– మాజీ మంత్రులు కొడాలి నాని.. కటారి ఈశ్వర్ కుమార్ల ఆత్మీయ కలయిక
– నాటి తరం, నేటితరం నేతల భేటీపై వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం
– కొడాలి నానికు సంపూర్ణ మద్దతిస్తున్నట్టు కటారి ప్రకటన
– వైఎస్ఆర్సిపి ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలపై దాడులు చేస్తే సహించను
– టీడీపీ శ్రేణులకు ఈశ్వర్ కుమార్ హెచ్చరిక
గుడివాడ: గుడివాడ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్స్ అయిన మాజీ మంత్రులు కొడాలి నాని, కటారి ఈశ్వర్ కుమార్ ఆత్మీయంగా కలుసుకున్నారు. రాజేంద్రనగర్ లోని ఆయన స్వగృహంలో కొడాలి నానిను మంగళవారం ఉదయం కటారి ఈశ్వర్ కుమార్ కలిసి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు ఇరువురు పలు విషయాలపై మాట్లాడుకున్నారు.
నాటి తరం, నేటితరం రాజకీయ నేతలైన కొడాలి, కటారిల భేటీతో గుడివాడ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. భేటీ అనంతరం కోర్టు షరతులు కారణంగా సంతకం చేసేందుకు గుడివాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు కొడాలి నాని వెళ్లాల్సి ఉండడంతో, ఆయనతో కలిసి ఒకే కారులో కటారి కూడా స్టేషన్ వద్దకు వచ్చారు. అనంతరం ఇరువురు నేతలు స్టేషన్ లోపలికి వెళ్లి ప్రొసీజర్ అనంతరం తిరిగి బయటకు వచ్చారు.
కోర్టు నిబంధనల కారణంగా కొడాలి నాని స్టేషన్ నుండి ఇంటికి వెళ్లిపోగా, రైతు బజార్ సెంటర్లో కటారి ఈశ్వర కుమార్ మీడియాతో మాట్లాడారు. పవన్ కల్యాణ్ మీద అభిమానంతో 2024 ఎన్నికల్లో నా రెండు ఓట్లను కూటమికి వేశానని చెప్పిన కటారి, ఎన్నికల అనంతరం ఇప్పటివరకు తటస్థంగా ఉన్నట్టు వెల్లడించారు.
గుడివాడలో టీడీపీ గుండాలు చేస్తున్న అరాచకాలను గతంలోనే తాను మీడియా ద్వారా ప్రశ్నించానని, ఎమ్మెల్యే రాముకు ఫోన్ చేసి సరైన పద్ధతి కాదని అప్పుడే చెప్పినట్టు ఆయన పేర్కొన్నారు. అయినా వారి తీరు మారకపోగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలపై దాడులు చేస్తుండటం దారుణం అన్నారు.
ఈ అరాచకాలను ఖండిస్తూ, కొడాలి నానికు తన మద్దతు ప్రకటిస్తున్నట్టు మీడియా సమావేశంలో కటారి ఈశ్వర్ కుమార్ ప్రకటించారు. నేటి నుండి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలపై దాడులు చేస్తే బాధితులకు అండగా ఉంటానని, వారికి న్యాయం జరిగే వరకూ పోరాడుతానని ఈ సందర్భంగా కటారి ఈశ్వర్ కుమార్ తెలిపారు. గుడివాడలో పోలీసులు ప్రేక్షక పాత్రకే పరిమితం అయ్యారని ఆక్షేపించిన కటారి, వారు పచ్చ చొక్కాలు వేసుకొని తిరిగితే బాగుంటుందని ఈ విషయాన్ని తాను సీఐ కి కూడా చెప్పినట్టు కటారి వెల్లడించారు.