చంద్రబాబు, ఈనాడు, ఏబీఎన్, టీవీ5… ఈ దుష్ట చతుష్టయం కావాలనే ఈ విధమైన ప్రచారం చేస్తున్నాయి. టీడీపీ చేస్తున్న వ్యర్థ ప్రయత్నాన్ని చూస్తూ ఊరుకునేది లేదు. ప్రభుత్వంపై చేస్తున్న దుష్ప్రచారంపై చట్టపరమైన పద్ధతుల్లో అధికారులు చర్యలు తీసుకోవాలి.
మద్యంలో విష పదార్థాలు లేవని ఎస్ జీ ఎస్ ల్యాబ్ వాళ్ళే రాతపూర్వకంగా సమాధానం
మద్యంపై జగన్ మోహన్ రెడ్డి శాసనసభలో కూడా చాలా వివరంగా చెప్పారు. రాష్ట్రంలో విక్రయిస్తున్న మద్యంలో విష పూరిత పదార్ధాలు ఉన్నాయని ఎస్ జీఎస్ ల్యాబ్‌లో పరీక్షలు జరిపామంటూ అప్పుడు కూడా టీడీపీ ఇదే ఆరోపణలు చేస్తే.. ప్రభుత్వం ఆ ల్యాబ్‌కు అధికారికంగా లేఖ రాసింది. ఆ లేఖలో మద్యంలో విషపూరిత పదార్థాలు ఉన్నాయని వాటిని పరీక్ష జరపాలని టీడీపీ తమకు ఇవ్వలేదని, వాటిలో ఎలాంటి విషపూరిత పదార్థాలు లేవంటూ ఎస్‌జీఎస్ ల్యాబ్ రాతపూర్వకంగా సమాధానం ఇచ్చింది. అప్పుడు కూడా ఇదేరకమైన దుష్ప్రచారం చేస్తే.. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి అసెంబ్లీలోనే బహిరంగంగా వివరణ ఇచ్చారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఏం చెప్పారో వాటిని కూడా ఇప్పుడు గుర్తు చేస్తున్నాం.
కొత్తగా ఒక్క డిస్టలరీకి కూడా జగన్అ నుమతి ఇవ్వలేదు
రాష్ట్రంలో మొత్తం 20 డిస్టలరీలు ఉన్నాయి. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆ రోజు నుంచి ఈరోజు వరకూ ఒక్క డిస్టలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. అన్ని అనుమతులు కూడా గత ప్రభుత్వాలే ఇచ్చాయి. చంద్రబాబు హయాంలో 14 డిస్టలరీలకు పర్మిషన్ ఇచ్చారు.
గత అయిదేళ్లలో అంటే 2014-19 వరకూ 7 డిస్టలరీలకు అనుమతి ఇచ్చిన ఘనుడు చంద్రబాబే. అలాంటిది ఆయన తాబేదార్లు, చెంచాలు ఇవాళ మద్యంపై ముఖ్యమంత్రిపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉంది. మీకు ప్రజల మీద ప్రేమ ఉండబట్టేనా అన్ని డిస్టలరీలకు మీ హయాంలో అనుమతి ఇచ్చింది?
ఆ బ్రాండ్లన్నీ బాబు బ్రాండ్లే
పైపెచ్చు పిచ్చి బ్రాండ్లు అంటూ.. బూమ్ బూమ్ అనే బ్రాండ్‌ను జగన్ అనుమతి ఇచ్చారంటూ ఆయనపై నెపం తోసేశారు. బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్ ఎవరిది? చంద్రబాబు నాయుడు తాను అధికారంలో దిగిపోయే ముందు వీటన్నింటికీ అనుమతి ఇచ్చి, మళ్లీ జగన్‌పై బురదచల్లే కార్యక్రమాలు చేస్తున్నారు. ఏ డిస్టలరీ నుంచి అయినా మద్యం విడుదల అయితే దానికో పద్దతి, విధానం ఉంటుంది. క్వాలిటీ కంట్రోల్ చేసిన తర్వాతే ఆ బ్రాండ్‌ను మార్కెట్‌లోకి విడుదల చేస్తారు. ఇదేమీ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా తీసుకొచ్చిన విధానం కాదు. మీ ప్రభుత్వ హయాంలో ఎలా అయితే జరిగాయో ఇప్పుడు కూడా అదే పద్థతిలో వెళుతున్నాం.
