అమరావతి: గుంటూరు నగరంలో గోరంట్ల ప్రాంతంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అర్చకుడు నందివెలుగు సాయి చరణ్ (బాధితుడు) ను అనారోగ్య కారణాలు రీత్యా సెలవు అడిగిన పాపానికి ఆలయ కార్యదర్శి మేడ సాంబశివరావు మేనేజర్ చలంచర్ల లక్ష్మీనారాయణ లు అర్చక వృత్తిని, బ్రాహ్మణ కులాన్ని అసభ్యకరంగా దూషించిందే కాక.. కర్ర తీసుకొని దాడి చేయటాన్ని నిరసిస్తూ శనివారం నిరసన ధర్నాను దేవాలయం ముందు రాష్ట్ర అర్చక సేవా సంఘం, బ్రాహ్మణ చైతన్య వేదిక, రాష్ట్ర ఆది శైవ సంఘం, రాష్ట్ర వైఖానస సంఘం ఆధ్వర్యంలో భక్తులు దాతలు సమక్షంలో ముకుముడిగా ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు జంధ్యాల రామలింగేశ్వర శాస్త్రి, సిరిపురపు శ్రీధర్ శర్మ, పత్రి అనిల్ కుమార్, మేడూరు శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో అర్చకులు పై దాడులు విపరీతంగా జరుగుతున్నాయని రెండు మూడు నెలల కాలంలోనే ఇది నాలుగో సంఘటనని గతంలో భీమవరం, రాజమండ్రి, కదిరి లో ఉన్న ప్రధాన దేవాలయాల్లో అర్చకులపై దాడులు ట్రస్ట్ బోర్డు కమిటీ సభ్యులు చేయడం విధితమే.
ఇప్పుడు గుంటూరులో అర్చకుడు పై దాడి చేయడం నిరసిస్తూ నిందితులను కఠినంగా శిక్షించాలని తక్షణమే అరెస్ట్ చేయాలని రాష్ట్ర సంఘాల పిలుపుమేరకు ఈ ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ దాడులు అర్చకులపై ఇలానే కొనసాగితే భవిష్యత్తులో దేవాలయాల్లో పనిచేయడానికి అర్చకులు ఎవరు రారని దానివల్ల దేవాలయ వ్యవస్థ పూర్తిగా కునారిల్లిపోతుందని దీనిపైన అన్ని సామాజిక వర్గాల్లో చర్చ జరగాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, సనాతన దేవాలయ వ్యవస్థ బతికి బాగుండాలంటే అర్చకుల్ని గౌరవంగా ఎటువంటి లోటుపాట్లు లేకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజంలో ఉన్న అన్ని సామాజిక వర్గాల వారిపై ఉందని హెచ్చరించారు.
కోట్ల రూపాయల ఆదాయం ఉన్న ఈ దేవాలయంలో అర్చకులకు సిబ్బందికి రక్షణ లేనప్పుడు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఏం చేస్తుందని ప్రశ్నించారు. తక్షణమే దేవాదాయ శాఖ వారు తమ ఆధీనంలోకి ఈ దేవాలయం తీసుకొని అర్చకులు రక్షణ కల్పించాల్సిందిగా డిమాండ్ చేశారు ఆర్థిక మదంతో దాడి చేసిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని లేని పక్షంలో గుంటూరు అర్బన్ ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. అర్చకులకు దేవాలయ వ్యవస్థకు తమ సంఘాలు ఎప్పుడు అండగా ఉంటాయని ఇటువంటి సంఘటన జరిగినప్పుడు వెంటనే తమ దృష్టికి తేవాలని తెలియజేశారు.
తొలుత ఈ దేవాలయం ప్రధాన అర్చకులు శ్రీనివాసచార్యులు, కృష్ణ శర్మ తదితరులు స్థానికంగా ఉన్న వెంకటేశ్వర స్వామి ప్రధాన దేవాలయం, ఉపాలయాలు మూసివేసి, తాళాలు వేసి ధర్నాకు సంఘీభావం తెలియజేసి ధర్నాలో కూడా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో అర్చక బ్రాహ్మణ సంఘ నాయకులు గొట్టిపాళ్ల కృష్ణమాచార్యులు, పరాసరం జగన్మోహన్ ఆచార్యులు, యనమదల ఆంజనేయులు, చిట్యాల మల్లికార్జున శర్మ, వినుకొండ సత్యంబాబు, కే మోహన్, నందివెలుగు గిరిధర శర్మ, బందా శశిధర్, తాడేపల్లి కృష్ణ, బందా అంజి, ఎండపల్లి శబరి, అన్వేష్, లలితా సంపత్ కుమార్ మర్రిపాటి శ్రీను చైతన్య, ఫణి బాజీ, నాని, ఆమంచి రవి కుమార్, కోణంకి మారుతి తదితరులు పాల్గొన్నారు.
నల్లపాడు పోలీస్ స్టేషన్ సిఐ బత్తిన శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అత్యధిక సంఖ్యలో పోలీస్ సిబ్బంది విధులు నిర్వహించారు ధర్నా చివర్లో రాస్తారోకో నిర్వహణ సమయంలో పోలీసులకు అర్చక సంఘం నాయకులకు మధ్య ఉద్రిక్తత నెలకొన్నది స్థానిక ప్రాంత ప్రజలు కూడా అర్చకులకు మద్దతుగా వందలాది మంది హాజరయ్యారు కమిటీ చైర్మన్ నల్ల ఆంజనేయులు, కమిటీ సభ్యులు డౌన్డౌన్ అంటూ నిందితులను వెంటనే అరెస్టు చేయాలని నినాదాలు చేశారు.