– అనకాపల్లి, పరవాడ, అచ్యుతాపురం, కొండపల్లి పంటపొలాలు విషతుల్యం
– శుద్ధి చేయకుండా నేరుగా గెడ్డలోకి పారబోస్తున్న కంపెనీలు
– సముద్రంలోకి వదిలేస్తున్న ‘రాంకీ’ అంటే పాలకులకు వణుకు
– ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ సీఎం ఉన్నా వైసీపీ ఎంపీ ‘రాంకీ’ కంపెనీదే హవా
– పీసీబీ ఆఫీసులో నిత్యం దర్శనమిచ్చే లైజనింగ్ అధికారి
– నీరు ఉప్పగా మారిందంటూ కొండపల్లి, పరవాడ రైతుల గగ్గోలు
– వందల ఎకరాలు బీడుగా మారుతున్న రసాయన విషాదం
– వందల సంఖ్యలో మృతి చెందుతున్న పశువులు
– దానితో పంట దెబ్బతిని జీవనాధారం కోల్పోతున్న రైతన్న
– పీసీబీ అధికారులకు చెప్పినా చర్యలు శూన్యం
– ఉత్తుత్తి నోటీసులతోనే సరి పెడుతున్న ‘మామూలు’ వ్యవహారం
– పవన్‌ను తప్పుదోవపట్టిస్తున్న పీసీబీ అధికారులు
– పీసీబీని చూసి ధృతరాష్ర్టుడూ సిగ్గుపడాల్సిందే
( మార్తి సుబ్రహ్మణ్యం)
దేశానికి పట్టెడన్నం పెట్టే రైతన్న కడుపు కొడుతున్న కెమికల్ కంపెనీల ‘విష’ కౌగిలికి పచ్చని పొలాలు నశించిపోతున్నాయి. కంపెనీలు విడుదల చేసే విష వ్యర్థాలకు పశువులు పైలోకానికి వెళుతున్నాయి. నీరు ఉప్పనవుతుంటే.. గాలి కాలుష్యమవుతోంది. పాలదిగుబడి దారుణంగా తగ్గుతోంది. పరవాడ, అనకాపల్లి, అచ్యుతాపురం, కృష్ణా జిల్లా కొండపల్లిలోని కెమికల్ పరిశ్రమలు సామూహికంగా రైతన్న గుండెల్లో గుచ్చుతున్న ‘విష’ గునపాలివి!
ఇక విశాఖలో మోతుబరి ‘రాంకీ’ ఫార్మా కంపెనీ సంగతి స్వయంగా పీసీబీనే తేల్చింది. శుద్ధి చేయాల్సిన వ్యర్థాలను నేరుగా కలిపేస్తున్న ఫలితంగా, లక్షల సంఖ్యలో చేపలు గిలగిల కొట్టుకుని ఒడ్డుకు వస్తున్న విషాదం. దానిని ముట్టుకునే దమ్మున్న పాలకులెవరూ ఇప్పటిదాకా కనిపించలేదు.
కారణం.. పాలక పెద్దలతో లాలూచీ రాజకీయాలు! ఎన్నికల సమయంలో ఇచ్చే విరాళాల కృతజ్ఞత!? సదరు కంపెనీ లైజనింగ్ అధికారి సదా పీసీబీ ఆఫీసులోనే తిష్ఠవేస్తుంటారంటే, ఈ ‘పవిత్రబంధం’ ఎంత బలంగా ఉందో చెప్పనక్కర్లేదు. ఈ మధ్యలో.. ప్రజలను రక్షించాలంటూ వామపక్ష కార్మిక సంఘాలు చేసే ఆందోళన, వినిపించే గొంతు వృధా ప్రయాసే!!
విజయవాడ టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే బొండా ఉమ పుణ్యాన.. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పనితీరు ఏమిటన్నది రాష్ట్ర ప్రజలకు తెలిసింది. ‘‘ కాలుష్య వ్యర్ధాలను కాల్వల్లో పారబోస్తున్న కంపెనీలపై చర్యలేవీ? రాంకీపై చర్యలకు కృష్ణయ్య గారు ఎందుకు వెనకాడుతున్నారు? అసలు పీసీబీ పనిచేస్తోందా? లేదా? మేం గెలిచాం కాబట్టే కృష్ణయ్య చైర్మన్ అయ్యార’’న్న బొండా ఉమ వ్యాఖ్యలు..
