Suryaa.co.in

Andhra Pradesh

సజ్జలకు పోలీసుల నోటీసు

– రేపు విచారణకు హాజరుకావాలని మంగళగిరి పోలీసుల పిలుపు
– ఎన్టీఆర్‌భవన్‌పై దాడి కేసులో సజ్జలపై బిగిస్తున్న ఉచ్చు
– తాజాగా సజ్జలపై లుక్‌అవుట్ నోటీసు

అమరావతి: టీడీపీ కేంద్ర కార్యాలయమైన ఎన్టీఆర్‌భవన్‌పై వైసీపీ ముష్కరుల మూకదాడి కేసు వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో సూత్రధారిగా భావిస్తున్న నాటి ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డికి మంగళగిరి పోలీసులు నోటీసులు పంపించారు. గురువారం విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొన్నారు. ఎన్టీఆర్ భవన్‌పై దాడికి ముందు నాటి ఎంపి నందిగం సురేష్, అప్పిరెడ్డి, దేవినేని అవినాష్ ..వైసీపీ కార్యాలయంలోని సజ్జలను కలిసిన తర్వాతనే దాడి జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. దాడి జరిగినప్పుడు ఈ ముగ్గురూ టీడీపీ ఆఫీసు పరిసర ప్రాంతాల్లోనే ఉన్నట్లు వారి ఫోన్ రికార్డులు చెబుతున్నాయి.

దీనితో దాడికి పురికొల్పిన వారిలో సజ్జల కూడా ఉన్నట్లు భావిస్తున్న పోలీసులు, ఆయనను విచారణకు పిలవడం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే సజ్జల సుప్రీంకోర్టు నుంచి రక్షణ పొందినప్పటికీ.. విచారణకు సహకరించాలని, కోర్టులు ఆయనకు ఇచ్చిన వెసులుబాటు ఉత్తర్వులో స్పష్టం చేస్తాయి. ఇలాంటి కేసుల్లో కోర్టుకు వెళ్లి ఊరట పొందే వారందరికీ, కోర్టు ఈ విషయం స్పష్టం చేయడం సహజం. ఆ ప్రకారంగా సజ్జల తాను విచారణకు వెళ్లనని చెప్పడానికి వీల్లేదు. అయితే న్యాయవాదిని వెంట తీసుకువెళ్లే వెసులుబాటు ఉంటుంది. అందుకు కోర్టు అనుమతించిదో లేదో అన్నదానిపై స్పష్టత లేదు.

కాగా ఇప్పటికే సజ్జలపై గుంటూరు జిల్లా ఎస్పీ లుక్‌అవుట్ నోటీసు జారీ చేశారు. దానిప్రకారం ఆయన దేశం దాటే అవకాశం లేదు. ఒకవేళ అందరి కళ్లు కప్పి ఎయిర్‌పోర్టుకు వెళ్లినప్పటికీ, ఇమ్మిగ్రేషన్ అధికారుల కళ్ల నుంచి తప్పించుకోలేరు. తాజాగా విదేశాల నుంచి ముంబయి వచ్చిన సజ్జలకు లుక్‌అవుట్ నోటీసు చూపించి, ఎయిర్‌పోర్టులోనే నిలిపివేసిన విషయం తెలిసిందే.

LEAVE A RESPONSE