– సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ అధ్యక్షులు జస్టిస్ జి భవానీ ప్రసాద్
– అధికారులు రూల్‌బుక్ పాటించకపోతే తర్వాతయినా ఫలితం అనుభవించక తప్పదు: ఎల్వీ సుబ్రమణ్యం
ఓటును తొలగించడం అసాధ్యం: నిమ్మగడ్డ రమేష్
విజయవాడ, సెప్టెంబర్ 30 : పౌరసమాజ చైతన్యంతోనే ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ సాధ్యమవుతుందని , అందుకోసం ప్రజల్ని జాగృతం చేసేందుకు తమ సంస్థ కృషి చేస్తుందని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ అధ్యక్షులు విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి. భవానీ ప్రసాద్ వెల్లడించారు.
నూతనంగా ఆవిర్భవించిన పౌరసమాజ సంస్థ” సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ” ఆశయాలు ,లక్ష్యాలు వివరించేందుకు గాంధీనగర్ విజయవాడ ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంస్థ బాధ్యులు మాట్లాడారు.
జస్టిస్ జి. భవానీ ప్రసాద్ మాట్లాడుతూ గొప్ప జాతీయోద్యమ నాయకుల , శిఖరసమానులైన తొలితరం ప్రజా ప్రతినిధుల ఆదర్శాలతో మన ప్రజాస్వామ్య ప్రయాణం ప్రారంభం అయ్యిందని , అయితే దేశం అనేక రంగాల్లో అభివృద్ధి సాధించినా సమాజంలో అంతరాలు , వివక్షలు తొలగిపోలేదని , సంపదసృష్టి జరిగినా పంపిణీలో అసమానతల వల్ల ఆర్థిక వ్యత్యాసాలు పెరిగిపోయాయని అన్నారు.
పాలనా వ్యవస్థలు సక్రమంగా పనిచేయకపోవడం , అవినీతి , ఎన్నికల వ్యవస్థలోని లోపాలు కారణంగా తొలితరం నేతల ఆదర్శాలు , ఆకాంక్షలు నెరవేరలేదని , వారి వారసులుగా వారి ఆశయాలను కొంతమేరకైనా అమలు చేసేందుకు తమ సంస్థ కృషి చేస్తుందని జస్టిస్ భవానీ ప్రసాద్ వివరించారు.
ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలు ఒకటే కాదని , అన్ని వ్యవస్థలు రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేయడం ముఖ్యమని ఆయన అన్నారు. రాజ్యాంగ ఫలాలు అందరికీ అందడం ముఖ్యమని ఆయన అన్నారు. పౌర సమాజం అప్రమత్తంగా ఉంటూ క్రియాశీలంగా వ్యవహరించాలని అన్నారు. రాష్ట్రంలో కుల ,మత , రాజకీయ పక్షపాతాలకు అతీతమైన పౌరసమాజ వాణిని వినిపించడం కోసం , ప్రజల్ని జాగృతం చేయడం కోసం , సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఏర్పాటు చేశామని చెప్పారు.
సంస్థ ప్రధానకార్యదర్శి రాష్ట్ర పూర్వ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛాయుత , నిష్పాక్షిక ఎన్నికలు జరగడం కీలకమని అందుకు సరైన ఓటర్ల జాబితాలు అవసరమని అన్నారు . రాష్ట్రంలో ఓటర్ల జాబితాల తయారీ క్రమంలో ఓటర్ల క్రియాశీల భాగస్వామ్యం ఉండాలని అందుకోసం తమ సంస్థ కృషి చేస్తుందని చెప్పారు.
ఎన్నికల కమిషన్ నియమాల ప్రకారమే ఓటర్ల చేర్పింపు , ఓటర్ల తొలగింపు జరుగుతుందని , దొంగ ఓట్లను చేర్చడం , లేదా నిజమైన ఓటర్లను తొలగించడం అంత సులభం కాదని , అన్నిటికీ పటిష్టమైన పద్దతులు ఉన్నాయని నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు.
ఎన్నికల నియమాలపై ఓటర్లకు అవగాహన కల్గించేందుకు తాము కృషి చేస్తామని , జాబితాల తయారీలో లోపాలు ఉంటే వాటిని తొలగించడానికి , వ్యవస్థలతో కలిసి తాము కలిసి పనిచేస్తామని , సరైన ఓటర్ల జాబితాల తయారీలో రాజకీయ పార్టీలతో , ప్రజాసంఘాలతో , యువ ఓటర్లతో తమ సంస్థ కలిసి కృషి చేస్తుందని చెప్పారు.
ఉపాధికోసం వలస వెళ్ళేవారి ఓట్లను తొలగించేటపుడు ఎన్నికల సిబ్బంది మానవతా దృక్పథంతో వ్యవహరించాలని అభిప్రాయపడ్డారు. ఇంటిలో లేరని వెంటనే తొలగించడం సరికాదన్నారు. ఒకటికి రెండుసార్లు నిర్ధారించుకోవాలని సూచించారు.
