– ఆలోచనపరుల వేదిక నిర్ణయం
– 4,5,6 తేదీల్లో ప్రాజెక్టుల పరిశీలన
– రైతులు, ఇంజనీర్లు, మేధావులను కలుస్తాం
– కాంట్రాక్టర్లు కాదు.. కర్షకులు లాభపడే ప్రాజెక్టులు కావాలి
– మా పర్యటనకు తెలంగాణ పార్టీలు, రిటైర్డు ఇంజనీర్లూ రండి
– అభూతకల్పనలతో ఆంధ్ర-తెలంగాణ మధ్య వైషమ్యాలు సృష్టించవద్దు
– తెలంగాణ సర్కారు తప్పుడు ప్రకటనలపై ఏపీ మాట్లాడదేం?
– బనకచర్ల చాటున ఏపీ నీటి హక్కులపై తెలంగాణ పార్టీల దాడి
– బనకచర్లను విరమించుకోకపోతే ఏపీ ముద్దాయిగా నిలబడుతుంది
– మీడియాతో మాజీ డీజీ ఏ.బి. వెంకటేశ్వరరావు, రైతు సేవా సంస్థ అధ్యక్షులు అక్కినేని భవానీ ప్రసాద్, నీటి పారుదల రంగం విశ్లేషకులు టి. లక్ష్మీనారాయణ
విజయవాడ:రాష్ట్రంలో నెలకొన్న సాగు-తాగునీటి ప్రాజెక్టుల వాస్తవ స్థితిగతులు తెలుసుకుని వాటిని ప్రజలకు వివరించే లక్ష్యంతో ఆగస్టు 4,5,6 తేదీల్లో ప్రాజెక్టుల పరిశీలనకు వెళ్లనున్నట్లు ఆలోచనపరుల వేదిక వెల్లడించింది. ఆ మేరకు తాము సందర్శించబోయే ప్రాజెక్టుల వివరాలు, మీడియా ముఖంగా ప్రకటించింది. అపోహల నేపథ్యంలో తెలంగాణ రాజకీయ పార్టీలు, రిటైర్డ్ ఇంజనీర్లు కూడా రావచ్చని ఆహ్వానించింది. రాజకీయ నాయకులు-కాంట్రాక్టర్ల ధనదాహానికి బలయిపోతున్న ప్రాజెక్టుల స్థితిగతులు తెలుసుకుని, ప్రజలను అప్రమత్తం చేయడమే తమ ప్రాజెక్టుల మాజీ డీజీ ఏ.బి. వెంకటేశ్వరరావు, రైతు సేవా సంస్థ అధ్యక్షులు అక్కినేని భవానీ ప్రసాద్, నీటి పారుదల రంగం విశ్లేషకులు టి. లక్ష్మీనారాయణ విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఆలోచనాపరుల వేదిక నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఏ.బి. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. గత యాభై అరవై సంవత్సరాలుగా కృష్ణా నదీ జలాల పంపకం, వాడకం, రాయలసీమలో సాగునీటి పారుదల అభివృద్ధి, వ్యవసాయాభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ -తెలంగాణ మధ్య నీటి పంపకాల అంశంపై ప్రజలను మభ్యపెట్టి, ఏమార్చి, కేవలం రాజకీయాల కోసం వాడుకోవడం జరుగుతున్నదన్న విషయాన్ని అందరం గమనిస్తున్నాం.
ఈ అంశాలపై రెండు రాష్ట్రాల ప్రజలకు స్పష్టత కల్పించాల్సిన అవసరం ఉంది. కృష్ణా నదిలో ఎన్ని నీళ్ళు వస్తున్నాయి, ఎన్ని సముద్రం పాలవుతున్నాయి, ఎన్ని నీళ్ళు వాడుకునే సామర్థ్యం రెండు రాష్ట్రాలకు ఉన్నది, ఏ మేరకు ఆ సామర్థ్యాన్ని వినియోగించుకోగలుగుతున్నామో ఆలోచించాలి. 30 ఏళ్ళ క్రితం ప్రారంభించిన ప్రాజెక్టులు, ఇవాళ ఏ స్థితిలో ఉన్నాయి?
