– అర్హత లేని అసెంబ్లీ సెక్రెటరీ ప్రసన్న ని తొలగించాలి
– అసెంబ్లీ పరిపాలనా వ్యవహారాలలో ఎలాంటి అనుభవం లేకపోయినా ఆయనను అసెంబ్లీ సెక్రెటరీ జనరల్ నియమించడం నిబందనలకు విరుద్దం
– సెక్షన్ ఆఫీసర్ కంటే తక్కువ స్థాయి కలిగిన సాధారణ ఉద్యోగికి ఏ ప్రాతిపదికన ఐఏఎస్ హోదా కల్పించారు?
– ప్రసన్నకుమార్ లా డిగ్రీ పాసయ్యారనే స్పష్టత లేదు
– దీని గురించి కొందరు సమాచార హక్కు చట్టం కింద అడిగినా సమాధానం ఇవ్వలేదు
– యస్.వో కంటే తక్కువ స్థాయి వ్యక్తిని తీసుకువచ్చి సెక్రెటరీ జనరల్ గా నియమించడం అసెంబ్లీలోని సీనియర్ ఉద్యోగులను అవమానించడమే
– సెక్షన్ ఆఫీసర్ కంటే తక్కువ స్థాయి హోదా కలిగిన వ్యక్తికి చీఫ్ సెక్రెటరీ కంటే ఎక్కువ జీతం ఇవ్వడం ఏ రకంగా సమర్థనీయం?
– మంచి పని వాతావరణం కల్పించకుండా ఉద్యోగులను వేదిస్తున్నారు
– ప్రసన్న కుమార్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తి
– ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి లేఖ
అమరావతి: అర్హత లేకపోయినా అడ్డదారిలో ఏపీ అసెంబ్లీ సెక్రటరీ జనరల్ పదవి పొందిన సూర్యదేవర ప్రసన్న కుమార్‌ను తక్షణం ఆ పదవి నుంచి తప్పించి, అసెంబ్లీలోని సీనియర్ ఉద్యోగులకు ఆ పదవి ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామి రెడ్డి డిమాండ్ చేశారు. తనకు అడ్డు వస్తారన్న భయంతో ప్రమోషన్లు తొక్కిపెట్టిన ప్రసన్న, తనకంటే సీనియర్లను వేధిస్తున్నారని ఆరోపించారు.
సెక్షన్ ఆఫీసర్ కంటే తక్కువ స్థాయి గల ఉద్యోగికి, ఐఏఎస్ హోదా ఇవ్వడం అసెంబ్లీ ఉద్యోగులను అవమానించడమేనన్నారు. అసెంబ్లీ సర్వీసులేని ప్రసన్నకుమార్‌కు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కంటే ఎక్కువ వేతనం ఇవ్వడంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. ఏమాత్రం అసెంబ్లీ సర్వీసు లేని ప్రసన్నకుమార్‌ను తక్షణం తొలగించాలని కోరారు. ఆ మేరకు వెంకట్రామిరెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌కు లేఖ రాశారు.
వెంకట్రామిరెడ్డి లేఖ పూర్తి పాఠమిదీ.. ప్రభుత్వం జి.ఓ. ఆర్. టి నెంబర్ 288, తేది: 15.07.2024 ద్వారా ఆల్ ఇండియా రేడియోలో న్యూస్ రీడర్-కమ్-ట్రాన్స్‌లేటర్‌గా విధులు నిర్వహించి స్వచ్ఛంద విరమణ పొందిన సూర్యదేవర ప్రసన్న కుమార్‌ని ఆంధ్రప్రదేశ్ శాసనసభ కార్యదర్శిత్వంలో సెక్రటరీ జనరల్‌గా నియమించింది. ఈ నియామకానికి సంబంధించి అనేక అంశాల్లో నిబందనల ఉల్లంఘన జరిగింది.
G.O.Ms.No.10, Legislative (O.P.I) Department, తేదీ 19.03.2023 ప్రకారం, సెక్రటరీ జనరల్ పదవిని లోక్‌సభ సెక్రటరీ జనరల్ గా కానీ, రాజ్యసభ సెక్రటరీ జనరల్ గా కానీ లేదా ఏదైనా రాష్ట్ర శాసనసభ సెక్రటరీ జనరల్ గా పని చేసిన వ్యక్తులను మాత్రమే నియమించాలి. కానీ ప్రభుత్వం నియమించిన ప్రసన్న కుమార్ కి ఇవేమి లేవు.
అసెంబ్లీ సెక్రెటరీ జనరల్ గా నియమింపబడే వారికి అసెంబ్లీ పరిపాలనా వ్యవహారాల్లో అనుభవం ఉండాలని స్పష్టంగా పేర్కోవడం జరిగింది. ప్రసన్న కుమార్ కి అసెంబ్లీ పరిపాలనా వ్యవహారాలలో ఎలాంటి అనుభవం లేకపోయినా, ఆయనను అసెంబ్లీ సెక్రెటరీ జనరల్ నియమించడం నిబందనలకు విరుద్దం.
అసెంబ్లీ సర్వీసు నిబందనల ప్రకారం అసెంబ్లీలో ఉప కార్యదర్శి ఆ పై పోస్టుల్లో నియమింపబడే వ్యక్తులు తప్పనిసరిగా లా డిగ్రీ కలిగి ఉండాలి. ఇపుడు నియమింపబడిన ప్రసన్నకుమార్ లా డిగ్రీ పాసయ్యారనే స్పష్టత లేదు. దీని గురించి కొందరు సమాచార హక్కు చట్టం కింద అడిగినా సమాధానం ఇవ్వలేదు.
ప్రసన్నకుమార్ ప్రసారభారతిలో న్యూస్ రీడర్ కమ్ ట్రాన్స్‌లేటర్ గా పని చేశారు. మన అసెంబ్లీలో ట్రాన్సలేటర్ అనే పోస్టు సెక్షన్ ఆపీసర్ కంటే తక్కువ పోస్టు. యస్.వో కంటే తక్కువ స్థాయి వ్యక్తిని తీసుకువచ్చి, అసెంబ్లీ ఉద్యోగులందరికీ పెద్దగా సెక్రెటరీ జనరల్ గా నియమించడం అసెంబ్లీలోని సీనియర్ ఉద్యోగులను అవమానించడమే.
ప్రభుత్వం ప్రసన్న కుమార్ ని సెక్రెటరీ జనరల్ గా నియమిస్తూ జారీ చేసిన ఉత్తర్వులలో ఆయనను సుప్రీంకోర్టు మాజీ రిజిస్ట్రార్ గా పేర్కొన్నారు. అది తప్పు. రిజిస్ట్రార్ గా సుప్రీమ్ కోర్టు ఆయన నియామకం రద్దు చేసినట్లు మీడియాలో ప్రముఖంగా వార్తలు వచ్చాయి. ఆయన సుప్రీంకోర్టు లో కేవలం డిప్యూటేషన్ పై కొంతకాలం పనిచేసినట్లు ప్రసారభారతి కూడా స్పష్టంగా పేర్కొంది. దీనిని బట్టి ప్రభుత్వం ఆయన సర్వీసు వివరాలు పరిశీలించకుండా కేవలం ఆయన ఇచ్చిన బయోడేటా ఆధారంగానే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు అర్థం అవుతోంది. ప్రసన్న కుమార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి కూడా కాదు. ఆయన తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అని సమాచారం.
Fundamental Rule 110 ప్రకారం, రిటైర్డ్ ఉద్యోగిని పునర్నియమించిన సందర్భంలో చెల్లించే వేతనం, చివరిగా పొందిన మొత్తం వేతనం నుండి పింఛను తగ్గించిన తర్వాత మిగిలిన మొత్తానికి మించరాదు. కానీ నిబందనలకు విరుద్ధంగా ప్రసన్న కుమార్ కి ప్రస్తుతం నెలకు మొత్తం ₹4,90,000 చెల్లిస్తున్నారు. ఇది రాష్ట్ర ఉద్యోగులందరికీ అధిపతి అయిన చీఫ్ సెక్రెటరీ నెల జీతం కంటే చాలా ఎక్కువ. సెక్షన్ ఆఫీసర్ కంటే తక్కువ స్థాయి హోదా కలిగిన వ్యక్తికి చీఫ్ సెక్రెటరీ కంటే ఎక్కువ జీతం ఇవ్వడం ఏ రకంగా సమర్థనీయం?
ప్రసన్న కుమార్ కి చీఫ్ సెక్రెటరీ హోదా కల్పిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సీనియర్ ఐఏఎస్ లకు, కేంద్రప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీ హోదాలో పని చేసిన వారికి మాత్రమే హోదా ఇస్తారు. కానీ సెక్షన్ ఆఫీసర్ కంటే తక్కువ స్థాయి కలిగిన సాధారణ ఉద్యోగికి ఏ ప్రాతిపదికన ఐఏఎస్ హోదా కల్పించారు?
ఇన్ని రకాలుగా నిబందనలు అతిక్రమించి పదవి పొందిన ప్రసన్న కుమార్ అసెంబ్లీ ఉద్యోగులను సమన్వయం చేసుకుని మంచి పని వాతావరణం కల్పించకుండా ఉద్యోగులను వేదిస్తున్నారు. తన కంటే సీనియర్ అధికారులను చిన్న చూపు చూస్తూ వారికి ఇవ్వాల్సిన ప్రమోషన్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. అసెంబ్లీ ఉద్యోగులకు ప్రమోషన్లు ఇస్తే తన పదవి ఊడిపోతుందేమో అనే భయంతో, అసెంబ్లీ ఉద్యోగులకి ప్రమోషన్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. అసెంబ్లీలో 10 SO పోస్టులు, 4 AS పోస్టులు ఒక అడిషనల్ సెక్రెటరీ, ఒక సెక్రెటరీ పోస్టు చాలా కాలంగా ఖాళీగా ఉన్నప్పటికీ ప్రమోషన్లు ఇవ్వకుండా ఉద్యోగులను వేదిస్తున్నారు.
అసెంబ్లీలో సీనియర్ అధికారి సెక్రెటరీగా ప్రమోషన్ పొందాల్సిన విజయరాజు ని చిన్న అంశం మీద సస్పెండ్ చేశారు. తర్వాత పెండింగ్ ఎంక్వైరీ పై తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. విధుల్లోకి తీసుకుని సంవత్సరం దాటినా, ఇంతవరకు విచారణ అధికారిని నియమించకుండా ప్రమోషన్ అడ్డుకోవడానికి కావాలనే విచారణ ఆలస్యం చేస్తున్నారు.
పై విషయాలు పరిశీలించిన మీదట అర్థమయ్యేది ఏమిటంటే ప్రసన్న కుమార్ కి అసెంబ్లీ సెక్రెటరీ జనరల్ గా నియమించడానికి అవసరమయిన పదవి అర్హత లేదు, విద్యార్హత లేదు, శాసన వ్యవహారాల పాలనా అనుభవం లేదు. పైగా ఆయన అసెంబ్లీ ఉద్యోగులను వేధింపులకు గురి చేస్తున్నారు.
పై విషయాలను దృష్టిలో ఉంచుకొని, అర్హత లేని సెక్రెటరీ జనరల్ ను తొలగించి అర్హులు, సీనియర్లు, పరిపాలనా అనుభవం కలిగిన అసెంబ్లీ ఉద్యోగులకు, సెక్రెటరీ ప్రమోషన్ కల్పించి న్యాయం చేయవలసిందిగా గౌరవ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారిని కోరుతున్నాము. ప్రధాన కార్యదర్శి గారు అసెంబ్లీ ఉద్యోగులకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాము.