Suryaa.co.in

Andhra Pradesh

సంక్రాంతి నాటికి పాత్ హోల్ ఫ్రీ రోడ్లే లక్ష్యంగా పనులు

– రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి

విజయవాడ: ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సంక్రాంతి నాటికి పాత్ హోల్ ఫ్రీ రోడ్లే లక్ష్యంగా మరింత ముమ్మరంగా మరమ్మతు పనులను పూర్తి చేయాలని ఆర్ & బీ శాఖ అధికారులకు రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలోని ఆర్ & బీ శాఖ మంత్రి కార్యాలయంలో మంత్రి ఆధ్వర్యంలో ఆ శాఖ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రోడ్ల మరమ్మత్తులకు సంబంధించి యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయడానికి ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగాలని అధికారులకు మంత్రి సూచించారు. అలాగే రోడ్ల మరమ్మతులకు సంబంధించి ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి నుంచి అందుతున్న రోజువారి ప్రగతి వివరాలపై ఈ సందర్భంగా మంత్రి ఆరా తీశారు.

రాష్ట్రంలోని మొత్తం 45,378 కి.మీ మేర రాష్ట్ర మరియు జిల్లా ప్రధాన రోడ్లు ఉండగా, అందులో 22,798 కి.మీ రోడ్లు దెబ్బతిన్నాయన్నారు. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం 9,484 కి.మీ మేర గుంతల మరమ్మతులకు రూ. రూ. 283 కోట్ల నిధులతో 1658 పనులకు ఆమోదం తెలిపి, ఇప్పటికే టెండర్లకు ఆహ్వనించడం జరిగిందన్నారు. ఇందులో 1547 పనులకు ఇప్పటికే టెండర్లు రాగా, మిగిలిన పనులకు సంబంధించి ఇంకా టెండర్ల ప్రక్రియ కొనసాగుతోందన్నారు.

అదే సమయంలో 1408 పనులకు సంబంధించి పనులు పూర్తి చేయడానికి కాంట్రాక్టర్లు ఇప్పటికే సమ్మతి తెలపగా, 925 పనులు చేయడానికి ఒప్పందాలు చేసుకోవడం జరిగిందన్నారు.. దెబ్బతిన్న మొత్తం రోడ్లు 9484 కి.మీ కాగా, 506 పనులు ఇప్పటికే ప్రారంభం కావడంతో పాటు, దాదాపు 563 కి.మీ రోడ్లకు గుంతలు పూడ్చడం పనులు జరుగుతున్నాయన్నారు.

గుంతల రోడ్ల మరమ్మతుల పనులను ఇప్పటికే అన్ని డివిజన్లలలోనూ ప్రారంభించామని, ఇంకా ఏదైనా డివిజన్లలో ఎక్కడైనా పనులు ప్రారంభించకుంటే, తక్షణమే అక్కడ పనులు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. రాష్ట్రంలో కొన్ని చోట్ల కురుస్తోన్న వర్షాల వల్ల పనుల జరగడంలో కొంత జాప్యం జరుగుతోందని అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.

వర్షాలు తగ్గిన వెంటనే ఆయా డివిజన్లలో త్వరితగతిన పనులు మొదలు పెట్టాలని మంత్రి సూచించారు. అదే సమయంలో రోడ్ల పనులు పూర్తైన తర్వాత రోడ్ల వారీగా గుంతలు రహిత సర్టిఫికేట్ లను క్షేత్ర స్థాయి సిబ్బంది ఉన్నతాధికారులకు సమర్పించాలన్నారు. అలాగే రోజు వారీ రోడ్ల పనుల ప్రగతికి సంబంధించి అనునిత్యం అప్ డేట్స్ అందిస్తూ.. ఎక్కడైనా లోపాలుంటే తక్షణమే సరిదిద్ధాలని అధికారులను ఆదేశించారు.

రోడ్ల మరమ్మత్తుల పనులకు సంబంధించి ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందని, కాబట్టి అధికారులు అందుకు అనుగుణంగా పనులను అనునిత్యం పర్యవేక్షించాలన్నారు.. అదే సమయంలో రోడ్ల మరమ్మతులకు సంబంధించి చేసిన పనులు నాణ్యతలో రాజీ పడకుండా చూడాల్సిన బాధ్యత కూడా అధికారులపై ఉందన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఆర్ & బీ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, ఈ ఎన్ సీ నయిముల్లా, ఎస్ హెచ్ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE