Suryaa.co.in

Andhra Pradesh

పోలీసులు పోలీసులా వ్యవహరించాలి… కీచకులుగా మారొద్దు

– ఏపీ పోలీసు వ్యవస్థ భలే పోలీసు
– ఢిల్లీ లిక్కర్ మాఫియా మూలాలు ఆంధ్రాలో తేలినట్టుగా… ఆ పెట్టుబడుల మూలాలన్నీ మళ్లీ ఆంధ్రలోనే చూపెట్టుకుంటారు
– రాష్ట్రం లో ఎంత అరాచక, అనాగరిక పాలన కొనసాగుతుందో ప్రజలు గుర్తించాలి
దొంగ కేసులు బనాయించి, మెజిస్ట్రేట్ ఆదేశాలను ధిక్కరించి తనని జైలుకు పంపించారు
– అమరావతి రైతుల పాదయాత్రకు అనుమతించిన జడ్జికి శిరసు వంచి నమస్కరిస్తున్నా
– అరసవల్లిలో నిర్వహించే బహిరంగ సభకు హాజరవుతా
– నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు

” రాష్ట్రంలో ఎంత అరాచక, అనాగరిక పరిపాలన కొనసాగుతుందో, ఎటువంటి పోలీసు, పాలన వ్యవస్థలో మనం ఉన్నామో ” ప్రజలు గుర్తించాలని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు కోరారు. తనపై దొంగ కేసు బనాయించి, మెజిస్ట్రేట్ ఆదేశాలను ధిక్కరించి, జైలులో పెట్టారని తెలిపారు.

తనని జైలుకు పంపిన తర్వాత, వైద్య నివేదికను హైకోర్టుకు అందజేశారన్నారు. అంతకు ముందే హైకోర్టు, వైద్య నివేదిక ను సమర్పించాలని పోలీసులను ఆదేశించగా, తనని జైలులో పెట్టే వరకు వైద్య నివేదికను అందజేయకుండా తాత్సారం చేశారని చెప్పారు. ఇక తనపై దొంగ కేసు బనాయించడానికి, రెండు మూడు రోజుల ముందు తన ఇంటి చుట్టూ పోలీసులు రెక్కీ నిర్వహించారని, తాను ఇంట్లో ఉన్న విషయాన్ని తెలుసుకొని పాత తేదీలలో నోటీస్ ఇచ్చినట్లుగా తప్పుడు రికార్డులను సృష్టించి, ఉదయాన్నే ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, సిఐడి చీఫ్ పీవీ సునీల్ కుమార్ ఆదేశాలతో కనీసం ప్రాథమిక విచారణ నిర్వహించకుండానే, మధ్యాహ్నం వరకు తన అరెస్టుకు రంగం సిద్ధం చేశారన్నారు.

ఈ విషయాలన్నీ ప్రజలకు తెలియాలని చెబుతున్నట్లు రఘురామ కృష్ణంరాజు వెల్లడించారు. పోలీసులు, పోలీసుల లాగా వ్యవహరించాలని, కీచకులుగా మారొద్దన్నారు. శుక్రవారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… ఏపీ పోలీసు వ్యవస్థ భలే పోలీసులాగా మారిందని అపహాస్యం చేశారు. పేదలకు పట్టెడు అన్నం పెట్టాలనుకునే వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేస్తున్న పోలీసులు, బెజవాడలో చెన్నుపాటి గాంధీ కన్ను పెరికేయాలని చూసిన వారిపై మాత్రం, నామమాత్రపు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపారన్నారు.

