– తెలంగాణ ఆరోపణలపై బాబు, అధికారులు మాట్లాడరేం?
– నీరు ఎత్తిపోసి మళ్ళీ క్రిందకు ఎవరైనా పారబోస్తారా?
– రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను రెండేళ్లలో యుద్ధప్రాతిపదికన పూర్తి చేయండి
– పోలవరం – బనకచెర్ల, రాయలసీమ ఎత్తిపోతల పథకాలను విరమించుకోండి
– మిగిలిన ప్రాజెక్టులను కూడా సందర్శించి.. అధ్యయనం చేసి.. ప్రజలకు వివరాలు తెలియజేస్తాం
– ప్రాజెక్టుల పరిశీలన అనంతరం ఆలోచనాపరుల వేదిక ప్రతినిధులు
అమరావతి: “ప్రాజెక్టులు ప్రజల కోసం నిర్మించాలి” అన్న నినాదంతో ఆలోచనాపరుల వేదిక ఆధ్వర్యంలో ఆగస్టు 4 నుండి 6 వరకు శ్రీశైలం జలాశయం ఆధారంగా నిర్మాణంలో ఉన్న.. నిర్మించిన ప్రాజెక్టులను క్షేత్రస్థాయి అధ్యయనం చేయడం కోసం చేపట్టిన మా పర్యటన ఫలప్రదంగా సాగింది.
కర్నూలు నగరంలో సభ నిర్వహించి, విజయవంతంగా ముగించాం. మా ప్రతినిధి బృందంలో రిటైర్డ్ ఐపిఎస్ ఏ.బి. వెంకటేశ్వరరావు, రైతు సేవా సమితి అధ్యక్షులు అక్కినేని భవానీ ప్రసాద్, నదీ జలాలు, సాగునీటి ప్రాజెక్టుల రంగం విశ్లేషకులు టి. లక్ష్మీనారాయణ, నల్లమోతు చక్రవర్తి, జొన్నలగడ్డ రామారావు, ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సంస్థ అధ్యక్షులు కృష్ణమూర్తి నాయుడు ఉన్నారు.
వెలిగొండ మొదలుపెట్టి ముప్పయ్ ఏళ్ళు!
ఆగస్టు 4న పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ప్రధాన రిజర్వాయరు నల్లమలసాగర్ లో అతిపెద్దదైన గొట్టిపడియ భాగాన్ని, త్రాగునీటి పథకాన్ని దోర్నాల సమీపంలో నిర్మాణంలో ఉన్న రెండవ సొరంగాన్ని సందర్శించాం. ఈ పర్యటనలో మా బృందంతో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ప్రధాన కార్యదర్శి కెవివి ప్రసాద్, సిపిఐ మార్కాపురం ప్రాంత సీనియర్ నాయకులు అందే నాసరయ్య, చెన్నయ్య, విశాలాంధ్ర విలేకరి రమణ, సీనియర్ పాత్రికేయులు జీపి వెంకటేశ్వర్లు, తదితరులు కలిశారు.
నల్లమలసాగర్ రిజర్వాయరు నిర్మాణం వల్ల నిర్వాసితులైన రైతు ప్రతినిధులతో పాటు టి5 చానెల్ కింద అదనపు ఆయకట్టుకు ఉన్న అవకాశాలపై అధ్యయనం చేసి న్యాయం చేయమని డిమాండ్ చేస్తున్న రైతులను కలిసి, వారి అభిప్రాయాలను తెలుసుకున్నాం.