ఇప్పటి వరకు ఖర్చు పెట్టిన డబ్బంతా “డెడ్ ఇన్వెస్ట్మెంట్”గా ఉండి, దాన్నుంచి ఒక్క రూపాయి ఆదాయం రాకుండా ఈ డబ్బంతా ఎ టుపోయినట్టు? ఎవరు తిన్నట్టు? ఏ కాంట్రాక్టర్ల లబ్ది కోసం ఈ ప్రాజెక్టులు కట్టినట్టు? ఏ ప్రాజెక్టులో ఇంకా ఎన్ని నిర్మాణ పనులు ఆగిపోయి ఉన్నాయి? వాటికి అయ్యే ఖర్చేంత? ఇప్పటి వరకు పెట్టిన ఖర్చుతో పోల్చితే, ఇంకా పెట్టాల్సిన ఖర్చు శాతమెంత? ఆ కాస్తా ఖర్చు పెట్టకపోతే ఇప్పటి వరకు పెట్టిన పదుల వేల కోట్ల రూపాయల “డెడ్ ఇన్వెస్ట్మెంట్”పై కడుతున్న వడ్డీలు ఎంత నష్టం చేస్తాయి? అనే విషయాల మీద ప్రజలకు స్పష్టత కల్పించడం కోసం ప్రాజెక్టుల సందర్శనకు వెళ్ళడానికి నిర్ణయించుకున్నాం.
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు చేసే విజ్ఞప్తి ఏంటంటే.. రాజకీయ పార్టీలు పొద్దుపోకపోతే, ఏ ఇష్యూ లేకపోతే, నీళ్ళ సమస్యను ఒక ఇష్యూగా తీసుకుని, హోరేత్తించే ప్రకటనల ఉద్యమాలు చేస్తుంటారు. ఆ ప్రకటనలను నమ్మొద్దు. వాస్తవాలేంటో కాస్తా తరచి చూసుకోండి.
నీటి పారుదల రంగంలో ఉన్న నిపుణులకు మేము చేసే విజ్ఞప్తి.. మీరు మీ తెలివితేటలను ఉపయోగించి, ప్రజలకు అవసరమైన ప్రాజెక్టులు, ఆ ప్రాజెక్టుల నిర్మాణంలో జరుగుతున్న జాప్యం, దాని వల్ల జరుగుతున్న నష్టం, ఏది సాధ్యం, ఏది అసాధ్యం, దేనికి అనుమతులున్నాయి, ఏ ప్రాజెక్టులకు అనుమతులు లేవు, అనుమతులు లేని వాటికి అనుమతులు ఎలా తెచ్చుకోవాలి, కృష్ణా నది యాజమాన్య బోర్డు లేదా గోదావరి నది యాజమాన్య బోర్డు ముందు కూర్చుని అపరిష్కృతంగా ఉన్న వాటిని పరిష్కరించుకోవడంలో రాజకీయ పరిపక్వత ఉంటుంది.
కేవలం ప్రకటనలు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్, తొడలు కొట్టడాలు, మీసాలు మెలేయడాలు, సవాళ్ళు విసరడాళ్ళు, అనేది నీటిపారుదల రంగం బాగులు, రైతుల బాగులు ఉద్దేశించే పనులు కావవి. అవి కేవలం రాజకీయాలకే పనికొస్తాయి.
వాటి చాటున అనవసరమైన ప్రాజెక్టులను నిర్మించడం, కేవలం కాంట్రాక్టర్ల చొరవతో, అవసరం లేని పనికిమాలిన ప్రాజెక్టులను డిజైన్ చేయటం, వాటికి అనుమతులివ్వడం, హుటాహుటిన నిధులు చెల్లించడం, గతంలో చూశాం, ఇప్పుడు చూస్తున్నాం. పోలవరం నదీ గర్భం నుంచి ఒక లిప్ట్ ఇరిగేషన్ ను ఒక వెయ్యి కోట్లతో చేపట్టిన ప్రాజెక్టయితేనేమి, రాయలసీమ లిప్ట్ ఇరిగేషన్ అని నిర్మించ తలపెట్టిన ఇంకొక ప్రాజెక్టయితేనేమి, ఇవన్నీ ఆకోవలోకే వస్తాయి.
