– ఎయిమ్స్ బాగు పడితే విజయవాడ, గుంటూరు మెడికల్ మాఫియా ఆటలు సాగవు
– అందుకే అక్కడ అన్నీ అవ్వనివ్వరు
ఎయిమ్స్ మంగళగిరి 2018 జనవరిలో విజయవాడ సిద్దార్థ మెడికల్ కాలేజ్ ప్రాంగణంలో ప్రారంభం అయ్యింది. మొదటి బ్యాచ్ MBBS కోర్సు ప్రారంభం సందర్భంగా ఎయిమ్స్ డిప్యూటీ డైరెక్టర్ గా నియమితులైన ఒక ఉత్తరాది IRS అధికారితో పరిచయం అయ్యింది. దాదాపు ఏడాదిన్నర వ్యవధిలోనే మంగళగిరిలో ఔట్ పేషెంట్ సేవలు మొదలు అయ్యాయి. ప్రస్తుతం రోజుకు 2వేల మంది ఔట్ పేషెంట్ లు సేవలు పొందుతూ ఉన్నారు. రెండేళ్ల క్రితం భుజం గాయంతో ఎయిమ్స్ ఆర్థోపెడిక్ నిపుణుల్ని కలిస్తే MRI స్కాన్ రాశారు.
దాని క్యూ 45 రోజుల పొడవు ఉంది. మీకు ఒక నమస్కారం అనుకుని మళ్లీ అక్కడకు పోలేదు. సాధారణ ఆరోగ్య సమస్యలకు కూడా రోగ నిర్ధారణ పరీక్షలు కనీసం 48 గంటల సమయం పడుతోంది. ఒక రోజు జెనరల్ ఓపీకి వెళితే వాళ్ళు ఏ డాక్టర్ దగ్గరకు వెళ్ళాలో నిర్ణయించి సిఫార్సు చేస్తే అక్కడ అదృష్టం బాగుంటే అదే రోజు, లేదంటే మర్నాడు డాక్టర్ ను కలిసే అవకాశం లభిస్తుంది. అక్కడ రెండో రోజు వ్యాధి నిర్దారణ పరీక్షలు సిఫార్సు చేస్తే వాటిని పరగడపున చేయించుకోవాలి. అది 2 లేదా మూడో రోజు అవుతుంది.
MRI, CT స్కాన్ వంటివి అయితే కనీసం నెల రోజులు ఆగాలి. ఈ సమస్యలు అన్నీ పరిచయం ఉన్న DD గారికి చెబితే ఆయన గట్టిగా నవ్వి మీ రాష్ట్ర రాజకీయాలే ఎయిమ్స్ కు శాపం. అవన్నీ మాకు తెలుసు, కానీ ఎందుకు అవ్వడం లేదు, 24 గంటల డయాగ్నొస్టిక్ లాబ్స్ మేము ఎప్పుడో ప్రతిపాదించాము. కానీ అవ్వలేదు, మీ రాష్ట్ర నాయకులు తలచుకుంటే ఎందుకు అవ్వవు.. అవ్వనివ్వరు. మీరు రాయండి. గట్టిగా రాస్తేనే దానికి మంచి జరుగుతుంది అన్నారు. ఎయిమ్స్ బాగు పడితే విజయవాడ, గుంటూరు మెడికల్ మాఫియా ఆటలు సాగవు. అందుకే అక్కడ అన్నీ అవ్వనివ్వరు.