Suryaa.co.in

Andhra Pradesh

సజ్జల డైరెక్షన్‌లోనే పోలీసుల అరాచకం

– మండిపడ్డ చంద్రబాబు

అనపర్తి: తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో పోలీసుల దాడిలో గాయపడిన పార్టీ కార్యకర్తలను తెదేపా అధినేత చంద్రబాబు పరామర్శించారు.నిన్న పోలీసులు లాఠీఛార్జ్‌ చేయడంతో పలువురు తెదేపా కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన చంద్రబాబు.. పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. కార్యకర్తలు త్వరగా కోలుకోవాలని.. అక్రమ కేసులపై న్యాయబద్ధంగా పోరాడుదామని వారికి చంద్రబాబు ధైర్యం చెప్పారు.

అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. ”ప్రజల్లో వ్యతిరేకత గమనించే వైకాపా ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోంది. నిన్న అనపర్తిలో పోలీసులను పురిగొల్పి పంపారు. ముందురోజు సభ నిర్వహణకు అనుమతి ఇచ్చి… అప్పటికప్పుడు అనుమతి లేదంటూ అరాచకం సృష్టించారు. జగ్గంపేట, పెద్దాపురంలో లేని ఆంక్షలు అనపర్తిలో ఎందుకొచ్చాయి. ప్రతిపక్షాలు నిర్వహించే సభలను అడ్డుకోవాలి.

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తోంది. చట్టవ్యతిరేకంగా పనిచేయాలని పోలీసులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్‌లోనే కొంతమంది పోలీసులు అరాచకం సృష్టిస్తున్నారు. పోలీసులు కావాలనే తెదేపా కార్యకర్తలపై గురిపెట్టి దాడి చేశారు. కార్యకర్త ప్రకాశ్‌నాయుడిని గుండెలపై కొట్టడంతో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పోలీసులు సహకరించొద్దని కోరుతున్నాను. చట్టానికి అనుగుణంగా విధులు నిర్వర్తించాలి” అని చంద్రబాబు పోలీసులకు సూచించారు..

LEAVE A RESPONSE