ఇక వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును విచారించడానికి రాష్ట్రానికి విచ్చేసిన సిబిఐ అధికారి రాం సింగ్ పై ఏపీ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందేనని ఎద్దేవా చేశారు. రాష్ట్ర పోలీసు వ్యవస్థలోని లోపాలను కానిస్టేబుల్ ప్రకాష్ ఇప్పటికే ఎత్తిచూపుతున్నారన్న ఆయన , ఇప్పటికైనా పోలీసులు ఐపిసి నిబంధనలను పాటిస్తే మంచిదని హితవు పలికారు. పాలకుల ప్రాపకం కోసం తప్పులు చేసే పోలీసు అధికారులను ఎవరు కూడా రక్షించలేరని రఘురామకృష్ణం రాజు హెచ్చరించారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఉండేది ఇంకా కొన్ని మాసాలేనన్న ఆయన, మళ్లీ ఈ ప్రభుత్వం అధికారంలోకి రాదని కుండబద్దలు కొట్టారు.

స్థలాలు కొట్టేయడానికి పెట్టుబడులు పెడుతున్నారా?
రాష్ట్రంలో 1,26 వేల కోట్ల రూపాయల పెట్టుబడుల వరద వెల్లువెత్తు నుందని మనస్సాక్షి లేని సాక్షి దినపత్రికలో వచ్చిన కథనంపై, ఈ ప్రభుత్వాన్ని చూసి పెట్టుబడులు పెట్టే ప్రమోటర్లు ఎవరా? అని ఆరా తీశానని రఘురామకృష్ణం రాజు తెలిపారు. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ యజమాని నర్రి రెడ్డి విశ్వేశ్వర్ రెడ్డి రాష్ట్రంలో రెండు ప్రాజెక్టుల ఏర్పాటు కోసం ప్రతిపాదనలు అందజేశారన్నారు. ఇందులో 8, 855 కోట్ల రూపాయలతో హైడ్రో స్టోరేజ్ పెడతారట అని పేర్కొన్న రఘురామకృష్ణంరాజు, 33 వేల కోట్ల రూపాయలతో విండోసోల్ పేరిట మరొక ప్రాజెక్ట్ ఏర్పాటుకు ప్రతిపాదించారని తెలిపారు.

ఈ రెండు కంపెనీల చిరునామా హైదరాబాద్ బేగంపేట లోని పుల్లారెడ్డి మిఠాయిల దుకాణం పేరిట ఉన్నాయన్నారు. మొత్తంగా 41,850 కోట్ల రూపాయల పెట్టుబడులను కడప రెడ్డి పెడతారట అంటూ రఘురామకృష్ణంరాజు వెల్లడించారు. ఇందులో 10 వేల కోట్ల రూపాయల వరకు ఈక్విటీ మొత్తంగా పెట్టుబడులు రావచ్చునన్న రఘురామకృష్ణం రాజు, ఈక్విటీ మొత్తాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహాయం చేస్తారేమోనన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే గతంలో నర్రి రెడ్డి విశ్వేశ్వర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డికి డమ్మీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారని పేర్కొన్నారు.

అయితే ఈ విషయాన్ని నర్రి రెడ్డి విశ్వేశ్వర్ రెడ్డి ఖండించవచ్చునని… తాను విజయం సాధించడానికి పోటీ చేశానని చెప్పవచ్చునని అన్నారు. సకల శాఖామంత్రి కి సమీప బంధువైన నర్రి రెడ్డి విశ్వేశ్వర్ రెడ్డికి శిరిడి సాయి ఎలక్ట్రికల్స్ పేరిట చిన్న ట్రాన్స్ఫార్మర్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీ ఉన్నదని తెలిపారు. గతంలోనూ నర్రి రెడ్డి విశ్వేశ్వర్ రెడ్డి పదివేల కోట్ల రూపాయల పెట్టుబడితో రెండు వేల మెగావాట్ల విండ్ ఎనర్జీ కంపెనీని స్థాపించడానికి ముందుకు వచ్చారని, దానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనుమతులను కూడా మంజూరు చేశారని వెల్లడించారు.