మార్కాపురం- దోర్నాల డివిజన్ ఆఫీసులకు వెళ్ళి సంబంధిత ఇంజనీరీంగ్ అధికారులతో మాట్లాడాం, మా పర్యటన ప్రాథమిక లక్ష్యాన్ని వారికి వివరించాం. మమ్మల్ని వేధిస్తున్న ప్రశ్నలను వారి దృష్టికి తీసుకెళ్లాం. వారి పరిధిలో సాధ్యమైనంత వరకు సమాధానాలను, వారికి అందుబాటులో ఉన్న సమాచారాన్ని అందజేశారు. నల్లమలసాగర్ మరియు నిర్మాణంలో ఉన్న సొరంగాల వద్ద సంబంధిత ఇంజనీర్స్ అందుబాటులో ఉండి వివరాలు తెలియజేశారు.
1983 అక్టోబర్ 10న ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో ఏం. ఎస్. నెం.409తో ఈ ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగింది. 1996 మార్చి 5న నేటి ముఖ్యమంత్రే నాడు ప్రాజెక్టుకు మార్కాపురం సమీపంలోని గొట్టిపడియ వద్ద శంఖుస్థాపన చేశారు. ముప్పైయ్ ఏళ్ళు గడచిపోతున్నాయి. దాదాపు రు.6,000 కోట్లు ప్రజాధనాన్ని ఖర్చు చేశారు. నిర్మాణం పూర్తి కాకుండానే 2024 మార్చి నెలలో నాటి ముఖ్యమంత్రి ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడచిపోయింది. 2026 జూన్, జూలై నాటికి మొదటి దశ నిర్మాణాన్ని పూర్తి చేసి 1,19,000 ఎకరాలకు నీరందిస్తామని ప్రభుత్వం చెబుతున్నది. కానీ అది సాధ్యం కాదు. మొదటి దశ నిర్మాణాన్ని పూర్తి చేయడానికి రు.2000 కోట్లకు పైగా ఇంకా వెచ్చించాల్సి ఉన్నదని అధికారులు తెలియజేశారు. పైగా పంట కాలువల నిర్మాణంపై దృష్టిసారించలేదు.
రెండో దశలోని 3,28,300 ఎకరాల ఆయకట్టుకు నీరందించడానికి వీలుగా నిర్మాణం పూర్తి చేయాలంటే మరో రు.2500 కోట్లు వ్యయం చేయాల్సి ఉంటుంది. ఆలస్యం అయ్యే కొద్దీ అంచనా వ్యయం పెరుగుతుంది. 1996లో అంచనా వ్యయం రు.978.96 కోట్లు.
అది కాస్తా ప్రస్తుతం రు.10,200 కోట్లకు హనుమంతుని తోకలా పెరిగిపోయింది. రు.8,043.85 కోట్లకు ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇచ్చింది. ఖర్చు చేసిన మొత్తానికి వడ్డీ లెక్కగట్టితే, లేదా, ద్రవ్యోల్బణం కోణంలో ఆలోచించినా వ్యయం చేసిన మొత్తం కనీసం రు.10,000 కోట్లు అవుతుంది.
ప్రకాశం జిల్లాలో అత్యంత వెనుకబడిన, కరవు పీడిత, ప్లోరైర్డ్ బాధిత ప్రాంతానికి సాగునీరు – త్రాగునీటిని అందించి, అభివృద్ధికి దోహదపడే ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని రెండేళ్లలో యుద్ధప్రాతిపదికన పూర్తి చేయడానికి అవసరమైన దాదాపు రు.5000 కోట్లను కేటాయించి, నిధులు విడుదల చేసి, అన్ని పనులు సమాంతరంగా చేస్తే, ఇప్పటి దాకా చేసిన ఖర్చుకు ఫలితం ఉంటుంది.
ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని 30 మండలాల్లో ఈ ప్రాజెక్టు కింద ప్రాతిపదిత మొత్తం ఆయకట్టు 4,47,300 ఎకరాలకు కాలువల ద్వారా నీరు అందించాలి. 15.25 లక్షల జనాభాకు త్రాగునీరు అందించాలి. తక్షణం ప్రథమ ప్రాధాన్యతనిచ్చి, వెయ్యి కోట్లు విడుదల చేసి, 11 గ్రామాల పరిధిలో ఉన్న 7,321 నల్లమలసాగర్ నిర్వాసిత కుటుంబాలకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం చెల్లించాల్సిన నష్టపరిహారం, ఎక్స్ గేషియా, నాణ్యమైన మౌలిక సదుపాయాలతో పునరావాస కాలనీల నిర్మాణం చేయాలి.
