– కాంగ్రెస్ ప్రభుత్వంపై బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కళ్యాణ్ నాయక్ ఆగ్రహం
హైదరాబాద్: నల్గొండ జిల్లా దామరచర్ల మండలం కొత్తపేట తండాకు చెందిన గిరిజన యువ రైతు ధనావత్ సాయి సిద్దు, యూరియా సరఫరా సమస్యపై ధర్నా చేపట్టగా, పోలీసులు అతడిని ఇంటి నుండి లాక్కెళ్లి థర్డ్ డిగ్రీ హింసకు పాల్పడిన ఘటన కలకలం రేపింది.
రైతు భార్య కాళ్లపై పడి వేడుకున్నా కూడా పోలీసులు అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా, ఎస్ఐతో పాటు మరో ముగ్గురు కానిస్టేబుళ్లు అతని కాళ్లు కట్టేసి లారీ టైర్ లాఠీలతో దారుణంగా కొట్టారని బాధితుడు ఆరోపించాడు. గాయాలపై నడిపించడమన్నా మానవ హక్కుల ఉల్లంఘనకన్నా తక్కువేమీ కాదని ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు సరిపడా యూరియా అందజేస్తున్నప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ వ్యవస్థలో విఫలమై రైతులను ఇబ్బందులు పడేస్తోందని బీజేపీ ఆరోపించింది. బ్లాక్ మార్కెట్‌ను అడ్డుకోవాల్సిన బదులు ప్రోత్సహిస్తూ రైతులపై భారాన్ని మోపుతోందని విమర్శలు గుప్పించింది.
“యూరియా కోసం అడిగిన ఎస్టీ రైతుపై పోలీసులు ఇలాంటి అమానవీయ చర్యలకు పాల్పడటం కాంగ్రెస్ ప్రభుత్వ అసలు స్వరూపాన్ని బయటపెడుతోంది. కులం పేరుతో దూషించడం, కుటుంబాన్ని అవమానించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం. రైతుల సమస్యలు పరిష్కరించాల్సిన బదులు వారిపైనే దాడులు చేయడం ఘోరమైన చర్య.”