– వ్యవసాయం, రైతులకే ఈ ప్రభుత్వం ఫస్ట్ ప్రయార్టీ
– కోనసీమలో క్రాప్ హాలిడే ప్రకటిస్తే.. చంద్రబాబు రైతుల్ని అణచివేశాడు
– కోనసీమ రైతుల సమస్యల పరిష్కారంలో ఈ ప్రభుత్వం ముందుంది
– రైతు కోసం అని చంద్రబాబు, పవన్ లు మాట్లాడటం హాస్యాస్పదం
– టీడీపీ 5 ఏళ్ళ పాలనలో ఏటా వందల సంఖ్యలో కరువు మండలాల ప్రకటనలే.
– వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, అగ్రికల్చర్ మిషన్ వైస్ ఛైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి
చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ లకు ప్రజలు ఎప్పుడో రాజకీయ హాలిడే ఇచ్చారని, అటువంటి వారు క్రాప్ హాలిడే పేరుతో రైతుల్ని రెచ్చగొడితే, వారి మాటలను ఎవరు విశ్వసిస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, అగ్రికల్చర్ మిషన్ వైస్ ఛైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు.
అధికారంలో ఉంటే పసుపు పచ్చ కండువాలు, అధికారం పోయాక ఆకు పచ్చ కండువాలు భూజాన వేసుకుని, అప్పుడప్పుడూ రాష్ట్రానికి టూరిస్టుల్లా వచ్చి వెళుతూ, రైతు వేషంతో మోసం చేసే నాయకులను ఎవరూ నమ్మరన్నారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, రైతు నాయకులుగా మేము ఎప్పుడూ ఆకుపచ్చ కండువాలనే భుజాన వేసుకుంటామని స్పష్టం చేశారు. రైతుల్ని గుండెల్లో పెట్టుకుని చూసే వైఎస్ఆర్ గారి వారసుడిగా, జగన్ మోహన్ రెడ్డిగారు వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తూ, రైతు పక్షపాతిగా పరిపాలన చేస్తుంటే, చూసి ఓర్వలేకే క్రాప్ హాలిడేల పేరుతో ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారని నాగిరెడ్డి ధ్వజమెత్తారు.
ఆఖరికి రైతులను కూడా మీ స్వార్థ రాజకీయాలకు వాడుకోవడం భావ్యం కాదన్నారు. మాది రైతు కులం, మా మతం వ్యవసాయం… దయచేసి రైతులతో రాజకీయాలు చేయొద్దు అని నాగిరెడ్డి హితవు పలికారు. ఎన్నికల వాగ్దానాల్లో మూడేళ్ళలోనే 95-96 శాతం అమలు చేసిన, నిబద్ధత గల నాయకుడు జగన్ మోహన్ రెడ్డిగారి వెంట నడుస్తున్నందుకు మేము గర్వపడుతున్నామని అన్నారు.
గత టీడీపీ ప్రభుత్వంలో ఇదే కోనసీమలో రైతులు క్రాప్ హాలిడే ప్రకటిస్తే, నిరంతరాయంగా సెక్షన్ 30 అమలు చేసి, కేసులు పెడతామని రైతు సంఘాల నాయకులను బెదిరించి, రైతులను అణచివేసిన చరిత్ర చంద్రబాబుది అని గుర్తు చేశారు. అదే ఈ ప్రభుత్వంలో, కోనసీమలో రైతులకు ఏమైనా సమస్యలు ఉంటే, వాటిని ముఖ్యమంత్రిగారి దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించడానికి అగ్రికల్చర్ మిషన్ అనుసంధానంగా ఉంటుందని నాగిరెడ్డి తెలిపారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్, అధికారులు క్షేత్రస్థాయికి వెళ్ళి రైతుల సమస్యలను పరిష్కరిస్తున్నారని, అప్పటికీ పరిష్కారం కాకపోతే.. రైతు సంఘాలుగా వచ్చినా, రైతులుగా వచ్చినా, మీ సమస్యలను ముఖ్యమంత్రిగారితో చర్చించి, పరిష్కరించడానికి మేం సిద్ధంగా ఉన్నాం అని తెలిపారు.ఎంవీఎస్ నాగిరెడ్డి మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే…
బాబు ఏ ఒక్క హామీ అయినా నెరవేర్చాడా..?
ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్న మేము ఎప్పుడూ వ్యవసాయానికి, రైతుకు చిహ్నమైన ఆకు పచ్చ కండువాలే వేసుకుని ఉన్నాం. అధికారంలో ఉన్నప్పుడు పసుపు కండువాలు, అధికారంలో లేనప్పుడు రైతు కండువాలు వేసుకునే వాళ్ళు మీరు. ఇటువంటి డ్రామాలు వేశారు కాబట్టే రాజకీయంగా మీకు హాలిడే ఇచ్చి ప్రజలు ఇంటికి పంపారు.
2014-19 మధ్య చంద్రబాబు ఇచ్చిన హామీలు, అధికారంలోకి వచ్చిన తర్వాత నెరవేర్చిన తీరు చూస్తే…
1- బేషరతుగా రైతు రుణాలన్నీ మాఫీ చేస్తానన్నారు, బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన పుస్తెలను మీ ఇంటికే తెచ్చి ఇస్తాను అని చెప్పారు.
2- పగటిపూటే 9 గంటలపాటు నిరంతరాయంగా ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు.
3- రూ. 5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామన్నారు.
4- మద్దతు ధరల విషయంలో స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేస్తాన్నాడు.
5- సాగు నీటి ప్రాజెక్టులు, వెలిగొండ, హంద్రీ-నీవా, గాలేరు-నగరి పోలవరం సహా అన్నింటినీ 2018 నాటికి పూర్తి చేసి, రాయలసీమకు నీళ్ళు ఇచ్చి ఎన్నికలకు వెళతాన్నారు.
6- రెయిన్ గన్లతో కరువును జయించాను.. తుపానులను, సముద్రాన్ని కంట్రోలు చేసి నీటిని పారిస్తానన్నారు.
7- రూ. 87,612 కోట్లు వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తానని హామీ ఇచ్చి, రకరకాల కోతలతో రూ. 24 వేల కోట్లకు తగ్గించి, అందులో రూ. 14- 15 వేల కోట్లు ఇచ్చి, ఆఖరి రెండు ప్రీమియంలను రైతులకు అసలు చెల్లించలేదు.
బాబును పవన్ కల్యాణ్ ఏనాడైనా ప్రశ్నించాడా?
2014 ఎన్నికల్లో చంద్రబాబుకు మద్దతు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక కూడా, ప్రజలు, రైతులకు సంబంధించిన ఏ అంశాన్ని అయినా ధైర్యంగా ప్రశ్నిస్తానని చెప్పిన పవన్ కల్యాణ్.. టీడీపీ హయాంలో 5 ఏళ్ళలో, రైతాంగానికి చంద్రబాబు ఇచ్చిన హామీలలో ఒక్కటైనా ఎందుకు అమలు చేయలేదు అని ప్రశ్నించారా?
– జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టాక, 14 నెలలపాటు కొవిడ్ సంక్షోభంతో ప్రపంచ ఆర్థిక పరిస్థితులు తలకిందులైనా, రైతులను అన్నివిధాలా ఆదుకున్నారు. ప్రజలకు మంచి చేయటానికి కావాల్సింది అనుభవం ఒక్కటే కాదు, కమిట్ మెంటు అని జగన్ మోహన్ రెడ్డిగారు నిరూపించారు.
– జగన్ మోహన్ రెడ్డి మొట్టమొదటి రత్నమే వైఎస్ఆర్ రైతు భరోసా, దానికి వైఎస్ఆర్ రైతు భరోసా- పీఎం కిసాన్ అని పేరు పెట్టి ఏటా రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నారు.