సొరంగాల నిర్మాణాన్ని పూర్తి చేయడానికి అవసరమయ్యే దాదాపు రు.150 కోట్లు విడుదల చేయడమే కాకుండా సొరంగాల నుండి నల్లమలసాగర్ లోకి నీటిని తీసుకువచ్చే ఫీడర్ కెనాల్ ను నాణ్యతా ప్రమాణాలతో నిర్మాణాన్ని పూర్తి చేయడానికి అవసరమైన దాదాపు రు.400 కోట్లను వెంటనే విడుదల చేయాలి. నల్లమలసాగర్ లో నీటిని నిల్వ చేయాలన్నా, ఇటీవల రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిన త్రాగునీటి పథకానికి నీటి సరఫరా కావాలన్నా ఈ పనులను యుద్ధప్రాతిపదికన చేయాలి.
‘పంజ్ పూల్’ మరమ్మత్తు ఎప్పుడు? శ్రీశైలం జలాశయం దిగువ భాగంలో పడిన లోతైన గొయ్యి (పంజ్ పూల్)పై తక్షణం ప్రభుత్వం దృష్టి సారించి, మరమ్మత్తు చేయాలని విజ్ఞప్తి చేయడంతో ఆగస్టు 5న మా పర్యటనను కొనసాగించాం. దీనికి సుమారు రు. 250 కోట్లు ఖర్చవుతుందని అంచనా. నేషనల్ డ్యామ్ సేప్టి అథారిటీ కూడా ఆందోళన వెలిబుచ్చింది.
శ్రీశైలం నుండి రోజుకు 10 టియంసిలు దోపిడీ చేస్తున్నారా?
శ్రీశైలం జలాశయం ఆధారంగా నంద్యాల జిల్లా పరిధిలో నిర్మించిన మరియు నిర్మాణంలో ఉన్న శ్రీశైలం కుడి బ్రాంచి కాలువ (ఎస్సార్బీసి ), తెలుగు గంగ, గాలేరు – నగరి సుజల స్రవంతి, కెసి కెనాల్ (పాక్షికంగా) మరియు చెన్నయ్ నగరానికి త్రాగునీటిని తరలించే పోతిరెడ్దిపాడు హెడ్ రెగ్యులేటర్, బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్, తెలుగు గంగ ద్వారా నంద్యాల జిల్లాలో సాగునీటిని అందించే వెలుగోడు రిజర్వాయరు, హంద్రీ – నీవా సుజల స్రవంతికి శ్రీశైలం జలాశయం నుండి నీటిని తరలించే మాల్యాల ,ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాలను సందర్శించాం.
మా ప్రతినిధి బృందానికి నంద్యాల జిల్లా నందికొట్కూరు వద్ద రాయలసీమ సాగునీటి సాధన సమితి, అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి , సాధన సమితి నాయకులు, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామాంజనేయులు మరియు జిల్లా కార్యదర్శి రంగనాయుడు నాయకత్వంలో తరలివచ్చిన సిపిఐ కార్యకర్తలు స్వాగతం పలికి, రెండు రోజుల పాటు మా పర్యటనలో భాగస్వాములైనారు.
తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బిఆర్ఎస్ నేతలు, తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ పదేపదే చేస్తున్న ఆరోపణల్లో ఉన్న వాస్తవమేమిటన్న అంశాన్ని కూడా ప్రత్యేకంగా దృష్టిలో ఉంచుకునే.. రాయలసీమ ప్రాజెక్టుల స్థితిగతులపై లోతైన అధ్యయనం చేశాం.