తెలంగాణలో కూడా ఇలాంటి ప్రాజెక్టులు చాలా ఉండి ఉంటాయి. మనం చూశాం కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి ఏంటనేది. కాబట్టి, ఏ రాష్ట్రమైనా ఇదంతా ప్రజల డబ్బు, ప్రజల డబ్బుని రైతుల బాగు కోసం, రాష్ట్రం అభివృద్ధి కోసం ఆచితూచి, ప్రాధాన్యత ప్రకారం, “కాస్ట్ బెనిపిట్” చూసుకుంటూ ఖర్చు పెట్టాలి తప్ప ఉద్వేగాలకు లోనయ్యో, ఓట్ల వేటలోనో, కాంట్రాక్టర్ల లబ్దికోసమో పదుల వేల కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని దుబారా చేయడం రాజకీయంగా తప్పిదమే కాదు, ఒక రకంగా పాపం కూడా.
కాబట్టి, రాయలసీమలో ఉన్న ప్రాజెక్టులు, వాటి స్థితిగతులు, వాటి నిర్ణయం ఎంత వరకు పూర్తయ్యింది, ఏమేమి మిగిలి ఉన్నాయన్న విషయాన్ని అధ్యయనం చేసి, నిష్పక్షపాతంగా ప్రజల ముందు ఉంచుతాం. ప్రజల్లో చర్చ జరగాలి. సాగునీటి రంగం నిపుణులు ఆలోచించాలి. చర్చించాలి, ప్రజల ముందు పెట్టాలి.
మేము వెళుతున్న ప్రతిచోట రైతు నాయకులు, రైతులు, సాగునీటి రంగం నిపుణులు, రిటైర్డ్ ఇంజనీర్లు, రాజకీయ పార్టీల ప్రతినిధుల అభిప్రాయాలను ఆహ్వానిస్తాం. తెలంగాణకు చెందిన మిత్రులు కూడా వచ్చి మాతో కలిస్తే ఆహ్వానిస్తాం. కృష్ణా నదికి వచ్చిన వరదను చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమలోనే నీటి నిల్వకు రిజర్వాయర్లను నిర్మించుకునే అవకాశం ఉన్నది.
అలాగే దక్షిణ కోస్తా ప్రాంతంలో నీటిని నిల్వ చేసుకోవడానికి నల్లమలసాగర్, సోమశిల, కండలేరు లాంటి రిజర్వాయర్లు ఉన్నాయి. రిజర్వాయర్ల నిర్మాణం ఏ స్థాయిలో ఉన్నాయి, రిజర్వాయర్లలో నిల్వ చేసిన నీటిని పొలాలకు అందజేసే కాలువల నిర్మాణం ఏ స్థాయిలో ఉన్నది, ఈ అన్ని అంశాలను నిష్పాక్షపాతంగా అధ్యయనం చేసి,రాజకీయాలకు అతీతంగా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. ఆ బాధ్యతను మేము స్వచ్ఛందంగా నెత్తికెత్తుకుని పర్యటనకు వెళుతున్నాం. అన్ని వర్గాల ప్రజలు, మీడియా సహకరించాలని కోరుతున్నాం.
రైతు సేవా సమితి, అధ్యక్షులు అక్కినేని భవానీ ప్రసాద్ మాట్లాడుతూ, ఎవరు మాట్లాడినా ముందు రాయలసీమకు నీళ్ళివ్వాలని చెబుతుంటాం. కానీ, గత పాతిక ముప్పైయ్ ఏళ్లుగా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఒక నిర్ధిష్టమైన ప్రణాళికను ప్రకటించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నది.
తెలుగు గంగ, హంద్రీ – నీవా, గాలేరు – నగరి, వెలిగొండ ప్రాజెక్టుల నిర్మాణం ముప్పైయ్ సంవత్సరాలుగా నడుస్తుంటే, వాటిని ఎప్పటికి పూర్తి చేయాలి? వాటిని అలాగే ఉంచేసి, కొత్తగా మరొక ప్రాజెక్టును తీసుకొచ్చి మూడేళ్ళలో పూర్తి చేస్తామని చెప్పడమంటే రాయలసీమ ప్రజలను మోసం చేసినట్లే అవుతుంది. అలా కాకుండా ఆచరణాత్మకంగా ఏది చేయగలమో, ఆ ప్రాంత రైతాంగం, నిపుణులతోను చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి.
కృష్ణా జలాల్లో మనకున్న వాటా మేరకు నూటికి నూరు శాతం వాటిని కాపాడుకుంటూ, వాటిని వినియోగించుకోవడంపై దృష్టి సారించాలి. ఇప్పుడు చూస్తున్నాం, 80 టియంసిలకుపైగా ప్రకాశం బ్యారేజీ నుండి సముద్రంలోకి వెళ్ళాయి. చాలా మంది అది వృథాగా భావిస్తున్నారు. వాటిని వృథాగా భావించకూడదు. వాటర్ సైకిల్ లో అవి మళ్ళీ మనకే ఉపయోగపడతాయి. అదే సందర్భంలో వాటిలో ఏ మేరకు, ఎక్కడ ఉపయోగించుకోగలమో తీవ్రంగా ఆలోచించాలని కోరారు.
సాగునీటి రంగం విశ్లేషకులు టి. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ఇటీవల కేంద్ర జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశలో ఒక కమిటీని ఏర్పాటు చేసి, నీటి సమస్యల పరిష్కారానికి మార్గాన్వేషణ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ, నేటికీ ఆ కమిటీని ఏర్పాటు చేయలేదు.
నైరుతి రుతుపవనాలు ముందుస్తుగా పలకరించినా, మన రాష్ట్రంలో ఆశించిన వర్షపాతం నమోదు కాలేదు. జూన్ 1 నుండి జూలై 31 వరకు సాధారణ వర్షపాతం 240.29 మి.మీ. అయితే, నమోదైన వాస్తవ వర్షపాతం 187.65 మి.మీ. మాత్రమే. కానీ, కృష్ణా నది పరివాహక ప్రాంతంలోని మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో మంచి వర్షం కురవడంతో తుంగభద్ర, శ్రీశైలం, నాగార్జునసాగర్ మరియు పులిచింతల రిజర్వాయర్లు నిండుకుండల్లా జలకళతో తొణికిసలాడుతున్నాయి.
ప్రకాశం బ్యారేజీ నుండి పెద్ద ఎత్తున నీటి ప్రవాహం సముద్రంలోకి వెళుతున్నది. శ్రీశైలం జలాశయం గుండెకాయ లాంటిది. అక్కడ నుండి కరవుపీడిత రాయలసీమకు నీటిని తరలించడానికి, ఆ నీటిని పొలాలకు అందించి పంట పండించుకోవడానికి ఉన్న అవకాశాలు, ప్రాజెక్టుల నిర్మాణ స్థితిగతులపై అధ్యయనం చేయడానికి ఒక బృందంగా ఆగస్టు 4 నుండి 6 వరకు పర్యటనకు వెళుతున్నాం.
తెలంగాణలో అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న పార్టీలకు చెందిన మిత్రులు, నీటి సమస్యలపై మాట్లాడుతున్న రిటైర్డ్ ఇంజనీర్స్ ను రమ్మని కోరుతున్నాం. అందరం కలిసి క్షేత్రస్థాయి అధ్యయనం చేద్దామని విజ్ఞప్తి చేస్తున్నాం. అభూతకల్పనలతో తెలుగు ప్రజల మధ్య అగాధం పెంచడం మంచిది కాదని, ఐక్యంగా అభివృద్ధి చెందడానికి ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి అనుకూల వాతావరణాన్ని కల్పించుకోవాలి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శ్రీశైలం రిజర్వాయరు నుండి గరిష్ట స్థాయిలో నీటి తరలించి, రిజర్వాయర్లు మరియు చెరువుల్లో నింపమని అధికారులను ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి. మరి ఎందుకు పోతిరెడ్దిపాడు హెడ్ రెగ్యులేటర్ నుండి 44,000 క్యూసెక్కుల నీటిని తరలించడానికి అవకాశం ఉన్నా 31,000 క్యూసెక్కులనే తరలిస్తున్నారు? రు. 3,800 కోట్లు ఖర్చు చేసి, హంద్రీ – నీవా ప్రధాన కాలువ లైనింగ్ మరియు విస్తరణ పనులు పూర్తి చేశామన్నారు, కానీ, ఎందుకు గరిష్టంగా 3,850 క్యూసెక్కుల నీటిని తరలించలేక పోతున్నారు? పోనీ, తరలించిన నీటినైనా పొలాలకు అందిస్తున్నారా, ఏ మేరకు అందిస్తున్నారో, అధ్యయనం చేయడానికే సందర్శనకు వెళుతున్నాం. వాస్తవాలను ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ప్రజలకు మరియు అవాస్తవాలతో తెలంగాణలో దుష్ప్రచారం, ఆరోపణలు చేస్తున్న మిత్రులకు కూడా తెలియజేయడానికే ఈ పర్యటనకు వెళుతున్నాం.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా, గోదావరి నదీ జలాలపై రాజకీయ ప్రేరేపిత వివాదం తీవ్ర స్థాయిలో కొనసాగుతున్నది. ట్రిబ్యునల్ తీర్పులను, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థికరణ చట్టాన్ని ఖతారు చేయకుండా తెలంగాణలో నీళ్ళ రాజకీయాన్ని తారస్థాయికి తీసుకెళ్ళారు. తెలంగాణ ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ద్వారా అసత్యాలతో ఆంధ్రప్రదేశ్ నీటి హక్కులపై దాడి చేసినా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించలేదు.