– చెప్పిన దాని కంటే మిన్నగా, వైఎస్ఆర్ రైతు భరోసా కింద ఏటా రూ. 13, 500 ఇస్తూ, గత మూడేళ్ళలో రూ. 23, 875.59 కోట్లు రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేశారు.
– చెప్పిన మాట ప్రకారం, పగటిపూటే 9 గంటలపాటు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఐదేళ్ళలో ఏనాడైనా పగటిపూట నిరంతరాయంగా 9గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చారా..?
– చంద్రబాబు ఉచిత విద్యుత్ బకాయిలు రూ. 8, 750 కోట్లు పెట్టారు. అంటే గత టీడీపీ ప్రభుత్వం 15 నెలల వాడకానికి డబ్బులే చెల్లించలేదు. అంటే టీడీపీ 5 ఏళ్ళ పాలనలో కేవలం మూడున్నరేళ్ళు మాత్రమే ఉచిత విద్యుత్ ఇచ్చింది.
– రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ఉచిత పంటల బీమా అందిస్తున్నాం.
– గత ప్రభుత్వం ధాన్యం బకాయిలు రూ.960 కోట్లు, విత్తన సేకరణ బకాయిలు రూ.384 కోట్లు జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక చెల్లించారు.
– ఇలా మొత్తం వ్యవసాయం, అనుబంధ రంగాలకు జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక డీబీటీ ద్వారా నేరుగా రైతులకు చేసిన సాయం రూ. 76, 835.59 కోట్లు.
– రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనాల్సింది ఎఫ్ సీఐ.. అంటే కేంద్ర ప్రభుత్వం. ప్రొక్యూర్ మెంట్ అన్నది కొంత ఆలస్యం అవటం ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. కానీ జగన్ మోహన్ రెడ్డిగారు అధికారంలోకి వచ్చాక, రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి, రైతులకు అక్కడే అన్ని సేవలు అందిస్తున్నారు. ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్ళకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తెచ్చి మరీ చెల్లిస్తున్నా.. ఎఫ్ సీఐ నుంచి రావాల్సిన బకాయిలు ఉంటూనే ఉన్నాయి. ఇందుకు పవన్ కల్యాణ్ గానీ, మరొకరుగానీ ప్రశ్నించాల్సింది కేంద్ర ప్రభుత్వాన్నే. ఫెడరల్ వ్యవస్థలో కేంద్రం, రాష్ట్రం సమన్వయంతో పనిచేయాలనే ఉద్దేశంతో జగన్ మోహన్ రెడ్డిగారు ముందుకు వెళుతున్నారు.
ఇవాళ కోనసీమలో ప్రతి రైతుకు ధాన్యం డబ్బులు చెల్లించాం. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోనసీమలో రైతులు క్రాప్ హాలిడే ప్రకటించినప్పుడు, ఐసిఆర్ ను పిలిపించి అధ్యయనం చేశారు. అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులపై చర్చ జరిగింది. ఇదే పరిస్థితి తిరిగి టీడీపీ హయాంలో వస్తే.. కోనసీమలో నిరంతరాయంగా సెక్షన్ 30 అమలు చేసి, రైతు సంఘాల నేతలపై కేసులు పెడతామని భయపెట్టి, బెదిరించి.. రైతుల ఆందోళనలను అణచివేశారు. అప్పుడు చంద్రబాబుకు, పవన్ కల్యాణ్ లకు కోనసీమ గుర్తుకు రాలేదు. కోనసీమకు చంద్రబాబు ఏం మేలు చేశారో చెప్పమనండి.