శ్రీశైలం జలాశయంలో దాదాపు గరిష్ట స్థాయిలో నీటి నిల్వ ఉన్న సమయంలో మేం సందర్శించాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి, ఆ సమావేశంలో చేసిన ఏకగ్రీవ తీర్మానం మేరకు పోతిరెడ్దిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం 11,574 క్యూసెక్కుల నుండి 44,000 క్యూసెక్కులకు విస్తరించబడింది. 35,000 క్యూసెక్కుల నీటిని గరిష్టంగా ఇప్పుడు తరలిస్తున్నట్లు ప్రభుత్వ గణాంకాలు తెలియజేస్తున్నాను.
అక్కడున్న అధికారులు అదే విషయాన్ని తెలియజేశారు. మేము కూడా అదే గమనించాం. ఆ నీటిని బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ నుండి ఎస్సార్బీసి, గండికోట రిజర్వాయరు (గాలేరు – నగరి కోసం నిర్మించిన రిజర్వాయరు)కు, తెలుగు గంగ ప్రాజెక్టు మరియు చెన్నయ్ త్రాగునీటి కోసం వెలుగోడు రిజర్వాయరుకు మరియు ఎస్ కేప్ చానెల్ ద్వారా కుందూ – పెన్నా నది ద్వారా సోమశిల రిజర్వాయరుకు విడుదల చేస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణవాదులు చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవి. వాళ్ళు ఆరోపిస్తున్నట్లు 92,600 క్యూసెక్కుల నీటిని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుండి తరలించే అవకాశమే లేదు. అక్కడ గతంలో నిర్మించిన నాలుగు పాత గేట్లు వినియోగించుకునే దశలో నేడు లేవు. అవి మూసేసి ఉన్నాయి. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ – బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ ను అనుసంధానం చేసే శ్రీశైలం ప్రధాన కుడి కాలువ ప్రస్తుత ప్రవాహ సామర్థ్యం 44,000 క్యూసెక్కులు. దాని గరిష్ట సామర్థ్యం మేరకు నేడు నీటిని తరలించలేక పోతున్నారు.
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సమీపంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రాంతానికి వెళ్ళి చూశాం. అక్కడ ఒక పెద్ద కందకం, దాని చివర్లో ఒక బావి మాత్రమే తవ్వబడి ఉన్నవి. దాన్ని తవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాదాపు రు.750 కోట్లు వ్యయం చేసిందని చెప్పబడుతున్నది. అంత పెద్ద మొత్తంలో ప్రజాధనాన్ని వృథా చేశారు.
ఆ పథకం నిర్మాణంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే విధించింది. పర్యసానంగా నిర్మాణం ఆగిపోయింది. కానీ, ఆ పథకం ద్వారా 37,500 క్యూసెక్కులను అక్రమంగా తరలించుకుపోతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ఆరోపణలు చేస్తున్నది. తెలంగాణ ప్రజల్లో విద్వేషాన్ని రెచ్చగొట్టడానికి అది ఉపయోగపడిందేగానీ, నిజానికి ఆ పథకం ద్వారా రాయలసీమ ప్రాజెక్టులకు నీటిని తరలించడం లేదు. రెండు రాష్ట్రాల మధ్య వివాదాన్ని రాజేయడానికే మాత్రమే అది దోహదపడింది.
ఇంకో రు.3,000 కోట్లు ఖర్చుచేసి, దాన్ని కొనసాగించాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు పత్రికల్లో వార్తలోచ్చాయి. ఆ ఆలోచన సరియైనది కాదు. ఇదే అభిప్రాయాన్ని రాయలసీమకు చెందిన ఒక ప్రముఖ రిటైర్డ్ ఇంజనీర్ కూడా బృందం సభ్యులతో వ్యక్తం చేశారు.