శ్రీశైలం జలాశయం నుండి రాయలసీమ వైపున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, రాయలసీమ ఎత్తిపోతల, మల్యాల, ముచ్చుమర్రి, వెలిగొండ ప్రాజెక్టు ద్వారా 1,11,400 క్యూసెక్కుల చొప్పున రోజుకు 10 టియంసిలను అక్రమంగా తరలించుకుపోతున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా తీవ్ర ఆరోపణ చేశారు.
తెలంగాణ అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం ఇంజనీర్, తన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పట్టికలో మొత్తం 1,52,422 క్యూసెక్కుల సామర్థ్యంతో మౌలిక సదుపాయాలను నిర్మించుకున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీ బిఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ పూర్వ సలహాదారు వెదిరె శ్రీరాం, పలువురు విశ్రాంత ఇంజనీర్లు నిరంతరాయంగా తప్పుడు సమాచారం, గణాంకాలతో తెలంగాణ ప్రజలను ప్రసారమాధ్యమాల ద్వారా రెచ్చగొట్టే పనిలో నిమగ్నమై వున్నారు.
నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అత్యంత లోపభూయిష్టమైన, ఆంధ్రప్రదేశ్ నీటి హక్కులకు ప్రమాదం తెచ్చిపెట్టే, కరవుపీడిత రాయలసీమకు తీవ్రహానికరమైన పోలవరం – బనకచెర్ల భారీ ఎత్తిపోతల పథకాన్ని ప్రతిపాదించారు. దాన్ని విరమంచుకోమని మేము మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం. ఈ పథకాన్ని తెలంగాణవాదులు రాజకీయ ఆయుధంగా మలుచుకుని, ఆంధ్రప్రదేశ్ నీటి హక్కులపై ముప్పేట దాడి చేస్తున్నారు.
ఈ పూర్వరంగంలో శ్రీశైలం జాలాశయం నిండింది, గేట్లెత్తి కిందికి నీటిని వదులుతున్నారు. క్షేత్రస్థాయి అధ్యయనం ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాస్తవాలను తెలియజేయాలన్న తలంపుతో ఆలోచనాపరుల వేదిక ప్రతినిధి బృందం ప్రాజెక్టుల పర్యటనకు వెళుతున్నది. ఇందులో సీనియర్ ఐపిఎస్ విశ్రాంత ఉన్నతాధికారి ఎబి వెంకటేశ్వరరావు, అక్కినేని భవానీ ప్రసాద్, టి. లక్ష్మీనారాయణ ఉన్నారు.
ఆగస్టు 4న పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు యొక్క ప్రధాన జాలాశయం నల్లమలసాగర్, రెండు సొరంగాల నిర్మాణానికి సంబంధించి ప్రస్తుత పరిస్థితిని ప్రతినిధిబృందం తెలుసుకొనే ప్రయత్నం చేస్తుంది.
5వ తేదీన శ్రీశైలం జలాశయం ఆధారంగా నిర్మించబడిన మరియు నిర్మాణంలో ఉన్న రాయలసీమ ప్రాజెక్టులకు నీటిని తరలించే మల్యాల, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాలు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ను ప్రతినిధి బృందం సందర్శిస్తుంది. అటుపై, బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్, వెలుగోడు రిజర్వాయరును సందర్శిస్తుంది.
6వ తేదీన శ్రీశైలం కుడి బ్రాంచి కాలువ (ఎస్సార్బీసీ) ప్రధాన రిజర్వాయరు అయిన గోరకల్లు, దాని తర్వాత అలగనూరు రిజర్వాయరు మరియు సుంకేసుల ఆనకట్టలను సందర్శించిన మీదట కర్నూలులో రైతు సంఘాల నేతలు మరియు పౌర సమాజం ప్రతినిధులతో ఆలోచనాపరుల వేదిక ప్రతినిధిబృందం సమావేశం అవుతుంది.