రాష్ట్రంలో అశాంతి సృష్టించాలనే కుట్రలో భాగంగానే..
రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా వైయస్సార్ సీపీ ఘన విజయం సాధిస్తుంది. టీడీపీ కానీ, ఇతర పార్టీలు నిలబడే పరిస్థితి లేదు కాబట్టే ఏదో విధంగా రాష్ట్రంలో అశాంతి సృష్టించాలనే కుట్రతో ప్రజలను వైయస్సార్‌సీపీకి దూరం చేయాలనే దురుద్దేశంతో ప్రయత్నిస్తోంది. దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయనటువంటి సంక్షేమ కార్యక్రమాలు మా ప్రభుత్వం అమలు చేస్తోంది. ఎక్కడా అవినీతి లేకుండా నేరుగా లబ్ధిదారులకు డీబీటీ ద్వారా సంక్షేమ పథకాల సొమ్ము వారి బ్యాంకు ఖాతాల్లో పడుతున్నాయి.
జగన్ పరిపాలనా కాలంలో విస్కీలో విషం ఉందట. చంద్రబాబు హయాంలో విస్కీలో అమృతం ఉందా? మద్యం తాగితే ప్రమాదమే. మద్యంలో కూడా మంచి మద్యం ఉంటుందా? పత్రికలు ఉన్నాయని ఫ్రంట్ పేజీల్లో అడ్డగోలు రాతలు రాసుకుంటారా?
సంక్షేమ కార్యక్రమాలను, ప్రభుత్వ ఆదాయాన్ని అడ్డుకోవాలనే కుట్రలు..
ఏదో విధంగా సంక్షేమ కార్యక్రమాలు నిలిపివేయాలని, ప్రభుత్వానికి ఆదాయ వనరులు రాకూడదని, ప్రజలెవరూ కట్టాల్సిన పన్నులు కట్టకూడదని, మద్యంలో వస్తున్న ఆదాయం రాకూడదనే దురుద్దేశంతో టీడీపీ ప్రయత్నిస్తోంది. ప్రభుత్వానికి అప్పులు పుట్టకూడదు, ఆదాయం రాకూడదు అన్నదే ఈ దుష్ట చతుష్టయం కుట్ర. రాష్ట్రానికి అప్పులు ఇవ్వొద్దంటూ ఆర్‌బీఐకి చంద్రబాబు, టీడీపీ రోజుకో లేఖ రాస్తున్నారు. అప్పులు పుట్టకూడదు, ప్రజల నుంచి పన్నులు వసూలు చేయకూడదు, సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోవాలి, పేద ప్రజలు నష్టపోవాలి… అన్నది వీరి దురుద్దేశం.
టీడీపీ ఇలాంటి విషపూరిత ప్రచారాల ద్వారా చేస్తున్న ప్రయత్నాలు వ్యర్థం. మీరు చేసే ఇలాంటి కుట్రల వల్ల ప్రజలకు మా మీద మరింత అభిమానం పెరుగుతుందే తప్ప మా అభిమానాన్ని మీరు దెబ్బతీయలేరు. ఎన్ని కుట్రలు చేసినా ఆత్మకూరులో ఏవిధంగా గెలిచామో, వచ్చే ఎన్నికల్లో కూడా వైయస్సార్ సీపీ ఘన విజయం సాధిస్తుంది.. అని అంబటి రాంబాబు స్పష్టం చేశారు.