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ను 44,000 క్యూసెక్కుల సామర్థ్యంతో గరిష్ట స్థాయిలో వినియోగించుకోవడం ద్వారా రోజుకు నాలుగు టియంసిల చొప్పున 30 రోజుల్లో 120 టియంసిలు తరలిస్తే చాలు.
మల్యాల, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాలను చూశాం. జూలై 17న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మల్యాల వద్ద మోటార్లు ఆన్ చేసి వచ్చారు. అక్కడ 12 మోటార్లు ఉంటే మేము పోయినప్పుడు ఎనిమిది పంపుల ద్వారా 3,225 క్యూసెక్కుల నీటిని మాత్రమే ఎత్తిపోస్తున్నారు. మల్యాల ఎత్తిపోతల సామర్థ్యం 3,850 క్యూసెక్కులు.
శ్రీశైలం జలాశయం నిండుగా ఉన్నా ఉన్న సామర్థ్యం మేరకు నీటిని తరలించడం లేదు. కారణం, హంద్రీ – నీవా ప్రధాన కాలువ 3,850 క్యూసెక్కుల నీటిని తీసుకెళ్ళే స్థితిలో లేదు. రు.3800 కోట్లు ఖర్చు చేసి యుద్ధప్రాతిపదికన ప్రధాన కాలువ లైనింగ్, ఇతర నిర్మాణ పనులు పూర్తి చేశామని ప్రభుత్వం ప్రకటించినా, పూర్తి చేయలేదన్న వాస్తవాన్ని మల్యాల ఎత్తిపోతలకు సమీపంలోనే మార్గ మధ్యంలో లైనింగ్ చేయని భాగాలను గమనించాం.
మల్యాల ఎత్తిపోతల వద్ద పంపులు ఆపరేషన్ లో ఉన్న సమయంలో ముచ్చుమర్రి పంపులను వినియోగించరు. అందువల్ల మేము వెళ్ళినప్పుడు అవి ఆపరేషన్ లో లేవు. ముచ్చుమర్రి ఎత్తిపోతల సామర్థ్యం 3850 క్యూసెక్కులు కూడా లేదు. అన్ని పంపులను ఒకేసారి ఆపరేట్ చేయలేరు. కొన్నింటిని మెయింటెనెన్స్ కోసం ఆపి ఉంచాల్సి వస్తుంది. ఇవీ వాస్తవాలు.
ఇటీవల తెలంగాణా ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 92,600 క్యూసెక్కులు, రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా 32,722 క్యూసెక్కులు, మల్యాల ఎత్తిపోతల ద్వారా 6,300 క్యూసెక్కులు, ముచ్చుమర్రి ఎత్తిపోతల ద్వారా 6,300 క్యూసెక్కులు, కెసి కెనాల్ కు 1,000 క్యూసెక్కులు, వెలిగొండకు 11,500 క్యూసెక్కులు తరలించుకుపోవడానికి ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాలు కల్పించుకున్నారని అధికారులు పేర్కొనడం, రోజుకు 10 టియంసిల చొప్పున దోపిడీ చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించడం తీవ్ర గర్హనీయం.
వెళ్ళి చూస్తే అవి పచ్చి అబద్దాలని ఎవరికైనా బోధపడుతుంది. అందుకే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్దే బహిరంగ చర్చకు సిద్ధమని కూడా ఆలోచనాపరుల వేదిక ప్రకటించింది. కర్నూలులో ఎక్సిక్యూటివ్ ఇంజనీర్ ను కలిసినప్పుడు తెలంగాణా ఆరోపణలను గుర్తు చేసి, వాటిపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నిస్తే, సమాధానం చెప్పామన్నారే గానీ, సమాధానంలోని సారాంశాన్ని చెప్పమంటే మాత్రం చెప్పలేకపోయారు. తెలంగాణా ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మొదలుకొని అధికారుల వరకు ఎవ్వరూ స్పందించకపోవడం అత్యంత దురదృష్టం. ఎస్సార్బీసిని పూర్తి చేయడానికి రు.250 కోట్లు ఖర్చు చేయలేరా?