అయితే అంతలోనే టాటా పవర్ రంగంలోకి దిగడంతో, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ అనే సంస్థను ఏర్పాటు చేసి, విండ్ ఎనర్జీని అదానికి కట్టబెట్టారన్నారు. శిరిడి సాయి ఎలక్ట్రానిక్స్ కంపెనీ టర్నోవర్ ఏటా 300 నుంచి 400 కోట్ల రూపాయలు ఉంటే ఉండవచ్చునని, అందులో 30 నుంచి 40 కోట్ల రూపాయల లాభం ఉంటుందన్న రఘురామకృష్ణం రాజు, వేలకోట్ల రూపాయలతో రెండు ప్రాజెక్టులను ప్రతిపాదించడం పై ఆయన విస్మయాన్ని వ్యక్తం చేశారు. అరబిందో కంపెనీ కూడా 5000 కోట్ల రూపాయలతో హైడ్రోలిఫ్ట్ జనరేషన్ కంపెనీ, మరో రెండు వేల కోట్ల రూపాయలతో ఫార్మా కంపెనీని స్థాపించడానికి ముందుకు వచ్చిందన్నారు.
ఇక ఏ ఎం గ్రీన్ ఎనర్జీ పేరిట 5000 కోట్ల రూపాయల పెట్టుబడులను పెట్టేందుకు ధరం వీర్, కమల్ ఘోష్ అనే వ్యక్తులు ముందుకు వచ్చారన్నారు. వీరిద్దరూ ఆర్ సి మిట్టల్ కంపెనీలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ హోదాలో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. 50 లక్షల రూపాయల పెయిడ్ క్యాపిటల్ తో, 100 కోట్ల రూపాయల ఆర్థరైజ్డ్ పెయిడ్ క్యాపిటల్ తో సంస్థ ను ఏర్పాటు చేశారన్నారు. ఇక ఊరు పేరు లేని వ్యక్తి పేరిట ఐనోసోల్ అనే కంపెనీ నెల్లూరు జిల్లాలో సోలార్ పానెల్ ఉత్పత్తి తయారీ కంపెనీ స్థాపించడానికి 43 వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపారు.

ఈ కంపెనీ ఇంకా ఇన్ కార్పెట్ అయినట్లు లేదన్నారు. కంపెనీ చిరునామా గురించి, ప్రమోటర్ వివరాలను తెలుసుకునేందుకు గూగుల్, యూట్యూబ్ లలో ఆరా తీస్తే, అసలు అడ్రస్ లేదని చెప్పారు. కేవలం రెండు మూడు వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తే సోలార్ పానెల్ ఉత్పత్తి చేసే అతిపెద్ద కంపెనీని స్థాపించవచ్చని అన్నారు. 43 వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో సోలార్ ప్యానల్ ఉత్పత్తి చేసే కంపెనీని స్థాపించడానికి అవసరమైన మౌలిక వసతులు ప్రపంచంలోనే లేవన్న ఆయన, మరి నెల్లూరు జిల్లాకు, సోలార్ పానెల్ ఉత్పత్తి చేసే సంస్థ ఏర్పాటుకు సంబంధం ఏమిటో తెలియదన్నారు.

ఈ కంపెనీ ఏర్పాటు వెనుక మా ప్రభుత్వ పెద్దలు ఎవరైనా ఉండి ఉండవచ్చునని పేర్కొన్నారు. ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడైన, ఎంపీ వల్లభనేని బాలశౌరి 150 కోట్ల రూపాయల పెట్టుబడితో ఫుడ్ ఇండస్ట్రీ ని పెడతారట అని పేర్కొన్న రఘురామకృష్ణం రాజు , ఈ 1,26 వేలకోట్ల రూపాయల పెట్టుబడులలో, రాష్ట్రంలో నిజంగా పెట్టుబడులు పెట్టేది ఒక్క బాలశౌరి కంపెనీ అయి ఉండవచ్చునన్నారు. ఐనోసోల్ కంపెనీ వెనక కూడా అజ్ఞాత రెడ్డి ఉండి ఉండవచ్చునన్న ఆయన, మిగిలిన పెట్టుబడులన్నీ రాయలసీమ కు చెందిన రెడ్డి సామాజిక వర్గ పారిశ్రామికవేత్తలే పెడుతున్నారని చెప్పారు. అందుకే తమ ప్రభుత్వం వెయ్యి నామినేటెడ్ పదవులలో 750 పదవులను రెడ్డి సామాజిక వర్గ నేతలకే కట్టబెట్టడం జరిగిందని ఎద్దేవా చేశారు.

