– ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్
హైదరాబాద్: “దుర్మార్గుడు దేశాన్ని తగలబెట్టి, ఆ బూడిద కుప్ప మీద సింహాసనాన్ని వేసుకుంటాడు” అన్న సన్ జూ సూక్తి నేడు తెలంగాణ రాజకీయాలకు అద్దం పడుతోందని బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. తెలంగాణలో ప్రస్తుతం కనిపిస్తున్నది ప్రజా పాలన కాదు, వికృత రాజకీయ క్రీడ అని ఆయన ధ్వజమెత్తారు.
అప్రజాస్వామిక విచారణ: నిరాధారమైన, నిలకడలేని ఫోన్ ట్యాపింగ్ కేసు పేరుతో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ని గత 7.5 గంటలుగా విచారణ ముసుగులో వేధిస్తున్న తీరు అమానుషం. ఇది ముమ్మాటికీ అప్రజాస్వామికం.ప్రశ్నిస్తే వేధింపులా?: సింగరేణిలో జరుగుతున్న అవినీతిని
హరీష్ రావు ప్రశ్నించినందుకే, ఈ విధంగా ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగుతోందని ఆయన ఆరోపించారు.
వ్యవస్థల దుర్వినియోగం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికార గర్వంతో వ్యవస్థలను తన వ్యక్తిగత కక్షల కోసం పావులుగా వాడుకుంటున్నారు. ఖాకీ డ్రెస్సును తన రాజకీయాల కోసం ‘ఖాదీ’గా మార్చేశారని, చట్టం తన పని తాను చేయకుండా అధికార పార్టీ రాసిన స్క్రిప్ట్ ప్రకారం నడవడం క్షమించరాని నేరమని ఆయన విమర్శించారు.
రాజకీయ పతనం తప్పదు: ప్రజాస్వామ్యంలో ప్రశ్నను నేరంగా చిత్రీకరించడం, విమర్శించిన వారిపై సెక్షన్లతో సంకెళ్లు వేయడం దుర్మార్గం. నేడు మీరు ప్రయోగిస్తున్న ఈ ‘పోలీసు అస్త్రాలు’ రేపు మీ రాజకీయ పతనానికే పునాది అవుతాయని హెచ్చరించారు.
ధైర్యంగా పోరాడుతాం: అణచివేత పెరిగే కొద్దీ తిరుగుబాటు మరింత ప్రచండంగా ఉంటుంది. చీకటి రోజులు శాశ్వతం కావు, సత్యం నిప్పులాంటిదని, న్యాయమే అంతిమంగా గెలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కష్టకాలంలో పార్టీ శ్రేణులంతా హరీష్ రావు కి అండగా ఉంటాయని దాసోజు శ్రవణ్ స్పష్టం చేశారు.