ఆగస్టు 6న ఎస్సార్బీసి ప్రధాన రిజర్వాయరు గోరకల్లును సందర్శించాం. అది నిర్మించి పట్టుమని పది సంవత్సరాలు కూడా కాలేదు. పూర్తి స్థాయి వినియోగంలోకి రాకముందే బలహీనంగా నిర్మించిన కట్ట లీకేజీ వల్ల కుంగింది. 12.5 టియంసిల సామర్థ్యంతో నిర్మించిన గోరకల్లు రిజర్వాయరులో 8 టియంసిల నిల్వకు పరిమితం చేశారు. రు.53 కోట్లతో మరమ్మత్తులు చేస్తామంటూ ప్రకటనలు చేస్తున్నారేగానీ పనులు మాత్రం చేపట్టలేదు.
1981లో కేంద్ర ప్రభుత్వం ఆమోదంతో మొదలు పెట్టిన ప్రాజెక్టు ఎస్సార్బీసి. 19 టియంసిల కృష్ణా నది నికర జలాల కేటాయింపుతో, కేంద్ర జల సంఘం ఆమోదంతో, ప్రపంచ బ్యాంకు ఋణంతో నిర్మించుకున్న ఈ ప్రాజెక్టు కింద ఉన్న 1,90,000 ఎకరాల్లో 1,50,000 ఎకరాలే సాగులోకి వచ్చింది. ఇంకా కడప జిల్లా జమ్మలమడుగు ప్రాంతంలో 40,000 ఎకరాలు సాగులేకే రాలేదు.
ఈ విషయాన్ని కర్నూలు ఎక్సిక్యూటివ్ ఇంజనీర్ కూడా ఒప్పుకున్నారు. దాదాపు రు.250 కోట్లు ఖర్చుపెట్టి మిగిలి ఉన్న నిర్మాణ పనులు పూర్తి చేస్తే ఆ భూములకు నీరందించవచ్చు. ఇది ప్రభుత్వానికి, ప్రజా ప్రతినిధులకు పట్టదు. కర్నూలు సర్కిల్ పరిధిలో రు.500 కోట్లు వెచ్చిస్తే ఎస్సార్బీసి, తెలుగు గంగ ప్రాజెక్టుల కింద నంద్యాల జిల్లాలో ఉన్న మొత్తం ఆయకట్టుకు సాగునీరు అందించవచ్చన్న అభిప్రాయం మా ప్రతినిధి బృందానికి కలిగింది.
ఈ మేరకు కూడా డబ్బు వెచ్చించలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదా? శ్రీశైలం జలాశయం నుండి వరద నీరు సముద్రంలోకి వెళుతున్న దృశ్యం చూశాం. అయినా, తెలుగు గంగ ప్రాజెక్టులో వెలుగోడు రిజర్వాయరు మాత్రమే నిండింది. దాంట్లో ఉన్న నీరు కూడా పూర్తిగా పొలాలకు పంపే దారి లేదు.
బ్రహ్మంగారి మఠం రిజర్వాయరులో ఆగస్టు 6 నాటికి 5.86 టియంసి నిల్వ ఉన్నది. వెలుగోడు నుండి చెన్నయ్ నగరానికి త్రాగునీరు, బి. మఠం ద్వారా కడప జిల్లాలో సాగునీరు అందించడానికి ప్రధాన కాలువను 5,000 క్యూసెక్కుల సామర్థ్యంతో నిర్మించారు. కానీ, నంద్యాల – కడప సరిహద్దులో 3,000 క్యూసెక్కులు కూడా వెళ్ళడం లేదు.