అసలు చిక్కంతా… ట్రాన్స్మిషన్ లైన్ ఏర్పాటు లోనే !
రాష్ట్రంలో 1. 26 వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో ఏర్పాటు చేసే కంపెనీల ద్వారా 20వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగితే, రాష్ట్ర అవసరాలకు కేవలం రెండు నుంచి మూడు వేల మెగావాట్ల విద్యుత్ వినియోగంతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుందనీ. మిగిలిన విద్యుత్తు ను దేశవ్యాప్తంగా సరఫరా చేయవలసి ఉంటుందన్నారు. దేశవ్యాప్తంగా విద్యుత్ సరఫరాకు ట్రాన్స్మిషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంతో అవసరమని, దాన్ని లక్ష కోట్ల రూపాయలతో కేంద్రం ఏర్పాటు చేయవలసి ఉంటుందన్నారు.

20వేల మెగావాట్ల విద్యుత్ ను రాష్ట్రం నుంచి దేశవ్యాప్తంగా సరఫరా చేయాలంటే ప్రస్తుత పరిస్థితుల్లో కష్టమని చెప్పారు. ఈ ప్రమోటర్లు మన రాష్ట్రంలోనే పెట్టుబడులను ఎందుకని పెట్టాలని అనుకుంటున్నారని ప్రశ్నించిన ఆయన, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ లలో అవసరమైన మౌలిక వసతులు లేవా? అంటూ నిలదీశారు. వీరంతా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని చూసి పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారా?, లేకపోతే స్థలాలను కొట్టేయడానికి వస్తున్నారా??, అదీ కాదంటే మన కళ్ల ఎదురుగానే మన పెట్టుబడులు ఉండాలన్న అపేక్షతో వస్తున్నారా అంటూ ప్రశ్నస్త్రాలను సంధించారు.

నిజంగా పెట్టుబడులు పెట్టాలనుకునే వారు అన్నింటి గురించి ఆలోచిస్తా రని, బుద్దున్నోడు ఎవడు ఇంత డబ్బును రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టారన్న రఘురామకృష్ణం రాజు, ఇది డబ్బులు ఉన్నోడు పెట్టుబడులను పెట్టుకుంటున్నట్లుగా తనకు అనిపిస్తోందని చెప్పారు. 50 లక్షల మూలదనంతో కంపెనీ ప్రారంభించిన వారు ఐదువేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడం ఎలా సాధ్యమని ప్రశ్నించిన ఆయన, 40 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను సాయిబాబా రెడ్డి ఎలా పెడతారు అంటూ నిలదీశారు.

ఎక్కడ నుంచి డబ్బులు తెచ్చి పెడతారని, ఇక ఫలానా వాడు ఎవరు అంటూనే ఏ మారిషస్ నుంచి నిధులు తెచ్చి పెడతారోనని, ఆ మారిషస్ నిధులు ఎక్కడ నుంచి వచ్చాయని సూటిగా ప్రశ్నించారు. ఢిల్లీ మద్యం మాఫియా మూలాలు ఆంధ్రాలో తేలినట్టుగా, ఈ కంపెనీల పెట్టుబడుల మూలాలు మళ్లీ ఆంధ్రాలోనే చూపెట్టుకుంటారని పేర్కొన్నారు. మన డబ్బులే ఇవ్వన్నీ అన్న ఆయన, సారాయి ద్వారా సంపాదించిన డబ్బులు కావచ్చు అంటూ వ్యాఖ్యానించారు. తన వాదనలను ఖండిస్తారా? అంటూ ప్రశ్నించిన రఘురామకృష్ణం రాజు ఖండిస్తే ఖండించుకోండి పెట్టుబడులు వచ్చినప్పుడు చూసుకుందామని పేర్కొన్నారు.

