– ట్రాన్స్కో ఉన్నత అధికారుల సమీక్ష సమావేశంలో వెల్లడించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు రాబోయే ఏడు సంవత్సరాలకు కావలసిన విద్యుత్తును సరఫరా చేయడానికి కావలసిన ప్రణాళికలను రూపొందించుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులకు నిర్దేశం చేశారు.
సోమవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ట్రాన్స్కో సంస్థను బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి ఉన్నత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం 15,700 మెగావాట్ల విద్యుత్తు పీక్ డిమాండ్ ఉన్నదని, రాబోయే ఏడు సంవత్సరాలకు 27వేల మెగా వాట్లకు పీక్ డిమాండ్ పెరిగే అవకాశం ఉన్నందున, ఆ అంచనాకు అనుగుణంగా విద్యుత్తును సరఫరా చేయడానికి కావలసిన ప్రణాళికలను రూపొందించుకొని కార్యాచరణను వెంటనే అమలు చేయాలని అన్నారు. ట్రాన్స్కో ఆధ్వర్యంలో చేపడుతున్న సబ్ స్టేషన్ల నిర్మాణం పనుల గురించి ఆరా తీశారు. సబ్ స్టేషన్ ల పనుల నిర్మాణానికి నిర్ణీత గడువు లక్ష్యంగా పెట్టుకొని పని చేయాలని సూచించారు.