బి. మఠం రిజర్వాయరుకు కేవలం 650 క్యూసెక్కుల నీళ్ళు వెళుతున్నాయి. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుండి తరలిస్తున్న నీటిలో గణనీయమైన భాగం పెన్నా నదికి చేర్చి, సోమశిల రిజర్వాయరుకు పంపిస్తున్నారు. శ్రీశైలం జలాశయం వద్ద నిర్మించిన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద గేట్లు ఎత్తితే సహజ ప్రవాహం (గ్రావిటి) ద్వారా 16.5 కి.మీ. దూరంలో ఉన్న బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ కు కృష్ణా నీళ్ళు వస్తున్నాయి.
ఈ వాస్తవాన్ని మరుగుపరచి పోలవరం నుండి బనకచెర్లకు భారీ ఎత్తిపోతల ద్వారా సముద్ర మట్టానికి 40 మీటర్ల ఎత్తు నుండి ప్రతిపాదిత బొల్లాపల్లి రిజర్వాయరు తర్వాత +340 మీటర్ల మేర ఎత్తుకు నీటిని ఎత్తిపోసి, నల్లమల అడవుల్లో 26 కి. మీ. సొరంగ మార్గాన్ని, 23,000 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో తవ్వి, పోలవరం నుండి 400 కి.మీ. దూరంలో +265 మీటర్ల ఎత్తులో ఉన్న బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ కు చేర్చి, తెలుగు గంగ మరియు గాలేరు – నగరికి నీళ్ళిచ్చి, మిగిలిన నీటిని కుందూ నది ద్వారా పెన్నా నదికి చేర్చి, సముద్ర మట్టానికి 100 మీటర్ల ఎత్తులో ఉన్న సోమశిల రిజర్వాయరుకు చేర్చుతారట.
దాని కోసం 4500 మెగావాట్ల విద్యుత్తును వినియోగిస్తారట. ఈ పథకానికి అయ్యే నేటి వ్యయ అంచనా రు.82,000 కోట్లుగా ప్రభుత్వం వెల్లడించింది. నీరు ఎత్తిపోసి మళ్ళీ క్రిందకు ఎవరైనా పారబోస్తారా? ప్రజలు రాజకీయ అనుబంధాలకు అతీతంగా, హేతుబద్ధంగా ఆలోచించాలి. ఈ పథకం ప్రతిపాదనతో బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంక్రమించిన నీటి హక్కులకు ప్రమాదం ముంచుకోస్తున్నది. వాటిని పరిరక్షించుకోవడానికి ప్రజలు పూనుకోవాలని ఆలోచనాపరుల వేదిక విజ్ఞప్తి చేస్తున్నది.
మా పర్యటనలో భాగంగా కర్నూలులో ప్రముఖ రిటైర్డ్ ఇంజనీర్ సుబ్బరాయుడుని కలిశాం. రాయలసీమ నీటిపారుదల ప్రాజెక్టులపైన, ప్రతిపాదనల్లో ఉన్న గుండ్రేవుల రిజర్వాయరు, వేదవతి ఎత్తిపోతల పథకం, పోలవరం – బనకచెర్ల ఎత్తిపోతల పథకం, రాయలసీమ ఎత్తిపోతల పథకం, సిద్దేశ్వరం అలుగు ఆవశ్యకత, అలాగే, ఎస్.ఎల్.బి.సి. సొరంగం నిర్మాణంలో తలెత్తిన సమస్య, తదితర అంశాలపై వారికున్న అపారమైన అనుభవంతో అత్యంత విలువైన అభిప్రాయాలను మాతో పంచుకున్నారు.
“రాయలసీమ పెండింగ్ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన నిర్మించాలి – కృష్ణా నదీ జలాల హక్కులను పరిరక్షించాలి” అన్న డిమాండ్లతో కర్నూలు ఎస్.టి.యు. భవన్ లో నిర్వహించిన సభతో మా ప్రాజెక్టుల పర్యటన ముగిసింది. సభ నిర్వహరణకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సంపూర్ణ సహకారం అందజేసింది. పి. రామచంద్రయ్య, జగన్నాథం, సిపిఐ కర్నూలు జిల్లా కార్యదర్శి గిడ్డయ్య, తదితరులు ఈ కార్యక్రమంలో భాగస్వాములైన్నారు. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల సాధన సమితి, అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి, ఆ సంస్థ నాయకులు అన్ని చోట్ల ఏర్పాట్లు చేసి, మా బృందంలో భాగస్వాములై పర్యటనను విజయవంతం చేశారు.
