– సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గని శెట్టి డిమాండ్
పరవాడ.ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్( ఈవోఐ) పేరుతో కేంద్ర బిజెపి ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్ లోని 44 విభాగాలను ప్రైవేటీకరించడానికి బిడ్లు ఆహ్వానించింది. ఇది స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటేకరించే చర్య. దీనిని వెంటనే రద్దు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెంటనే జోక్యం చేసుకొని ఈవోఐని రద్దు చేయించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో మంగళవారం ఫార్మసిటీలో నిరసన ప్రదర్శన నిర్వహించింది.
ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గని శెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కు రివైవల్ ప్యాకేజీ ప్రకటించిన సందర్భంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వ రంగ విశాఖ ఉక్కు సెంటిమెంటుతో కూడినది. దేశంలోనే దీనిని అగ్రగామి సంస్థగా నిలుపుతాం, స్టీల్ రంగంలో స్వయం సమృద్ధి సాధిస్తాం. ఇది మా ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని ప్రకటించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిచిపోయింది. దీనిని లాభాల బాట పట్టిస్తాం, కార్మికులకు, నిర్వాసితులకు న్యాయం చేస్తాం. ఆర్థిక పేకేజీ మా ప్రభుత్వం సాధించిన ఘనత. అధికారం చేపట్టి సంవత్సరంలోనే ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని ఘనంగా ప్రకటించారు.
కానీ ఆర్థిక ప్యాకేజీ కార్మికులను,ప్రజలను మభ్యపెట్టి ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియను వేగవంతం చేయడానికేనని ఆచరణలో నిరూపణ అవుతోంది అని గనిశెట్టి అన్నారు. ప్లాంట్ లోని కీలక విభాగాలను 44 ముక్కలుగా చేసి, ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేయడానికి స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ద్వారా ఈఓఐ పేరుతో కేంద్రం బిడ్లు ఆహ్వానించింది.
ప్లాంట్ లో ప్రస్తుతం సుమారు 600 స్థానిక ప్రైవేటు ఏజెన్సీలు, కాంట్రాక్టర్లు ఉన్నారు. వీరి స్థానంలో కేంద్ర ప్రభుత్వ, కూటమి ప్రభుత్వ పెద్దల కనుసన్ననలోని 50 పెద్ద ఏజెన్సీలను నియమిస్తారు. కీలక విభాగాల్లోని ఆఫీసర్లు, పర్మనెంట్ కార్మికులకు ఆపరేషన్ లో ఎటువంటి పాత్ర ఉండదు. వీరి సంఖ్య బాగా తగ్గించబడుతుంది.
నిర్వాసితులు ఉద్యోగ అవకాశాలు కోల్పోతారు. ప్రస్తుత కాంటాక్ట్ కార్మికులను వేల సంఖ్యలో తొలగిస్తారు. వీరి స్థానంలో ఇతర రాష్ట్రాల నుండి కాంట్రాక్ట్ కార్మికులను నియమించి వారికి ఎటువంటి చట్టపరమైన హక్కులు,రక్షణ కల్పించకుండా శ్రమదోపిడీ చేస్తారు. బడా కాంట్రాక్టర్లు, అధికారంలోని రాజకీయ గెద్దలు లబ్ధి కట్టబెట్టాలన్న కుట్రలో భాగమే ఈ ఈఓఐ. దీనిని తక్షణమే రద్దు చేయాలని గని శెట్టి డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే మాకు ముఖ్యం, ప్రాధాన్యత అని ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతరం చెప్తారు. స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగంలో రక్షించడం కన్నా రాష్ట్ర ప్రయోజనాలు ఏముంటాయి? విశాఖ ఉక్కు ప్రత్యక్షంగా పరోక్షంగా లక్ష మందికి ఉపాధి కల్పిస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు 54 వేల కోట్ల రూపాయలు పన్నులు, డివిడెంట్ లు రూపంలో ఆదాయం సమకూర్చింది. బడుగు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం అందిస్తోంది.
విశాఖపట్నం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తోంది. ఈ బంగారు బాతును ప్రైవేటీకరించి, కార్పొరేట్ లకు కట్టబెట్టే కుట్రలు మోడీ ప్రభుత్వం తీవ్రం చేస్తున్నది. టిడిపి జనసేన బిజెపి కూటమి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలో కాపాడి, అభివృద్ధి చేసేందుకు పూనుకోవాలని, అక్రమంగా తొలగించిన ఐదువేల మంది కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే విధుల్లో పెట్టించాలని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కును 44 ముక్కలుగా చేసి కార్పొరేట్లకు కట్ట పెట్టేందుకు సిద్ధపడుతూ, 5,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను,2 వేల మంది పర్మినెంట్ కార్మికులను తొలగిస్తే స్థానిక గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, విశాఖ ఎంపీ శ్రీ భరత్ స్పందించకపోవడం దుర్మార్గం అన్నారు. ఇది నమ్మి ఓట్లు వేసి గెలిపించిన ప్రజలను మోసగించడమే అన్నారు.
విశాఖ, ఉత్తరాంధ్రకు సంబంధించిన కార్మికులను తొలగించి బీహార్ యుపి ఝార్ఖండ్ ఒడిస్సా రాష్ట్రాలకు సంబంధించిన కార్మికులను నియమిస్తుంటే వీరు పట్టించుకోకుండా స్థానిక కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారన్నారని విమర్శించారు.
కేంద్ర బిజెపి , రాష్ట్ర కూటమి ప్రభుత్వాలకు కార్మికులను అక్రమంగా తొలగించే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఈవోఐ, కార్మికుల తొలగింపులు ఆపకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదని గని శెట్టి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కే అప్పలరాజు, జి చిట్టిబాబు, కే రమణ, శేషు, తదితరులు పాల్గొన్నారు