-జగన్ రెడ్డి అసమర్ధ పాలన, అసంబద్ద నిర్ణయాల వల్ల పోలవరం పనులు జాప్యం
-ప్రాజెక్ట్ లకు ఒక్క గేటును కూడ పెట్టలేని ముఖ్యమంత్రి, మంత్రులు పోలవరాన్ని పూర్తి చేయగలరా?
-చంద్రబాబు హయాంలో 71శాతం పనులు పూర్తి, జగన్ హయాంలో ఒక్క అంగుళం ముందుకు కదలని స్థితి
-ఏజెన్సీలని మార్చొద్దని పీపీఎ హెచ్చరించినా లెక్కచేయని జగన్
-మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్
జగన్ రెడ్డి అసమర్ధ పాలన, అసంబద్ద నిర్ణయాల వల్లే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరిగిందని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి జీవనాడి పోలవరం ప్రాజెక్ట్. రాష్ట్ర విభజన సందర్భంగా పోలవరాన్ని జాతీయ ప్రాజెక్ట్ గా ప్రకటించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ….
గతంలో జగన్ రెడ్డి చేసిన తప్పుడు ఆరోపణలే నేడు పోలవరం ప్రాజెక్ట్ కి శాపంగా మారాయి. ఏ పాలకులకైనా, ప్రభుత్వానికైనా రాష్ట్ర శ్రేయస్సు ముఖ్యం. జగన్ రెడ్డి మాత్రం స్వార్థపూరిత రాజకీయాలు చేస్తుూ పోలవరం ప్రాజెక్ట్ బాధ్యతలను విస్మరించారు. చంద్రబాబు హయాంలో పోలవరానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. పనులు త్వరితగతిన ముందుకు సాగేలా కృషి చేశారు. 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రాజెక్ట్ పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ 71శాతం పనులను పూర్తి చేశారు. డయా ఫ్రం వాల్ నిర్మాణం కోసం అంతర్జాతీయ కంపెనీలను తీసుకొచ్చారు. కాఫర్ డ్యాం నిర్మాణ పనులను వేగవంతం చేశారు. రూ.7వేల కోట్లకు పైగా నిధులను ఖర్చు పెట్టారు.
పోలవరం ప్రాజెక్ట్ లో జగన్ రెడ్డి వైఫల్యాలు:
జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక నిర్లక్ష్య ధోరణిని అవలంబించి పనులు కుంటుపడేలా వ్యవహరించారు. విధ్వేషం, విధ్వంసమే అజెండా ఉన్న జగన్ రెడ్డి ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్ట్ పనులు ఒక్క శాతం కూడ ముందుకు సాగని పరిస్ధితి. నిర్మాణ సంస్ధని మార్చొద్దని పీపీఎ హెచ్చరించినా జగన్ రెడ్డి తన స్వార్థం కోసం, తన బంధువులకు కట్టబెట్టడం కోసం ఏజెన్సీని మార్చారు. దీని వల్ల ప్రాజెక్ట్ పనుల్లో జాప్యం జరిగింది. ఏజెన్సీని మార్చడం వలన 2019 జూన్ నుండి 2020 జూన్ వరకు దాదాపు 14 నెలలు పనులు ఆగిపోయాయి. పనులు నిలిపివేయడంతో పడిన వర్షాలకు గుంతలు ఏర్పడి ప్రాజెక్ట్ ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్ధితి. 23 మంది ఎంపీలని ఇచ్చిన ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేస్తూ స్వార్ధంగా తన కోసం, తన కుంటుంబం మీద ఉన్నకేసులు, తన నాయకులు చేసే తప్పులను సమర్ధించుకోవడానికి కేంద్రం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. జగన్ రెడ్డి పోలవరానికి సంబంధించిన నిధులు, అనుమతులు గురించి కేంద్రం మీద ఒత్తిడి తేలేదు. తన కేసుల నుండి తప్పించుకునేందుకు కేంద్రానికి దాసోహం అవుతున్నారు. జగన్ రెడ్డి అధికారంలో ఉన్న మూడున్నరేళ్లలో రూ. 2వేల కోట్లను కూడ ప్రాజెక్ట్ కి వినియోగించలేదు.
పోలవరం ప్రాజెక్ట్ అథారిటి (పీపీఎ) :
ఏజెన్సీ పోలవరం ప్రాజెక్ట్ పనులని చేపడుతుందో అనుకున్న సమయానికి పనులు పూర్తి కావాలంటే నిర్మాణ సంస్థని మార్చొద్దని పీపీఎ హెచ్చరించింది. నీతి ఆయోగ్ సూచనల మేరకు పీపీఎ నియమించిన ఐఐటి కమిటీ పోలవరం ప్రాజెక్ట్ పనులు జాప్యం కావడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరి, నిర్ణయాలే కారణం అని తేల్చి చెప్పాయి.