క్షేత్రస్థాయి అధ్యయనంలో భాగంగా ఆయా ప్రాజెక్టుల నిర్మాణం మరియు నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తున్న ఇంజనీర్స్ తో కలిసి ప్రాజెక్టుల వివరాలను, ప్రస్తుత పరిస్థితిపై అధికారిక సమాచారాన్ని సేకరించుకోవడంతో పాటు ఆయా ప్రాజెక్టులు ఎప్పటికి పూర్తి అవుతాయి, పూర్తి స్థాయిలో ప్రతిపాదిత ఆయకట్టు భూములకు కాలువల ద్వారా సాగునీటిని అందించడానికి ఉన్న అవకాశాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించుకోవడానికి, అవగాహన పెంచుకోవడానికి, మరింత స్పష్టత కల్పించుకోవడానికి, మా ఆలోచనలకు పదును పెట్టడానికి ఈ పర్యటన ఎంతో దోహదపడింది.
మా మొదటి దశ అధ్యయనం మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి మేము సూచించేది:
(1) రు.82,000 కోట్ల చిత్తు లెక్కతో ప్రతిపాదిస్తున్న పోలవరం – బనకచెర్ల ప్రాజెక్టును విరమించుకోండి.
(2) ఇంకో రు.3000 కోట్లు వృధా అయ్యే, గత ప్రభుత్వం ప్రారంభించి, మెగా ఇంజనీరింగ్ కంపెనీ చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఇంతటితో ఆపేయ్యండి. దీనిపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే కూడా విధించింది. ఇప్పటికే ఖర్చు చేసిన రు. 750 కోట్లను రుషికొండ పద్దులో కలిపెయ్యండి.
(3) వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం ఇస్తామన్న ప్యాకేజీలో భాగంగా రు. 10,000 కోట్లు EAP ద్వారానో, మరొక విధంగానో తీసుకురండి. దాంతో రాయలసీమలోని అన్ని ప్రాజెక్టుల పనులూ, అఖరు ఎకరం దాకా సమాంతరంగా పరిగెత్తించి పూర్తి చేయండి. తద్వారా సుమారు 10 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చి, లక్ష కోట్లు సంపద, 10 లక్షల ఉపాధి సృష్టించిన వారవుతారు.
(4) ఈ రు.10,000 కోట్లు ఖర్చు చెయ్యడంలో ఆలస్యం జరిగే కొద్దీ ఇప్పటికే ఖర్చు చేసిన పదుల వేల కోట్లకు వడ్డీయే సాలీనా రు.10,000 కోట్లు నష్టం జరుగుతుంది.
(5) ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థికరణ చట్టం ప్రకారం కృష్ణా నది యాజమాన్య బోర్డుకు సాధికారత కల్పించి, అనుమతుల్లేని ప్రాజెక్టులను నిలువరించండి.
రాష్ట్రంలోని మిగిలిన ప్రాజెక్టులను కూడా సందర్శించి, అధ్యయనం చేసి, ప్రజలకు వివరాలు తెలియజేస్తాం. మా ప్రాజెక్టుల పర్యటనలో సహకరించిన ఇంజనీర్స్ మరియు మీడియా ప్రతినిధులకు, భాగస్వాములైన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల సాధన సమితి, ఇతర ప్రజా సంఘాలు, రైతాంగానికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
– టి. లక్ష్మీనారాయణ
(నదీ జలాలు, సాగునీటి ప్రాజెక్టుల రంగం విశ్లేషకులు)