– కేవలం 2400 కోట్లు వాయిదా పద్ధతిలో చెల్లిస్తే చాలట
– పెద్ద మనసు ప్రదర్శించిన జాతీయ కంపెనీల అప్పిలేట్ ట్రైబ్యునల్
– ‘పేదరెడి’్డకి ఆ 2400 కోట్లూ మాఫీ చేయాలంటున్న నెటిజన్లు
– నిరుపేదరెడ్డి అంత డబ్బు ఎక్కడనుంచి తెస్తాడంటూ ఆగ్రహం
– ‘దేవీ ఉపాసకుడిని’ ఆమాత్రం కరుణించలేరా అంటూ కరుణ రసాత్మక ప్రశ్నలు
(సుబ్బు)
దేశంలోనే అత్యంత నిరుపేద అయిన తిక్కవరపు సుబ్బరామిరెడ్డిని మూడునెలల్లో 750 కోట్లు కట్టమని.. కెనరా బ్యాంకు కేసులో జాతీయ కంపెనీల అప్పిలేట్ ట్రైబ్యునల్ ఆదేశించడం, దేశంలోని సున్నిత మనస్కులయిన నెటిజన్లకు ఆగ్రహం కలిగించింది. ఒక ‘పేదరెడ్డి’.. ఏరోజు బియ్యం ఆరోజు తెచ్చుకుని బతికే కడుపేద రెడ్డిగారు, అన్ని వందల కోట్లు ఎక్కడ నుంచి తెస్తారు? ఎలా తెస్తారు? ఆ మాత్రం జాలి దయ కూడా లేదా? అంటూ నెటిజన్లు సోషల్‌మీడియాలో ప్రశ్నల వర్షం కురిపిస్తూ, వైజాగ్ రెడ్డిగారికి బాసటగా నిలుస్తున్న వైనం ఇది.
అసలేం జరిగిందంటే.. సుబ్బరామిరెడ్డికి చెందిన గాయత్రి ప్రాజెక్ట్స్ కెరా బ్యాంకుకు 7500 కోట్ల రూపాయలు చెల్లించాలి. ఎందుకంటే ఆ బ్యాంకు నుంచి రుణం తీసుకుంది కాబట్టి! దానితో నిరుపేద అయిన ఆయన కంపెనీ, జాతీయ కంపెనీల అప్పిలేట్ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించి.. ఆ అప్పును రద్దు చేయాలని, తాము అంత డబ్బు చెల్లించలేని కడుపేదలమని ఆర్తిగా ఆవేదనతో అభ్యర్ధించింది.
దానితో కేసును విచారించిన ట్రైబ్యునల్ కూడా.. పేదరెడ్డి కంపెనీపై విశాల హృదయం ప్రదర్శించి, అంత మొత్తాన్ని రద్దు చేయాలని తీర్పు ఇచ్చింది. నిజానికి ఇది మొత్తం అప్పుల్లో 70 శాతం! మిగిలిన 30 శాతం.. అంటే 2400 కోట్ల రూపాయలను వాయిదాల పద్ధతిలో చెల్లించాలని, ఆ మేరకు మూడు నెలల్లో 750 కోట్లు కట్టాలని ఆదేశించింది.
‘‘దేవీ ఉపాసకుడ యిన కడుపేద సుబ్బరామిరెడ్డిగారిని మరీ ఎక్కువ ఇబ్బంది పెట్టడం భావ్యం కాదు. కనీస మానవ త్వం లేకుండా అలా ఎలా తీర్పు ఇస్తారు? కెనరా బ్యాంకు ఆ 2400 కోట్ల విషయంలో కూడా ఉదారంగా వ్యవహరించాలి. కొంచెం మానవత్వం చూపాలి. అన్నేసి కోట్ల రూపాయలు నిరుపేదరెడ్డిగారి కంపెనీ ఎలా చెల్లిస్తుంది? ఎక్కడ నుంచి తెస్తుంది.. మరీ అన్యాయం కాకపోతే! ఇది మానవత్వం ప్రదర్శించాల్సిన సమయం’’ అంటూ నెటిజన్లు హృదయ విదారక వదనాలతో, ఆర్తిగా-ఆవేదనతో ట్రైబ్యునల్‌కు ముకుళిత హస్తాలు జోడించి మరీ అభ్యర్ధిస్తున్నారు.
నిజమే.. ఏ రోజు బియ్యం ఆరోజు తెచ్చుకుని జీవితం గడుపుతున్న సగటు నిరుపేద రెడ్డిగారి పట్ల, ట్రైబ్యునల్ ఆమాత్రం మానవత్వం చూపాల్సిందే! కాకపోతే.. ఇలాంటి మానవత్వం కమ్ విశాలహృదయాన్ని, లక్షరూపాయలు అప్పు తీసుకున్న రైతులు.. పది లక్షల అప్పు తీసుకునే సాధారణ ప్రజలు.. రుణం తీసుకునే చిన్నా చితకా పరిశ్రమల పట్ల కూడా ప్రదర్శిస్తే బహు బాగుంటుందేమో?!