– పోలీసుల భద్రత మధ్య దొంగ ఓట్లు వేసిన టీడీపీ గూండాలు
– దేశంలోనే ఇలాంటి దుర్మార్గమైన ఎన్నిక ఎన్నడూ జరగలేదు
– మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం
తాడేపల్లి: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ నేతలు తీసుకువచ్చిన దొంగ ఓటర్లకు పోలీసులు పూర్తి రక్షణ కల్పిస్తున్నారని, పోలీసుల అండతోనే యథేచ్ఛగా వారు ఓటు వేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఒకవైపు టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు సెగ్మెంట్లో తిరుగుతూ ఓటర్లను బెదిరిస్తుంటే, మరోవైపు కడప ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డిని పార్టీ కార్యాలయం నుంచి బయటకు రానివ్వకుండా డీఐజీ కోయ ప్రవీణ్ కాపలా కాయడం దారుణమని అన్నారు. వైయస్ఆర్సీపీ కార్యాలయంకు వస్తున్న కార్యకర్తలను కాల్చేస్తానంటూ డీఎస్పీ బెదిరించడం ఈ ఎన్నికల్లో పోలీసులు అధికారపార్టీకి ఎంత తొత్తులుగా మారి పనిచేస్తున్నారనడానికి నిదర్శనమని మండిపడ్డారు. ఇంకా ఆయనేమన్నారంటే…
2017 లో నంద్యాల ఉప ఎన్నికల కన్నా దారుణంగా పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తోంది. ఈ ఎన్నికల్లో పోలింగ్‌లో పాల్గొన్న వారు అక్కడి సెగ్మెంట్లకు చెందిన వారు కాదు. జమ్మలమడుగు, కమలాపురం ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు, రౌడీలను తీసుకువచ్చి పోలింగ్ కేంద్రాల్లో ఓట్లు వేయించారు. దీనికి సంబంధించి మా పార్టీ నేత, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఫొటోలతో సహా బయటపెట్టారు. దొంగ ఓట్లు వేస్తున్న వ్యక్తుల పేర్లతో సహా వెల్లడించారు.
ఇంతకన్నా సాక్ష్యాధారాలు ఏం కావాలి. పులివెందుల్లో ఉన్న 10,601 ఓట్లలో యాబై శాతంకు మించి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన దొంగ ఓటర్లతో వేయించారు. పులివెందుల్లోని ఓటర్లు తమ ఓటు హక్కును వాడుకోలేకపోయారు. పోలీస్ యంత్రాంగం వైయస్ఆర్సీపీ వారిని ఎవరినీ పోలింగ్ కేంద్రాలకు వెళ్ళనివ్వకుండా అడ్డుకున్నారు. చివరికి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న జెడ్పీటీసీ అభ్యర్థిని కూడా బయట తిరగనివ్వకుండా నిర్భందించారు.
ఎంపీ అవినాష్‌రెడ్డిపై ఆంక్షలు
కడప పార్లమెంట్ సభ్యుడు అవినాష్ రెడ్డిని పోలీసులు ఉదయం అదుపులోకి తీసుకుని ఎక్కడికి తీసుకువెడుతున్నారో కూడా చెప్పకుండా గంటల తరబడి వాహనాల్లో తిప్పారు. దీనిని పార్టీ నేతలు ప్రశ్నించడంతో ఎర్రగుంట్లలో ఓ పార్టీ నాయకుడి ఇంటిలో కూర్చోబెట్టారు. ఇక్కడి నుంచి వైయస్ అవినాష్‌రెడ్డి పులివెందుల పార్టీ కార్యాలయంకు వచ్చారు. ఈ సమాచారం తెలియగానే కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ అక్కడికి వచ్చి నేను కూడా మీ పార్టీ కార్యాలయంలోనే కూర్చుంటాను అంటూ కూర్చున్నారు. ఒకవైపు రెండు సెగ్మెంట్లలోనూ టీడీపీ వారు విచ్చలవిడిగా దొంగ ఓట్లు వేస్తుంటే, దానిని అడ్డుకోకుండా, వైయస్ఆర్సీపీ కార్యాలయంలో ఎంపీ అవినాష్‌రెడ్డి బయటకు రాకుండా కాపలా కాస్తూ కూర్చుంటాను అని కోయ ప్రవీణ్ అనడం చూస్తుంటేనే వారి కుట్రలు అర్థమవుతున్నాయని రాంబాబు అన్నారు.