– నాగబాబుకు పోలీసు ‘వందనం’
– సోషల్‌మీడియాలో విమర్శల వెల్లువ
– ఏ హోదా ఉందని శల్యూట్ కొట్టారంటూ విమర్శల వర్షం
– వారిపై చర్యలు తీసుకుంటారా అంటూ ప్రశ్నలు
– నాగబాబును మాత్రం విమర్శించని వైనం
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఆయన ఎమ్మెల్యే కాదు. ఎంపీ కాదు. అలాగని జడ్పీ చైర్మన్ కాదు. పోనీ జడ్పీటీసీనో, సర్పంచ్ కూడా కాదు. జస్ట్. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సోదరుడు. జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు. అంతే! అంతకుమించి ఆయనకు ఎలాంటి ప్రొటోకాల్ లేదు. ఆ ప్రకారంగా ఆయనకు ఎలాంటి హోదా లేదని అర్ధమవుతూనే ఉంది.
మరి అలాంటి సాధారణ వ్యక్తికి.. పోలీసులు అత్యుత్సాహంతో ఎలా శల్యూట్ కొట్టినట్లు? పోలీసులంతా కట్టకట్టుకుని ఆయన దగ్గరకు వెళ్లి ఎందుకు వందనం చేసినట్లు? పోలీసులు ఇలాగే అందరి మంత్రుల సోదరులకు వందనం చేస్తారా? మరి ఆ ఓవరాక్షన్ చేసిన పోలీసులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటారా? లేదా?.. ఇదీ ఇప్పుడు సోషల్‌మీడియాలో వెల్లువెత్తుతున్న విమర్శల వర్షం.
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేనాధిపతి పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా హోదాలో పనిచేస్తున్నారు. ఇటీవలి పిఠాపురం అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడి కోసం అంతా తానై పనిచేశారు. అంతవరకూ బాగానే ఉంది. తర్వాత పవన్‌కల్యాణ్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చింది. అది కూడా ఓకే.
సహజంగా తమ జిల్లా, నియోజవర్గం, డివిజన్‌కు చెందిన ఎమ్మెల్యేలకు.. లేదా మంత్రి పదవులొచ్చిన ఎమ్మెల్యేల వద్దకు పోలీసులు వెళుతుంటారు. కొందరు మంచి పోస్టింగుల కోసమో.. ఇంకొందరు తమను అక్కడే కొనసాగించాలనో వినతులిస్తుంటారు. ఇంకొందరు తెలివైన పోలీసులు.. కులం పులిహోర కలిపి, సదరు మంత్రులకు దగ్గరయేందుకు ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ ప్రదర్శిస్తుంటారు. ఇది కొన్ని దశాబ్దాలుగా చూస్తున్న దృశ్యాలే.
అయితే అసలు ఎలాంటి హోదా లేని నాగబాబు వద్దకు పోలీసులు కట్టకట్టుకుని వెళ్లి, ఆయనకు సెల్యూట్ కొట్టి బోకే-శాలువాలతో సత్కరించడమే సోషల్‌మీడియా విమర్శలకు కారణమయింది. నిజానికి ప్రైవేటు వ్యక్తుల వద్దకు పోలీసులు డ్రెస్సుతో వెళ్లకూడదు. సెల్యూట్ అసలు కొట్టకూడదు. పోలీసు శాఖలో ఇవన్నీ క్రమశిక్షణా రాహిత్యమే అవుతుంది. ఇందులో నాగబాబు తప్పేమీ లేదు. ఆయనను ప్రసన్నం చేసుకునే పోలీసుల అత్యుత్సాహమే విమర్శల పాలవుతోంది.
నాగబాబును పోలీసులు డ్రెస్సులో వెళ్లి సన్మానించే ఫొటోలు, సోషల్‌మీడియాలో రచ్చ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు ఘాటుగా ప్రశ్నాస్త్రాలు సంధించి, పోలీసుశాఖను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ‘అసలు నాగబాబు ఎవరు? ఎమ్మెల్యేనే? ఎంపీనా? ఎస్పీనా? డీఐజీనా’.. ‘ ఈ విధేయత- అత్యుత్సాహం ప్రజల ముందు ప్రదర్శిస్తే బాగుంటుంది కదా?’..
‘నాగబాబుకు ఏం హోదా ఉందని శల్యూట్ కొట్టి సన్మానం చేశారు? అలా అందరి ఇళ్ళకు వెళ్లి సన్మానిస్తారా?’.. ‘పోలీసుశాఖలో ఇలాంటి ఓవరాక్షన్ చేసిన వారిపై ఏం చర్యలు తీసుకుంటారో చూద్దాం’.. ‘చర్యలు తీసుకుంటారా? లేక పవన్‌తో గొడవెందుకని వదిలేస్తారా’?.. అంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అయినా ఈ వ్యవహారంలో ఎవరూ నాగబాబును తప్పుపట్టకపోవడమే విశేషం. పైగా.. పోలీసులు వచ్చి సన్మానిస్తే ఆయన మాత్రం ఏం చేస్తారంటున్నారు.