– హామీలు అమలు చేయకుండా రెండేళ్లుగా మోసం
: వైయస్సార్సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం
తాడేపల్లి: అంగన్వాడీ వర్కర్లపై పోలీసుల దాడి అమానుషమని, ఎన్నికల హామీలు అమలు చేయాలని కోరుతూ శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న అక్కచెల్లెమ్మలను దారుణంగా వేధించిందని వైయస్సార్సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాడేపల్లి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీ అక్కచెల్లెమ్మలకు వేతనాలు పెంచుతానని, సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాట్యుటీ చెల్లిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన చంద్రబాబు, రెండేళ్లుగా మభ్యపెడుతూ వచ్చారని వివరించారు.
టెంట్లో ఉండి నిరసన వ్యక్తం చేస్తున్న ఉన్న మహిళలను వేకువ జామున ఒక్కసారిగా ఈడ్చి వ్యాన్లలోకి తరలించడం హేయమని చర్యగా పేర్కొన్నారు. అంగన్వాడీ వర్కర్లకు వైయస్సార్సీపీ అండగా ఉంటుందని, ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ తరఫున పోరాడుతామని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదని నలమారు చంద్రశేఖర్ రెడ్డి హెచ్చరించారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీ అక్కచెల్లెమ్మలకు వేతనాలు పెంచుతానని, సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాట్యుటీ చెల్లిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతోంది.. ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అనేక దఫాలు శాంతియుతంగా నిరసనలు తెలిపిన అంగన్వాడీలను చంద్రబాబు ప్రతిసారీ మభ్యపెడుతూ వచ్చారు.
ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టక పోవడంతో సోమవారం నిర్వహించిన ‘ఛలో విజయవాడ’ కార్యక్రమానికి అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు భారీగా పోటెత్తారు.
మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటలకు అందరూ నిద్రిస్తుండగా వందలాది మంది మగ పోలీసులు ఒక్కసారిగా విరుచుకుపడి అంగన్వాడీ మహిళలను ఈడ్చి పారేశారు. వారు తేరుకునేలోగా టెంట్లు పడేసి, ప్లెక్సీలు చించేసి, ప్లకార్డులు విసిరేసి, అంతా చిందరవందర చేసేశారు.
అంగన్వాడీల పట్ల ప్రభుత్వం పోలీసులు వ్యవహరించిన తీరును వైయస్సార్సీపీ తీవ్రంగా ఖండిస్తోంది. వారికి పార్టీ అండగా ఉండి వారి తరఫున ఉద్యమిస్తుంది.
చేతికి దొరికిన వారిని దొరికినట్లు అరెస్టు చేసి వ్యాన్లలోకి తోసేశారు. తమను ఎందుకు అరెస్టు చేస్తున్నారు..? ఎక్కడికి తీసుకెళ్తున్నారు..? అని ప్రశ్నించిన వారికి సమాధానం చెప్పకుండా గెంటేశారు. ఈ సందర్భంగా జరిగిన పెనుగులాటలో పలువురు అంగన్వాడీ వర్కర్లు, కార్యకర్తలకు గాయాలయ్యాయి. తమను అక్రమంగా అరెస్ట్ చేసి కనీసం టాయిలెట్స్‌కు వెళ్లడానికి కూడా అనుమతించలేదని అంగన్వాడీ వర్కర్స్ వాపోతున్నారు. అంగన్వాడీ వర్కర్ల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు చూసి దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం అవుతోంది.
అంగన్వాడీలు మాత్రమే కాదు.. టీచర్లు, ఇతర ఉద్యోగ సంఘాల నాయకులు, పెన్షనర్లు ప్రభుత్వ తీరు పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ ఇప్పటికే అనేకసార్లు వినతులు, నిరసనలు తెలియజేశారు.
అయినా ప్రభుత్వం నుంచి కనీస స్పందన ఉండటం లేదు. వైయస్సార్సీపీ హయాంలో ఉన్న పీఆర్సీ చైర్మన్ తో రాజీనామా చేయించిన చంద్రబాబు.. రెండేళ్లుగా కొత్త పీఆర్సీ కమిషన్ వేయకుండానే కాలయాపన చేస్తున్నారు. ఉద్యోగులకు రావాల్సిన దాదాపు రూ. 35 వేల కోట్ల బకాయిలు ఇవ్వకుండా వేధిస్తున్నారు..