చంద్రబాబు పాలనలో హామీలు ఇచ్చి వైఫల్యం చెందిన వాటిపై ఏ ఒక్కరోజు అయినా పవన్ ప్రశ్నించాడా..?చంద్రబాబు హయాంలో కరెంటు బిల్లులపై రైతులు ఆందోళన చేస్తే, బషీర్ బాగ్ కాల్పులు జరిగాయి. ఆయన హయాంలో ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోతే.. పంటలు ఎవరు వేయమన్నాడని రైతులను నోటికొచ్చినట్లు మాట్లాడాడు. కోనసీమలో సెక్షన్ 30 పెట్టి, కేసులతో బెదిరింపులు చేసి, రైతులను అణచివేశాడు. అప్పుడు పవన్ కల్యాణ్ ఎక్కడికి వెళ్ళాడు.
సముద్ర తీర ప్రాంతాల్లో కొంతవరకు పల్లపు భూములు ఉంటాయి. అవేవీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే రాలేదు. టై ల్యాండ్ లో ఖరీఫ్ ను వదిలేసి, రబీ సాగు జరుగుతుంది. చంద్రబాబు, పవన్ లకు ప్రజలు 2019లోనే రాజకీయ హాలిడే ఇచ్చారు. రాష్ట్రానికి టూరిస్టులు మాదిరిగా వచ్చి వెళ్ళే వారి మాటలను రైతులు ఎవరూ నమ్మరు.
– మా ప్రభుత్వం రైతులకు ఏమైనా సమస్యలు వస్తే, ఎప్పటికప్పుడు పరిష్కరిస్తుంది. అదే చంద్రబాబు ప్రభుత్వం రైతులను అణిచివేసే పనులు చేసింది. ప్రతి అంశాన్నీ రాజకీయం చేస్తున్నారు. ముఖ్యమంత్రిని పట్టుకుని టీడీపీ యువ నాయకుడు మాట్లాడే భాష అత్యంత దారుణంగా ఉంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించటం తెలియని వ్యక్తులు వీళ్ళు. వీళ్ళ గురించి స్వర్గీయ ఎన్టీఆర్ మాట్లాడిన వీడియోలు చూస్తే.. ఏమాత్రం ఆత్మాభిమానం ఉన్నా చంద్రబాబు ఏం చేసుకుంటారో మరి..!
ధాన్యం ఉత్పత్తి సరాసరి 11 లక్షల టన్నులు పెరిగింది
ఆహార ధాన్యాల ఉత్పత్తి చూస్తే.. టీడీపీ 5 ఏళ్ళ పాలనలో ఏడాదికి సరాసరి ధాన్యం ఉత్పత్తి 121.93 లక్షల టన్నులు ఉంటే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక, ఈ 3 ఏళ్ళలో 2019-20లో 137.10 లక్షలు, 2020-21లో 130.97 లక్షలు, 2021-22లో 133.53 లక్షలు.. మూడేళ్ళలో సరాసరి చూస్తే 133.86 లక్షల టన్నులు.. అంటే, 11.93 లక్షల టన్నులు సరాసరిగా ధాన్యం ఉత్పత్తి జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక పెరిగింది.
ఆహార ధాన్యాల ఉత్పత్తి చూసినా, టీడీపీ హయాంలో సరాసరి 153.95 లక్షల టన్నులు ఉంటే.. ఈ మూడేళ్ళలో సరాసరి 171.14 లక్షల టన్నులు ఉత్పత్తి జరిగింది. అంటే, 17.19 లక్షల టన్నులు సరాసరి పెరిగింది.
ఉద్యానవన పంటలు చూస్తే.. టీడీపీ హయాంలో సరాసరి 305.20 లక్షల టన్నులు పండితే.. మన హయాంలో 369 లక్షల టన్నులు పెరుగుదల కనిపిస్తోంది.
బాబు-కరవు కవల పిల్లలు
రాష్ట్రంలో కరవు పరిస్థితులు ఎప్పులు ఎలాః
– రాష్ట్రంలో టీడీపీ హయాంలో 2014 నుంచి 2018 వరకు ఏటా వందల కొద్దీ కరువు మండలాలను ప్రకటించారు.
