– కార్యకర్తలకు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్రావు
– ఘట్ కేసర్ లోని ఔషాపూర్ లో బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి కార్యశాల
– స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడానికి చేపట్టవలసిన కార్యక్రమాలను గురించి దిశానిర్దేశం చేసిన బిజెపి రథసారధి ఎన్.రాంచందర్ రావు
ఘట్ కేసర్: తెలంగాణ రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ మాదిరిగానే, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే అవినీతి, ప్రజావ్యతిరేక పాలనను కొనసాగిస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను నల్లగొండ, సూర్యాపేట, కోదాడ ప్రాంతాల్లో నా మొట్టమొదటి పర్యటన చేశాను. ఈ పర్యటనలో వివిధ వర్గాల ప్రజలను కలిశాను. గ్రామాల్లో బీజేపీ బలం పెరుగుతోంది. తెలంగాణలో కూడా ప్రజలు బిజెపి ప్రభుత్వం రావాలని కోరుతున్నారు.
గతంలో భారతీయ జనతా పార్టీకి ఒక్క ఎమ్మెల్యే, నలుగురు ఎంపీలు మాత్రమే ఉండగా, ఇప్పుడు ఏడుగురు ఎమ్మెల్యేలు, ఎనిమిది మంది ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్సీలు ఉన్నారు. ప్రతి ఎన్నికలో బిజెపి ఓటుశాతం, ప్రాతినిధ్యం స్థిరంగా పెరుగుతోంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి గెలిచేలా విజయసంకల్పంతో ముందుకు సాగాలి.
కార్యకర్తలు కదలాలి, నాయకులు ముందుకు రావాలి, అందరం కలిసిమెలిసి ముందుకు నడవాలి. బిజెపిని గెలిపించాలనే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, బిజెపి నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు అందులో 10 శాతం మతపరమైన రిజర్వేషన్లను కలుపాలని చూస్తోంది. ఇది బీసీలకు వ్యతిరేకమైన చర్య. మతపరమైన కారణాల వల్లే ఆనాడు భారతదేశ విభజన జరిగింది.
విద్య, ఉద్యోగాల్లో మతపరమైన 4 శాతం రిజర్వేషన్లను బిజెపి గతంలోనే వ్యతిరేకించింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయం కోసం ఇప్పుడు రాజకీయాల్లోనూ అదే విధానాన్ని కొనసాగిస్తోంది. రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజా ఉద్యమాలు నిర్వహించాలి.
ప్రజల కోసం పోరాటం చేయాలి.
ఒక్క ప్రాంతానికి పరిమితమవకుండా, యావత్ తెలంగాణ వ్యాప్తంగా బిజెపి ఓటుశాతం పెరుగుతోంది. ఇది మరింత పెరిగేలా బలమైన విశ్వాసంతో మనమంతా ముందుకు సాగాలి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు భవిష్యత్తులో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి గెలిచేలా కృషి చేయాలి.