‘‘ పీసీబీకి సరిపడా సిబ్బంది లేరు. చర్యలు తీసుకోవాలంటే ఒక్క రాంకీపైనే కాదు. ఇంకా చాలా ఉన్నాయి. అలా కక్ష సాధింపు మా ఉద్దేశం కాదు. అలా చేస్తే వేలాది మంది ఉద్యోగులు రోడ్డునపడతార’’న్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలతో.. పీసీబీలో ఏం జరుగుతోందన్న విషయం ప్రపంచానికి తెలిసిపోయింది. పవన్ ప్రకటన ద్వారా.. వివిధ కారణాలతో పరిశ్రమలపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం లేదన్నది స్పష్టమయింది.
అనకాపల్లి, పరవాడ, అచ్యుతాపురం, కొండపల్లి పారిశ్రామికవాడల్లోని ఫార్మా, కెమికల్, పాలిమర్స్, ఇంజన్ ఆయిల్ రీసైక్లింగ్, టైర్స్ రీబూట్ కంపెనీలు ప్రమాదకరమైన విష వ్యర్ధాలను విడుదల చేస్తాయి. వాటిని శుద్ధి చేసి, నిర్మూలించాల్సిన ఆయా కంపెనీలకు ఆమేరకు చాలా ఖర్చవుతుంది. ఆ ఖర్చు మిగుల్చుకునేందుకు.. తమ ఉత్పత్తితో విడుదలయ్యే విష రసాయన వ్యర్ధాలను, నేరుగా అక్కడికి దూరంగా ఉన్న కాల్వలు (గెడ్డలు), పచ్చటి పొలాలు, కొండల్లో పారబోస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు కొండల వద్ద ఉన్న ఖాళీ భూమిని తవ్వి అక్కడ పాతిపెడుతున్నాయి. ఈ మధ్యలో ఎక్కడా తనిఖీలు ఉండవు. ఏ అర్ధరాత్రి వేళనో వీటిని పారబోస్తుంటాయి. ఇక భారీ వర్షాలొస్తే ఈ కంపెనీలకు పండగే. సమీపంలోని కాల్వల్లోనే వాటిని కలిపేస్తుంటాయి.
ఫలితంగా.. అక్కడి సాగు-తాగు నీరు కలుషితమయి, వాటిని తాగే మనుషులు రోగాల బారిన పడుతుండగా.. వందలాది పశువులు మృతి చెందుతున్న విషాదం విజయవంతంగా కొనసాగుతోంది. నీళ్లలో విష రసాయనాలు కలిసినందున, అవి ఉప్పు నీరుగా మారుతు, తాగడానికి పనికిరాకుండా పోతున్నాయి.
అన్నిటికీ మించి పచ్చటి పొలాలు బీడువారుతున్నాయి. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని కొండపల్లి పారిశ్రామిక ప్రాంతాన్నే ఉదాహరణగా తీసుకుంటే.. అక్కడి కంపెనీలు వ్యర్థ విష రసాయనాలను శుద్ధి చేయకుండా, నేరుగా డ్రైనేజీల ద్వారా.. జి. కొండూరు మండలంలోని తొమ్మండ్రు, గుర్రాలవాగులోకి కాల్వల్లో కలపడంతో పచ్చటి పొలాలు విష తుల్యమవుతున్నాయి.
ఫలితంగా కవులూరు, కట్టుబడివారిపాలెం గ్రామాల్లోని 1500 ఎకరాల ఆయకట్టులో ఏకంగా 800 ఎకరాలపైగా పొలాలు బీడుపడ్డాయంటే.. కంపెనీలు విడుదల చేసే విష వ్యర్థ రసాయన ప్రభావం, ఎంత ప్రమాదకరంగా ఉందో ఊహించుకోవచ్చు. ఒక్క కొండపల్లి మాత్రమే కాదు. కెమికల్ కంపెనీలు ఉన్న అన్ని చోట్లా ఇదే రైతు విషాద వ్యధ. దీనిపై స్థానిక రైతులు, రైతు సంఘాలు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకునే దిక్కుండదు. కారణం.. ‘మామూలే’!
కృష్ణానదికి ‘కాలుష్యహారతి’
జలహారతి పట్టే కృష్ణానది కూడా.. ఈ కంపెనీల దుర్మార్గానికి ‘కాలుష్య హారతి’ పట్టాల్సిన విషాదంపై, పీసీబీకి ఎలాంటి విచారమే లేదు. విచారణ అసలే లేదు. కొండపల్లిలోని కెమికల్ కంపెనీలు గత కొన్నేళ్ల నుంచీ చేస్తున్నది అదే. కానీ ఇప్పటిదాకా ఒక్క కంపెనీపైనా చర్యలు తీసుకునే దమ్ము కనిపించలేదు. కారణం ‘మామూలే’. అక్కడ రసాయన వ్యర్ధాలను చెరువుల్లో కలిపేస్తున్నారన్న విషయం స్థానిక రైతులు, మీడియాకు తెలిసినా పీసీబీకి మాత్రం తెలియకపోవడమే విచిత్రం.
కొండపల్లి రిజర్వు ఫారెస్టు నుంచి మొదలైన కవులూరు, తొమండ్రవాగు కట్టుబడివారిపాలెం వద్ద కలుషితమైన బుడమేరు డైవర్షన్ చానెల్ ద్వారా.. పవిత్ర సంగమం దగ్గర కృష్ణానదిలో కలుస్తుందనేది అందరికీ తెలిసినా, పీసీబీకి మాత్రం ఇంతవరకూ తెలియకపోవడమే వింత. ఈ విషయంలో పీసీబీని చూసి ధృతరాష్ర్టుడూ సిగ్గుపడాల్సిందే!
పవన్‌ను తప్పుదోవపట్టిస్తున్నారా?
కాకినాడ పోర్టును స్వయంగా తనిఖీ చేసి.. అక్కడ రవాణాకు సిద్ధంగా ఉన్న బియ్యం సరుకు ఉన్న షిప్‌ను చూపిస్తూ, ‘సీజ్ ద షిప్’ అన్న పవన్ కల్యాణ్‌కు.. అసెంబ్లీలో పీసీబీ తప్పు లేదని సమర్ధించిన పవన్ కల్యాణ్‌కూ చాలా తేడా ఉందన్న ఆశ్చర్యం, జనసైనికుల నుంచే వ్యక్తమవుతోంది.
ఎక్కడైనా ఎవరికైనా అన్యాయం జరిగిందని తెలిస్తే, అక్కడికి వెళ్లి వారికి నేనున్నానంటూ ధైర్యం చెప్పే పవన్ కల్యాణ్.. ప్రజల ప్రాణాలను హరిస్తున్న ఫార్మా, కెమికల్ కంపెనీలకు మద్దతుగా మాట్లాడటంపై జనసైనికులు ఆశ్చర్యపోతున్నారు.
‘‘గతంలో డజన్ల మంది కార్మికులు ఫార్మా, కెమికల్ కంపెనీలు విడుదల చేసిన విషవాయువు పీల్చి చనిపోయారు. పేలుళ్లు జరిగి మరెంతో మంది మరణించిన విషయాన్ని, పవన్ కల్యాణ్సారుకు అధికారులు చెప్పినట్లు లేరు. ఒకవేళ అలా చెప్పి ఉంటే పవన్ ఆవిధంగా పీసీబీని సమర్ధించేవారు కాదు. దీన్నిబట్టి ఆయన శాఖలో నిజాలు చెప్పేవారెవరూ లేనట్లు అర్ధమవుతోంద’’ని జనసేన నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఫార్మా, కెమికల్ కంపెనీల వ్యవహారంలో అధికారులు ఆయనను తప్పుదోవపట్టిస్తున్నారని, సభలో ఆయనతో ఇప్పించిన సమాధానమే చెబుతోందంటున్నారు. దాని వల్ల పవన్ కల్యాణ్‌కు, ప్రజల్లో ఉన్న ఇమేజ్ దెబ్బతినే ప్రమాదం ఉందని జనసైనికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పవన్ గతంలో కాకినాడ పోర్టులో ఆకస్మిక తనిఖీ చేసినట్లే.. ఫార్మా, కెమికల్ కంపెనీల్లోనూ ఆకస్మిక తనిఖీ చేస్తే, పీసీబీ ఏం చేస్తుందనేది అర్ధమవుతుందన్న సూచన వ్యక్తమవుతోంది. ప్రధానంగా ‘రాంకీ’లోకి వెళ్లేందుకు పీసీబీ అధికారులకు ధైర్యం లేనందున.. స్వయంగా పవన్ కల్యాణ్ ఆ పనిచేసి, రాంకీ కంపెనీ కెమికల్ వ్యర్ధాలను సముద్రంలోకి ఎలా విడుదల చేస్తుందో పరిశీలించాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇంతకూ తప్పు బొండాదా?.. పీసీబీదా?