గతంలో ప్రతిపక్షంగా ఉన్న జగన్ రెడ్డి పోలవరం విషయంలో చంద్రబాబు నాయుడు మీద ఎన్నో అసత్య ఆరోపణలు చేశారు. జాతీయ ప్రాజెక్ట్ అయితే రాష్ట్రం ఎందుకు బాధ్యత వహిస్తుందని, ప్రాజెక్ట్ లో అవినీతి జరిగిందని నోటికొచ్చినట్లు మాట్లాడారు. రివైజ్డ్ రిపోర్ట్ 54వేల కోట్ల రూపాయలకి ప్రాజెక్ట్ ల్యాండ్ అక్విడేషన్, ప్రాజెక్ట్ ని పూర్తి చేయడానికి అంచనాలనను వేసి పోలవరం రివైజ్డ్ రిపోర్ట్ పంపిస్తే దోపిడి కోసమే ఆ రిపోర్ట్ అని ఆరోపించారు.
మునుపెన్నడూ ప్రశ్నించని పక్క రాష్ట్రాలు నేడు జగన్ రెడ్డి ప్రభుత్వ అలసత్వం, పోలవరం ప్రాజెక్ట్ పనులలో నిర్లక్ష్యం చేయడం మూలాన ప్రశ్నిస్తున్నాయి. న్యాయస్థానాలు వేలెత్తి చూపించే అవకాశం కల్పించింది. మూడున్నరేళ్ళలో పోలవరం నిర్వాసితులకు జగన్ రెడ్డి చేసిందేమిటో చెప్పాలి. నిర్వాసిత ప్రాంతాలలో పాదయాత్ర చేసినప్పుడు తన తండ్రి వై.యస్. రాజశేఖర్ రెడ్డి హయాంలో తీసుకున్న పొలాలకు అదనంగా 5లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ హామీగానే మిగిలిపోయింది. 10లక్షల పైనా ఆర్థికసాయం పెంచి ఇస్తామని చెప్పి చేయలేకపోయారు. పోలవరం భూ సేకరణలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు వందల కోట్లు దోపిడి చేశారు. చంద్రబాబు హయాంలో అన్ని అనుమతులు తీసుకున్నప్పటికి సుప్రీం కోర్ట్ లో కేంద్ర ప్రాజెక్ట్ కాబట్టి కేంద్రమే నేడు మూడు రాష్ట్రాల సియస్ లతో సమావేశం పెట్టమని కోరడం వివాదాస్పదం చేసే నిర్ణయం. జగన్ రెడ్డి అసమర్థ విధానాలవల్ల రాష్ట్రాలు అడ్డుపడుతున్నాయి.
గతంలో అనిల్ కుమార్ యాదవ్ జల వనరులశాఖ మంత్రిగా ఉన్నప్పుడు 2021 ఏప్రిల్, 2021 డిసెంబర్, 2022 ఏప్రిల్ నాటికి పోలవరం పనులు పూర్తి అవుతాయని తేదీలు మార్చి చెప్పుకుంటు వచ్చారు. ప్రస్తుత మంత్రిగా ఉన్న అంబటి రాబాంబు ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేకున్నారు. వైసీపీ మంత్రుల మాటలను గమనిస్తే.. వారికి పోలవరం ప్రాజెక్ట్ ప్రాధాన్యత కాదు అనే విషయం స్పష్టమవుతుంది. కాఫర్ డ్యాం, డయా ఫ్రం వాల్ దెబ్బ తినడానికి కారణం ప్రభుత్వమే. జగన్ రెడ్డికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రాజెక్ట్ పనులు పూర్తి అయివుండేవి. తమ వైఫల్యాన్ని కప్పిప్పుచ్చుకోవడానికి టీడీపీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.
ప్రజాస్వామ్య పాలనలో పాలకులు ప్రజల మంచి, చెడ్డలను చూసుకోవాలి. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ అవినీతి అక్రమాలను ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నారు. వైసీపీ కార్యకర్తలు దాడులు చేస్తున్నారు. జగన్ రెడ్డి ప్రభుత్వం గురించి వస్తున్న ప్రజా వ్యతిరేకతను తట్టుకోలేక ప్రజల మీద అసహనాన్ని చూపెడుతున్నారు.
అన్నమయ్య ప్రాజెక్ట్ గేటు కొట్టుకుపోయి అక్కడ ప్రాంతాలు చిన్నాభిన్నమైయ్యాయి. నష్టపోయిన రైతు తన కుమార్తెను తీసుకొని ముఖ్యమంత్రితో కలవాడానికి ఎంత ప్రయత్నించినా కలవలేకపోయారు. పులిచింతల గేటు, గుండ్లకమ్మ ఏరు గేటు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యూలేటర్ గేటు కొట్టుకుపోవడంతో నీరంతా వృధాగా పోయాయి. ప్రాజెక్ట్ లకి ఒక గేటును కూడ పెట్టలేని మంత్రులు, ముఖ్యమంత్రి పోలవర ప్రాజెక్ట్ ని పూర్తిచేయగలరా అని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ప్రశ్నించారు.