డీజీపీ ఆదేశాలు విడ్డూరంగా అనిపించాయి
అమరావతి రైతులు అరసవల్లి వరకు చేపట్టనున్న పాదయాత్రకు అనుమతిని నిరాకరిస్తూ అర్ధరాత్రి డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి జారీ చేసిన ఉత్తర్వులు విడ్డూరంగా అనిపించాయని రఘురామకృష్ణం రాజు వ్యాఖ్యానించారు. గతంలో పాదయాత్ర సందర్భంగా ఘర్షణలు తలెత్తి, కేసులు నమోదు కావడం జరిగిందని, కోర్టు ఆదేశాలతో పాదయాత్రకు అనుమతినిస్తే సరిగ్గా సహకరించలేదని పేర్కొంటూ… మూడు రాజధానుల సెంటిమెంట్ బలంగా ఉన్న నేపథ్యంలో, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా నిర్ణయించిన విశాఖ మీదుగా పాదయాత్ర చేపడితే ఘర్షణలకు దారి తీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ, అమరావతి రైతుల పాదయాత్రకు అనుమతిని నిరాకరిస్తున్నట్లుగా డిజిపి పేర్కొనడం హాస్యాస్పదంగా అనిపించిందని వెల్లడించారు.

డిజిపి ఉత్తర్వుల నేపథ్యంలో, ప్రజల ప్రాథమిక హక్కులను దృష్టిలో పెట్టుకొని అమరావతి రైతుల పాదయాత్రకు అనుమతిని ఇస్తూ అమూల్యమైన, అమోఘమైన తీర్పునిచ్చిన న్యాయమూర్తికి, అమరావతి రైతుల పక్షా న శిరసు వంచి నమస్కరిస్తున్నానని తెలిపారు.

అయినా తమ ప్రభుత్వం చిల్లర రాజకీయాలు చేసే ప్రమాదం ఉందన్న ఆయన, విశాఖ ప్రజలు సైతం అమరావతి రైతుల పాదయాత్రకు బ్రహ్మరథం పట్టనున్నారని, ఎందుకంటే విశాఖ ప్రజలు రాజధానిని కోరుకోవడం లేదని చెప్పారు. భగవంతుడితోపాటు, రాష్ట్రంలోని 95 శాతం మంది ప్రజలు అమరావతి రైతుల పక్షాన ఉన్నారన్నారు. ఇక టిడిపి, బిజెపి, జనసేన, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు సైతం రాజధానిగా అమరావతికి సంపూర్ణ మద్దతునిస్తున్నాయని , కడప ప్రజలు సైతం రాజధానిగా విశాఖ ను నిరాకరిస్తున్నారని చెప్పారు. విశాఖ రాజధాని అయితే వెళ్లడానికి తమకున్న ఇబ్బందులను ఏకరువు పెడుతున్నారన్నారు.

న్యాయస్థానాలలో న్యాయమే జరుగుతుందని మరొకసారి రుజువైందన్న రఘురామకృష్ణంరాజు, మనకు ఇష్టం లేకపోతే కొన్ని రోజులు ఆపగలమేమో కానీ, ఎప్పటికీ అడ్డుకోలేమన్నారు. పిచ్చి తుగ్లక్ లాగా, పిచ్చిరెడ్డి అనిపించుకో వద్దని జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ నాయకుడు తులసి రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా రఘురామకృష్ణంరాజు ప్రస్తావించారు. అమరావతి రైతులు అరసవల్లిలో నిర్వహించే బహిరంగ సభకు హాజరవుతానని పేర్కొన్న రఘురామకృష్ణం రాజు, గతంలో తిరుపతిలో జరిగిన సభకు కూడా హాజరైన విషయాన్ని గుర్తు చేశారు.

LEAVE A RESPONSE