వలస కార్మికులు ఓటుహక్కు వినియోగించుకునేందుకు అనువైన ఓటింగు పద్ధతిని రూపొందించాల్సిన అవసరం ఉందని రమేష్ కుమార్ అభిప్రాయ పడ్డారు. అందుకోసం తమ సంస్థ కృషి చేస్తుందని చెప్పారు.
గతం నుండి ప్రభుత్వ ఉద్యోగులను , ఉపాధ్యాయులను ఓటర్ల జాబితాల తయారీ దశ నుండి పోలింగు , ఫలితాల ప్రకటన వరకూ వినియోగిస్తూ వచ్చారని , మన రాష్ట్రంలో ఇటీవల గ్రామ సచివాలయ సిబ్బందిని , వాలంటీర్లను ఎన్నికల ప్రక్రియలో భాగ స్వాములను చేసే ప్రయత్నం జరిగిందని , అది మంచి పద్దతి కాదని ఆయన అన్నారు .
వారిని తమ పార్టీ కార్యకర్తలుగా పేర్కొంటూ అధికారపార్టీ ప్రముఖులు ఇచ్చిన ప్రసంగాలు చూసాక ఎన్నికల ప్రక్రియలోని నిష్పాక్షికత సందేహాస్పదం అయ్యిందని రమేష్ కుమార్ అన్నారు. తమ సంస్థ కార్యవర్గ సమావేశం తర్వాత భవిష్యత్ కార్యకలాపాలను , జిల్లాల్లో క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన చర్యలను నిర్ణయిస్తామని ఆయన అన్నారు.
సంస్థ కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ పూర్వ ప్రధానకార్యదర్శి ఎల్.వి. సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. ఐదేళ్ళ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికల్లో ఓటర్లు అందరూ పోలింగుకు రావడంలేదని , దాంతో పరిపూర్ణమైన ప్రజాభిప్రాయం ప్రతిబింబించడం లేదని దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు.
గతంలో హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల పోలింగు రోజున క్రికెట్ మాచ్ ఉండటంతో 40 శాతం ఓట్లు మాత్రమే పొలయ్యాయని ఆయన గుర్తుచేశారు. ప్రజలంతా పోలింగుకు తరలివచ్చేటట్లు వారిలో అవగాహన కలిగించాలని ఎల్వీ సుబ్రహ్మణ్యం అన్నారు.ప్రజాస్వామ్యంలోని అన్ని వ్యవస్థలూ జవాబుదారీ తనంతో పనిచేస్తేనే ప్రజలకు ప్రజాస్వామ్య ఫలితాలు అందుబాటులోనికి వస్తాయని అన్నారు.
వ్యవస్థలు సక్రమంగా పని చేయాలంటే స్పందించే , ప్రశ్నించే పౌరసమాజం ఉండాలని అన్నారు. పనిచేయడానికి అవసరమైన శిక్షణ పొందిన తర్వాతనే సివిల్ సర్వీసెస్ లోకి అధికారులు వస్తారని , వారు విధి నిర్వహణలో రూల్ బుక్ ను తుచ తప్పకుండా పాటించాలని , రాజకీయ నేతల ఒత్తిళ్ళకు లోనై నియమాలని ఉల్లంఘిస్తే, తర్వాతైనా వారు తగిన ఫలితం అనుభవించాల్సి వస్తుందని ఎల్.వి. సుబ్రహ్మణ్యం అన్నారు.వివిధ వ్యవస్థల పని తీరుపై స్పందించడం , ప్రశ్నించడం , తమ హక్కుల్ని కాపాడుకోవడం కోసం ప్రజలు ముందుకు రావాలని అన్నారు. ఆమేరకు ప్రజల్ని జాగృతం చేయడానికి తమ సంస్థ పని చేస్తుందని అన్నారు.
సంస్థ సహాయకార్యదర్శి వి. లక్ష్మణ రెడ్డి మాట్లాడుతూ సంస్థ ప్రారంభ కార్యక్రమంగా అక్టోబర్ 1 వ తేదీ సాయంత్రం 4 గం.లకు విజయవాడ సిద్ధార్థ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సదస్సులో విశ్రాంత భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ వి.ఎస్. సంపత్ నిష్పాక్షిక ,స్వేచ్ఛాయుత ఎన్నికలు – భారతీయ ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మ ” అంశంపై ప్రసంగిస్తారని తెలిపారు.
సంస్థ కోశాధికారి వి.ఫల్గుణ కుమార్ , కార్యవర్గ సభ్యులు మాజీ డీజీపీ ఎం.వి. కృష్ణారావు , విజయవాడ పూర్వ మేయర్ జంధ్యాల శంకర్, విద్యావేత్త ఎం.సి. దాస్ , సీనియర్ పాత్రికేయుడు డి.సోమసుందర్ , తదితరులు పాల్గొన్నారు. డి.సోమసుందర్ వందన సమర్పణ చేశారు.