అసెంబ్లీలో పీసీబీ వైఫల్యాన్ని ఎండగట్టిన విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు.. ఆయనకు కౌంటర్ ఇస్తూ పీసీబీని వెనకేసుకొచ్చిన, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమాధానం తర్వాత.. అసలు తప్పెవరిది? నిజాలు చెప్పిన ఎమ్మెల్యే బొండాదా?.. పీసీబీకి సరిపడా సిబ్బంది లేరు. కంపెనీలపై చర్య తీసుకోలేమని నిజాయితీగా చెప్పిన పవన్ కల్యాణ్దా? అన్నదే ఇప్పుడు చర్చ!
నిజానికి తొలుత క్రెబ్స్ కంపెనీపై పీసీబీకి ఫిర్యాదు చేసిన బొండా, ఆయన తనయుడితో కలసి హైకోర్టులో కేసువేశారు. ఆ తర్వాత మళ్లీ అదే బొండా తాను ఫిర్యాదు చేసిన క్రెబ్స్‌పై చర్యలు తీసుకోవద్దని, తమపై ఒత్తిడి చేస్తున్నట్లు పీసీబీ చైర్మన్ పి.కృష్ణయ్య డిప్యూటీ సీఎంపవన్ కల్యాణ్‌కు వెల్లడించారు.
దానితో ఒక ప్రభుత్వ ప్రకటన వెలువడింది.- ఎమ్మెల్యే బొండా వైఖరి బెదిరించేలా ఉంది. క్రెబ్స్‌పై ఫిర్యాదు చేసిన ఆయనే మళ్లీ వద్దనడం సరైన పద్ధతి కాదు. దీనిని సీఎం దృష్టికి తీసుకువెళ్లాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇది ఎవరు లీక్ చేశారన్నదే ప్రశ్న. సమీక్ష నిర్వహించింది డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చాంబరులో కాబట్టి, ఆ శాఖ అధికారులే దానిని మీడియాకు లీక్ చేసి తీరాలి.
ఇలాంటి లీకులు సహజమే అయినప్పటికీ.. అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన బొండా ఉమను దోషిగా చూపిస్తూ, మీడియాకు లీకు వార్తలు ఇవ్వడంపై, టీడీపీ వర్గాలు ఆగ్రహంతో రగిలిపోతున్నాయి. ఇది ఎమ్మెల్యేను ప్రజల దృష్టిలో ముద్దాయిగా నిలబెట్టడమేనంటున్నారు. ఈ పరిణామం బొండాను బలిపశువును చేసిందన్న అభిప్రాయం టీడీపీ ఎమ్మెల్యేలలోనూ వ్యక్తమవుతోంది.
‘‘ చాలామంది ఎమ్మెల్యేలు చేసేదే బొండా ఉమ చేశారు. రాజకీయాల్లో ఇవన్నీ సహజం. కానీ దాన్నేదో నేరంగా చూపించి ఎమ్మెల్యేను దోషిగా చిత్రీకరించేలా మీడియాకు లీకులివ్వడం సరైనది కాదు. అలాగైతే మా దగ్గర జనసేన ఎమ్మెల్యేలు చేసే వాటిని, మేం కూడా మీడియాకు లీకులివ్వవచ్చు. విశాఖ జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు సెజ్ నుంచి వచ్చే లారీలకు ఎంత వసూళ్లు చేస్తున్నారో మేం కూడా లీకులు ఇవ్వగలం.
తంలో దానిపై ఫిర్యాదులు కూడా వెళ్లాయి. గోదావరి జిల్లాల్లో ఇసుక నుంచి ఎంత వసూలు చేస్తున్నారో మేమూ లీకు ఇవ్వగలం. కానీ అలా చేయడం కూటమి ధర్మం కాదు కదా? అసలు ఈ లీకు పవన్ కల్యాణ్ పేషీ నుంచి వచ్చిందా? లేక పీసీబీ నుంచి వచ్చిందా అన్నది చూడాలి. ఎవరు చేసినా ఒక ప్రజాప్రతినిధిని జనం ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నాన్ని మాత్రం ఖండించాల్సిందే’’నని టీడీపీ సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు.