-టిటిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన, సూర్యదేవర లత ఆగ్రహం
కాట్రగడ్డ ప్రసూన, రాష్ట్ర పార్టీ ఉపాధ్యకక్షురాలు :
నేటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను చూస్తే ఏ ప్రజాస్వామ్యంలో ఉన్నాం.. మోడీ గానీ, కేసీఆర్ గానీ దేశాన్ని, రాష్ట్రాన్ని ఏవైపుకు తీసుకెళ్తున్నారనే బాధ కలుగుతుంది. వంట గ్యాస్ ధర సామాన్యుని నడ్డి విరిచేలా ఉంది. చాలీ చాలని ఆదాయంతో, బడ్జెట్‌తో జీవితాలను కొనసాగించే సామాన్యులకు గ్యాస్ ధర పెరుగుదలతో కట్టెల పొయ్యే దిక్కు అన్నట్లుగా ఉంది. రూ.410 నుంచి రూ.1100 వరకు గ్యాస్ ధరను పెంచుకుంటూ వచ్చారు. ఇటీవలె గ్యాస్ ధర రూ.50 పెరిగింది. మూడు సంవత్సరాల కాల వ్యవధిలో గ్యాస్ ధర 170 శాతం దేశంలో పెరిగింది. ఇలా ప్రపచంలో ఎక్కడా జరగలేదు. రూ.410 నుంచి రూ.1100 పెరుగుదలను శాతంలో గనుక చూస్తే గుండె గుబేలుమంటుంది.
కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ధర్నాలు చేయడం ఏమిటి? రాష్ట్ర ప్రభుత్వ నాయకులకు దమ్ముంటే ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద గానీ, ప్రధాని ఇంటి వద్ద గానీ ధర్నాలు చేసి ధరలు తగ్గించాలి. లా అండ్ ఆర్డర్‌ను నియంత్రణ చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వ నాయకులు రాష్ట్రంలో ధర్నాలు చేయడం ఎంత వరకు సబబో ఆలోచించుకోవాలి. ప్రతిపక్షాలు ధర్నాలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం నాయకులతోపాటు ప్రతిపక్షాలమైన మేము ఢిల్లీకి వస్తాం.. అక్కడ ధర్నాలు చేసి ధరలు తగ్గే వరకు కష్టపడదాం.
నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో శిరీషా అనే వీఆర్‌ఏ ఇసుక మాఫియాపై రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చినందుకు టీఆర్‌ఎస్ కార్యకర్త ఆమెను చీరలాగి, జుట్టు పట్టి దాడి చేసి ట్రాక్టర్‌తో తొక్కించి చంపేస్తానని బెదిరించడం చూస్తే రాష్ట్రం ఎటువైపు వెళ్తున్నది? ఈ సంఘటనకు బాధ్యులైన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
ద్రవ్యోల్భణం పెరిగి రూపాయి విలువ పతనమై ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశాలు భవిష్యత్‌లో ఉన్నాయని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, ప్రజలపై భారం పడకుండా, వెంటనే తగు చర్యలను తీసుకోవాలి.
అజ్మీరా రాజునాయక్, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి :
రాష్ట్ర ప్రభుత్వం పోడు భూముల సమాచారాన్ని సేకరించి పట్టాలు ఇస్తామని చెప్పారు. కానీ రైతులు సాగుచేసుకుంటున్న పోడు భూములలో జేసీపీలను తీసుకెళ్లి గిరిజన జీవితాలను అతలాకుతలం చేస్తున్నారు. 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం ప్రతి గిరిజన కుటుంబానికి 10 ఎకరాల భూమి ఇవ్వాల్సి ఉంటుంది. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం అయిన ఆగష్టు 9వ తేదీలోపు పోడు భూములను సాగు చేసుకుంటున్న గిరిజన రైతులందరికీ ప్రభుత్వం హక్కు పత్రాలను ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులలో ఈ హక్కుల పంపిణీని ప్రభుత్వం ప్రారంభించాలి.