-కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రికి మొదటి పోస్ట్ కార్డు రాసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
-రెండో పోస్ట్ కార్డు రాసి పంపిన నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
-ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేయండి
-ఉపాధి హామీ పని దినాలను పెంచండి
-కూలీలకు కనీస వేతనం అందేలా చూడండి
-ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయవద్దు
-ఉపాధి హామీ రద్దుకు కేంద్రం కుట్ర
-గత ఏడాది 30 వేల కోట్లు, గడిచిన రెండేళ్లలో రూ.55 వేల కోట్ల నిధుల కోత
-నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలం మహమ్మదాపురం గ్రామంలో మొత్తం 5కోట్ల 62 లక్షల రూపాయల విలువైన పనులకు మంత్రి శంకుస్థాపనలు చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
-అదనంగా సీసీ రోడ్ల కు రూ.50 లక్షలు మంజూరు
ఉపాధి హామీ పథకం పై పోస్టు కార్డుల ఉద్యమాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలం మహమ్మదాపురం నుంచి ప్రారంభించారు. మొదటి పోస్ట్ కార్డు ని కేంద్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రికి పంపించారు రెండో పోస్ట్ కార్డు ని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పంపించారు. ఈ సందర్భంగా ఆ పోస్ట్ కార్డు పై ఈ విధంగా రాశారు. ‘‘ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయాలని కేంద్రం చూస్తోంది. గత ఏడాది 30 వేల కోట్ల బడ్జెట్ కోత విధించారు. దీంతో ఉపాధి కూలీలకు పని దినాలు తగ్గాయి. వ్యవసాయ కూలికి రోజుకు 257 రూపాయలు ఇవ్వాలని చట్టం ఉన్నప్పటికీ, ఒక్కో కూలికి వంద రూపాయలకు మించడం లేదు. పని ప్రదేశాల్లో కనీస మౌలిక సదుపాయాలు టెంటు, మంచినీరు, గడ్డపారలు, పారలు, తట్టలు వంటివి అందించడం లేదు.
కనీస వేతన చట్ట ప్రకారం 8 గంటలు పని చేసిన కూలికి 480 రూపాయలు ఇవ్వాలని ఉన్నప్పటికీ, ఉపాధి హామీ కూలీలకు మాత్రం కనీస కూలీ గిట్టడం లేదు. ఆన్లైన్ పద్ధతి వల్ల గ్రామీణ అటవీ ప్రాంతాల్లోని ప్రజలకు సెల్ఫోన్ సిగ్నల్స్ లేకపోవడం వల్ల ఉదయం 10 గంటలకు, సాయంత్రం 4 గంటలకు కంప్యూటర్ లో అప్లోడ్ చేయాలనే నిబంధనలు పాటించలేకపోతున్నారు. దీంతో కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వ్యవసాయానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేశారు. సన్న చిన్న కారు రైతులు ఎక్కువగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో కూలీలు గా వారే ఉంటున్నారు. కాబట్టి వ్యవసాయం అనుసంధానం చేయటం వల్ల రైతులకు కూలి గిట్టుబాటు అవుతుంది. ప్రతి ఎకరాకు నిర్ణీత టోకెన్లు, కనీసం 100 పనిదినాలు కల్పించాలి. అలాగే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలి. ఫీల్డ్ అసిస్టెంట్లు మొదలు ఏ పి ఓ ల వరకు ఉపాధి ఉద్యోగులందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి’’ అని ఆ పోస్టు కార్డులో రాశారు.
మహ్మదా పురం గ్రామంలో మొత్తం 5కోట్ల 62 లక్షల రూపాయల విలువైన పనులకు ఎమ్మెల్యే తో కలిసి మంత్రి శంకుస్థాపనలు
అనంతరం వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలం మహ్మదా పురం గ్రామంలో మొత్తం 5కోట్ల 62 లక్షల రూపాయల విలువైన పనులకు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తో కలిసి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శంకుస్థాపనలు చేశారు. 4 కోట్ల 41 లక్షల విలువైన వెంకటాపురం నుండి మహ్మదా పురం మీదుగా రాజేశ్వర రావు పల్లె వరకు 6.30 కి. మీ. పొడవైన బిటి రోడ్డు నిర్మాణానికి, రూ.70 లక్షలతో గ్రామంలో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. గ్రామంలో అయా పథకాల వారీగా అందిన అభివృద్ధి, సంక్షేమ పథకాల వివరాలను మంత్రి గ్రామ ప్రజలకు వివరించారు. ఈ సంధర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ, ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర కు కేంద్ర ప్రభుత్వం తెర లేపిందని అన్నారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో రద్దు పరచింది అన్నారు. అర్థం లేని ఆంక్షలతో వేధిస్తున్నద ని చెప్పారు.
సీఎం కేసీఆర్ మనసున్న మహారాజు అని, అందుకే ఆయన అనేక మానవత్వమున్న పథకాలను అమలు చేస్తున్నారని, ప్రజల సర్వతో ముఖభివృద్ధికి పాటు పడుతున్నారని మంత్రి తెలిపారు. ఆయా పథకాలను వివరిస్తూ, దేశంలో ఎక్కడైనా ఉన్నాయా? అని ప్రజలను అడిగారు. ప్రజలను కన్న బిడ్డల్లా చూస్తున్న కెసిఆర్ కోసం దేశం యావత్తు ఎదురు చూస్తున్నది, అబ్ కి బార్ కిసాన్ సర్కార్ అని అన్నారు. అందుకే సీఎం కెసిఆర్ ను, తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బందుల పాలు చేయడానికే కేంద్రం, బీజేపీ కుట్రలు చేస్తున్నాద ని చెప్పారు. ప్రజల సహకారంతో సీఎం వాటిని ఛేదిస్తూ వస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.