2014లో 238 కరవు మండలాలు
2015లో 359 కరవు మండలాలు
2016లో 301 కరవు మండలాలు
2017లో 121 కరవు మండలాలు
2018లో 347 కరవు మండలాలు ప్రకటించారు.
అదే జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక 2019 నుంచి 2021 వరకు ఒక్క కరువు మండలం లేదు.
రాష్ట్రంలో 18 లక్షల 70 వేల వ్యవసాయ విద్యుత్ మోటార్లు ఉంటే.. చంద్రబాబు హయాంలో 2018 నాటికి 17.65 మీటర్లు లోతున భూగర్భజలాలు పడిపోయాయి. మోటార్లు కాలిపోయి, పండిన పంట చేతికందక, రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. – అదే ఈ మూడేళ్ళలో 2021 నవంబరు నాటికి 5.79 మీటర్లకు సరాసరి భూగర్భ జలాలు పెరిగాయి. ఒక్క మోటారు కూడా ఫెయిల్ అయిన పరిస్థితి లేదు. అందుకే చంద్రబాబు- కరవు కవల పిల్లలు అని అంటారు.పై గణాంకాలు చూసినా, చంద్రబాబు, జగన్ మోహన్ రెడ్డి పాలనకు ఏ రకంగానూ పొంతన ఉండదని ఎవరికైనా అర్థమవుతోంది.
వ్యవసాయ రంగానికి చంద్రబాబు- జగన్ గార్లు కేటాయించిన బడ్జెట్ చూస్తే..
2014-15లో 11.72 శాతం
2015-16లో 12.54 శాతం
2016-17లో 11.97 శాతం
2017-18లో 11.6 శాతం
2018-19లో 9. 98 శాతం కేటాయించారు.
అదే జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక… బడ్జెట్ లో వ్యవసాయానికి కేటాయింపులు చూస్తే..
2019-20లో 12.66 శాతం
2020-21లో 12.97 శాతం
2021-22లో 13.6 శాతం
2022-23లో 16.8 శాతం కేటాయించారు.
రైతు ఆత్మహత్యల్ని హేళన చేసిన బాబు
టీడీపీ హయాంలో రైతుల ఆత్మహత్యలను ప్రేమ వైఫల్యాలని, గత ప్రభుత్వం తాలూకు పరిస్థితుల వల్ల జరిగాయని హేళన చేసిన చంద్రబాబు, ఈరోజు ఆత్మహత్యల గురించి మాట్లాడటం హాస్యాస్పదం.రై తుల ఆత్మహత్యలు విషయానికొస్తే.. టీడీపీ హయాంలో రైతుల ఆత్మహత్యలపై నాడు ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నిస్తే.. అనంతపురం వెళ్ళి నిరూపిస్తే.. ఆఖరుకు ఆ జిల్లాలో 80 మంది చనిపోయారని అప్పటి చంద్రబాబు ప్రభుత్వం అంగీకరించింది.
టీడీపీ 5 ఏళ్ళ పాలనలో 450 మంది రైతులకు నష్ట పరిహారం ప్రకటిస్తే.. జగన్ అధికారంలోకి వచ్చాక, టీడీపీ హయాంలో జరిగిన రైతు ఆత్మహత్యలపై పూర్తిగా అధ్యయనం చేయించి, అన్నీ రివైజ్ చేసి, టీడీపీ హయాంలో ఆత్మహత్యలు చేసుకున్న మరో 458 మందికి ఈ ప్రభుత్వం వచ్చాక ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షలు చొప్పున పరిహారం ఇవ్వటం జరిగింది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, 2019, 2020లలో కూడా ఆత్మహత్యలు నమోదైతే, వాటిని మాత్రం గత చంద్రబాబు ప్రభుత్వం వల్లే జరిగినవని మాత్రం అంగీకరించటం లేదు. ఈ ఏడాది 126కు ఆత్మహత్యలు తగ్గాయి. వాస్తవాలకు విరుద్ధంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు మాట్లాడుతున్నారు.
పవన్ కల్యాణ్ తగుదునమ్మా అంటూ.. నేను వెళ్ళటం వల్లే కౌలు రైతులకు పరిహారం ఇస్తున్నారని మాట్లాడుతున్నాడు. అంటే పవన్ కల్యాణ్ వల్లే జగన్ మోహన్ రెడ్డిగారు, రైతు భరోసా, అమ్మ ఒడి, విద్యా దీవెన, డ్వాక్రా సంఘాలకు ఆసరా ఇస్తున్నారా..?
ధాన్యానికి మద్దతు ధర, వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరలు, డీజిల్, ఆయిల్, ఎరువుల ధరలు, క్రాప్ ఇన్సూరెన్స్, వ్యవసాయ రుణాలకు వడ్డీ.. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వమే చేయాలి, వ్యవసాయం మీద రైతుకు ఆదాయం తగ్గుతున్నప్పుడు డిమాండ్ చేయాల్సింది కేంద్రాన్ని. ఆ మాత్రం కనీస జ్ఞానం లేకుండా మీరు ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షడుగా ఉన్నారా.. అని పవన్ కల్యాణ్ ను ప్రశ్నిస్తున్నాం.
కోనసీమ రైతుల్ని ఆహ్వానిస్తున్నాం
అగ్రి మిషన్ వైఎస్ ఛైర్మన్ గా, రైతు నాయకుడిగా కోనసీమ రైతుల్ని ఆహ్వానిస్తున్నాం. మీ సమస్య పరిష్కారానికి అగ్రి మిషన్ సిద్ధంగా ఉంది. మేం మీకు అనుసంధానంగా ఉంటాం. మానవతా దృక్పథంతో ఉన్న ప్రభుత్వం ఇది. కోనసీమలోని అమలాపురం, ముమ్మడివరం మండలాల్లో రైతుల సమస్యలు పరిష్కారం కోసం ముఖ్యమంత్రితో చర్చించడానికి మేం సిద్ధంగా ఉన్నాం.
వాస్తవంగా, వైఎస్ఆర్ రైతు భరోసా ఇచ్చింది రాబోయే ఏడాదికి రైతుకు పెట్టుబడి కోసం కదా.. సాగు కోసం రైతు భరోసా డబ్బులు తీసుకుని, క్రాప్ హాలిడే అని మాట్లాడటం రాజకీయం కాక మరేమిటి..? ఆక్వా సాగు చేసే వారు కూడా క్రాప్ హాలిడే అంటుంటే ఆశ్చర్యం వేస్తుంది. వైఎస్ఆర్ గారిని, ఆయన కుటుంబాన్ని రైతులు ఎప్పుడూ తమ కుటుంబం అనుకుంటున్నారు. ఆయన కొడుకుగా జగన్ రైతులకు అండగా నిలబడ్డారు. కొవిడ్ పరిస్థితుల్లోనూ వ్యవసాయం మీద ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ జగన్ రైతులను ఆదుకున్నారు. వ్యవసాయ రంగం, రైతులకే ఈ ప్రభుత్వం మొదటి ప్రయార్టీ ఇస్తుంది. జీవితాన్ని పణంగా పెట్టి, ప్రజల మధ్య పోరాడి ముఖ్యమంత్రి అయిన జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడూ రైతుల పక్షానే ఉంటారు. రైతుకు చిన్న కష్టం వచ్చినా ఆయన చలించిపోతారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి మానస పుత్రికలైన రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయాల వ్యవస్థలను ప్రపంచవ్యాప్తంగా కొనియాడుతుంటే.. వేరే రాష్ట్రాల వాళ్ళు ఇక్కడకు వచ్చి చూసి, మెచ్చుకుంటుంటే, ఇక్కడ ప్రతిపక్షాలు పనిగట్టుకుని విమర్శలు చేయడం తగదు. విలేకర్ల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ అగ్రికల్చర్ మిషన్ సభ్యుడు జిన్నూరి రామారావు కూడా పాల్గొన్నారు.