చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత
అమరావతి: రాష్ట్రంలో గ్రామీణ పారిశ్రామికాభివృద్ధికి కూటమి ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యం ఇస్తోందని చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. యువతకు ఉపాధి కల్పనలో ఏపీ ఖాదీ, విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు కీలక పాత్ర పోషిస్తోందని ప్రశంసించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్పీ సిసోడియాతో కలిసి బోర్డు అధికారులతో నిర్వహించిన సమీక్షలో, 2025–26 ఆర్థిక సంవత్సరంలో లక్ష్యాన్ని మించి యూనిట్లు ఏర్పాటు చేయడంపై అధికారులను అభినందించారు.
సమీక్షలో బోర్డు సీఈవో సింహాచలం వివరాలు వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1,060 యూనిట్ల లక్ష్యానికి గాను 3,744 యూనిట్లు ఏర్పాటు చేయగా, రూ.127.17 కోట్ల సబ్సిడీ అందజేశామని తెలిపారు. దీనివల్ల 41,184 మందికి ఉపాధి లభించిందన్నారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, అర్హులైన వారందరికీ యూనిట్లు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు.
మంత్రి సవిత మాట్లాడుతూ, 2029 నాటికి 20 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమన్నారు. ప్రతి కుటుంబం నుంచి ఒకరిని పారిశ్రామిక వేత్తగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో వలసలను అరికట్టేలా స్థానికంగా ఉపాధి కల్పించడంపై దృష్టి సారిస్తున్నామని తెలిపారు. టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, మగ్గం పనులు, కొవ్వొత్తులు, ఆకులతో కప్పులు–ప్లేట్ల తయారీ వంటి రంగాల్లో శిక్షణతో పాటు యూనిట్లు మంజూరు చేస్తున్నామని, రూ.10 లక్షల వరకు వ్యక్తిగత పూచీకత్తు అవసరం లేదన్నారు.
యూనిట్ల మంజూరుపై గ్రామీణ స్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు, బోర్డు చైర్మన్, డైరెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ యూనిట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇప్పటికే యూనిట్లు స్థాపించిన వారితో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించి, అనంతరం రాష్ట్ర స్థాయి భారీ సమావేశం ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో బోర్డు చైర్మన్ కె.కె.చౌదరి, డైరెక్టర్లు, సీఈవో సింహాచలం తదితర అధికారులు పాల్గొన్నారు.