– మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ కోటా సీట్లు 50 శాతం
– కేవలం అంతవరకే పరిమితం చేయడం దుర్మార్గం
– ఇది దోచుకో..పంచుకో..తినుకో అనేదే సుస్పష్టం
– వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ డాక్టర్స్ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి
తాడేపల్లి: వేల కోట్ల విలువైన ప్రభుత్వ సంపదను అప్పనంగా దోచుకోవడమే లక్ష్యంగా, పీపీపీ పేరుతో 10 కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలని టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వైయస్సార్సీపీ డాక్టర్స్ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి వస్తే, మెడికల్ సీట్లన్నీ కన్వీనర్ కోటాలనే భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన కూటమి పెద్దలు, అధికారంలోకి వచ్చాక దాన్ని కేవలం 50 శాతానికే పరిమితం చేయడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. మిగతా 50 శాతం సీట్లను, బీ, సీ కేటగిరీల్లో మేనేజ్మెంట్తో పాటు, ఎన్నారై కోటా కింద భర్తీ చేసేలా క్యాబినెట్లో తీర్మానించడం విద్యార్థులను దగా చేయడమేనని ఆక్షేపించారు. పైగా మెడికల్ కాలేజీల భూములను ఎకరా రూ.100కే లీజుకి ఇవ్వడం అంటే ప్రభుత్వ ఆస్తులను అప్పనంగా దోచిపెట్టడమేనని తేల్చి చెప్పారు.
ఇంకా ఎన్నికల ముందు జగన్ హెచ్చరించినట్లుగా, ఇది కచ్చితంగా దోచుకో..తినుకో..పంచుకో (డీపీటీ) విధానమే అని గుర్తు చేశారు. 10 కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు ప్రజల నుంచి విశేషమైన స్పందన లభిస్తోందని చెప్పారు. అందుకే దాన్ని చూసైనా ప్రభుత్వం తన నిర్ణయంపై వెనక్కి తగ్గాలని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి కోరారు. : తాము అధికారంలోకి వస్తే, మొత్తం మెడికల్ సీట్లను నీట్ ద్వారా ప్రభుత్వ కోటా కిందనే భర్తీ చేస్తామని యువగళం పాదయాత్రలో నారా లోకేష్ హామీ ఇచ్చారు.
కానీ తీరా ఇప్పుడు చూస్తే ఆదోని, మదనపల్లె, మార్కాపురం, పులివెందుల మెడికల్ కాలేజీల్లో నీట్ పరీక్ష రాసి వచ్చే విద్యార్థులకు 50 శాతం సీట్లు మాత్రమే ఇస్తామని.. మిగతా 50 శాతం సీట్లను బీ, సీ కేటగిరీ మేనేజ్మెంట్, ఎన్నారై కోటా కింద భర్తీ చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఈ కాలేజీలను తొలుత 33 ఏళ్లపాటు, తర్వాత మరో 33 ఏళ్లపాటు లీజుకు ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మొత్తంగా 66 సంవత్సరాలు లీజుకిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మెడికల్ కాలేజీలు పొందిన కుటుంబాలు తరతరాలుగా సంపాదన పొందే విధంగా పీపీపీ విధానం తీసుకొచ్చారు. ఈరోజు మార్కెట్లో కేజీ టమోట వందకి కొనాల్సి వస్తుంటే, మెడికల్ కాలేజీలను ఎకరా లీజు వంద రూపాయలకే కట్టబెట్టేస్తున్నారు. 50 ఎకరాలున్న మెడికల్ కాలేజీని రూ.5 వేలకే లీజుకిస్తున్నారంటే దారుణం కాక ఇంకేమిటి? ఇది కాక రెండేళ్ల పాటు ప్రభుత్వ వైద్యశాలను ఉపయోగించుకోవచ్చని, అక్కడ పని చేసే సిబ్బందికి కూడా ప్రభుత్వమే జీతాలు ఇస్తుందని చెబుతున్నారు.
అంటే, టెండర్ దక్కించుకున్న వారు డాక్టర్లు, ఇతర సిబ్బందితో సహా రెండేళ్ల పాటు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా మెడికల్ కాలేజీలను నిర్వహించుకునేలా ప్రభుత్వ ఆస్తులను ధారాదత్తం చేస్తున్నారు. 70 శాతం రోగులకు ఉచితంగా, 30 శాతం రోగులకు పేమెంట్‌తో వైద్యం చేస్తామని చెబుతున్నారు. మరి ఈ 70%, 30% పరిధిలోకి ఏ రోగులు వస్తారు?. దాన్ని ఎవరు చూస్తారు? అసలు 70 శాతం కోటా నిండిపోయిందని ఎవరు పర్యవేక్షిస్తారు? షాపింగ్ మాల్స్‌లో ఆఫర్ల తరహాలో ఇది పేదలను మోసం చేసే కుట్ర. కూటమి ప్రభుత్వం వచ్చాక మొత్తం 2450 మెడికల్ సీట్లు రాష్ట్రం కోల్పోయింది. ఇక్కడ మెడికల్ సీట్లు లేక కోట్లు వెచ్చించి పరాయి దేశాలకు మన పిల్లలు వెళ్లాల్సిన దుస్థితికి చంద్రబాబే కారణం. వైయస్సార్సీపీ తిరిగి అధికారంలోకి రాగానే, ఆ టెంటర్లన్నీ రద్దు చేసి ప్రభుత్వమే స్వయంగా మెడికల్ కాలేజీలు నిర్వహిస్తుందని జగన్ చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి గుర్తు చేశారు.