– ఆలోచనాపరుల వేదిక
విజయవాడ: ప్రాజెక్టులు కాంట్రాక్టర్ల కోసం కాకుండా ప్రజల కోసం నిర్మించాలని ఆలోచనపరుల వేదిక ముఖ్యమంత్రికి సూచించింది. రాష్ట్రంలోని కీలక-పెండింగ్ ప్రాజెక్టులు, వాటికి పెట్టిన-పెడుతున్న ఖర్చులు-అందులో ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులపై అసెంబ్లీ చర్చించాలని శాసనసభ్యులను కోరింది.
ఆ మేరకు విజయవాడలో ఆలోచనాపరుల వేదిక నిర్వహించిన విలేకరులు సమావేశంలో సీఎం చంద్రబాబునాయుడుకు ఓ బహిరంగ లేఖ రాసింది. మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు, సాగునీటిరంగ నిపుణులు టి.లక్ష్మీనారాయణ, అక్కినేని భవానీ ప్రసాద్ నిర్వహించిన ఈ సమావేశంలో, రాష్ట్రంలోని ప్రాజెక్టుల స్ధితిగతులను చర్చించింది. ఆలోచనపరుల వేదిక సీఎంకు రాసిన బహిరంగ లేఖ పూర్తి పాఠమిది.
ఆల్మట్టి డ్యాం నుండి 173 టిఎంసిల కృష్ణా నది నికర జలాలను వినియోగించుకునే హక్కు బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం కర్ణాటక రాష్ట్రానికి ఉన్నది. ఆ మేరకు నీటిని వాడుకోవడానికి 519.60 మీటర్ల ఎత్తు వరకు కేంద్ర జల సంఘం అనుమతితో ఆల్మట్టి డ్యాంను నిర్మించుకోవడానికి సుప్రీం కోర్టు అనుమతించింది. 519.60 మీటర్ల ఎత్తు వరకు నీటిని నిల్వ చేసి వినియోగించుకుంటున్నారు.
కానీ, ఆల్మట్టి డ్యాంను 524.256 మీటర్ల ఎత్తుతో నిర్మించారు. ఇప్పుడు నీటిని గరిష్ఠ స్థాయిలో నిల్వ చేసి 303 టీఎంసీలను వాడుకోవడానికి వీలుగా రు.70,000 కోట్లు వెచ్చించి, భూసేకరణ మరియు కాలువల నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టడానికి కర్ణాటక మంత్రివర్గం సెప్టెంబర్ 16న ప్రత్యేకంగా సమావేశమై నిర్ణయం తీసుకున్నది.
తెలంగాణ ప్రభుత్వం 372 టీఎంసీల వినియోగ సామర్థ్యంతో 16 ప్రాజెక్టుల నిర్మాణానికి సమగ్ర అధ్యయన నివేదిక (డిపియర్)లను వెంటనే రూపొందించమని అధికారులను ఆదేశిస్తూ ఏకంగా జీవో యం.ఎస్. నం.34ను సెప్టెంబరు 16న జారీ చేసింది.
అందులో జూరాల వరద ప్రవాహ కాలువ ద్వారా రోజుకు 2 టిఎంసిల చొప్పున 100 టీఎంసీల కృష్ణా జలాలను తరలించి, కొత్తగా నిర్మించబోయే జలాశయాలు మరియు చెరువులతో అనుసంధానించడం ద్వారా పూర్వపు మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్ మరియు ఖమ్మం జిల్లాల్లోని 11.30 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నారు.
మరో 123 టిఎంసిలను జూరాల జలాశయం నుండి తరలించడానికి కోయిల్కొండ – గండీడ్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని చేపట్టి మహబూబ్ నగర్ జిల్లాలో సాగునీటిని అందించడానికి కోయిల్కొండ జలాశయం (45 టిఎంసి), గండీడ్ జలాశయం (35 టిఎంసి) మరియు దౌల్తాబాద్ జలాశయం (43 టిఎంసి)లను నిర్మిస్తారట. అలాగే, ఎస్.ఎల్.బి.సి., కల్వకుర్తి, నెట్టంపాడు మరియు కోయిలసాగర్ విస్తరణ పథకాలు ఉన్నాయి.
కృష్ణా నదిలో 75% నీటి లభ్యత ప్రామాణికంగా 2060 టిఎంసిలు, అదనంగా పునరుత్పత్తి జలాలు 70 టిఎంసిలు, మొత్తం 2130 టీఎంసీల నికర జలాలు లభిస్తాయని మొదటి కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్/ బచావత్ ట్రిబ్యునల్ నిర్ధారించి, బేసిన్ లో ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య పంపిణీ చేసింది.
ఆ తీర్పు 1976 మే 31 నుండి అమలులో ఉన్నది. దాని ప్రకారం ఆల్మట్టి డ్యాం వద్ద 173 టీఎంసీలను వాడుకోవడానికి వీలుగా 519.60 మీటర్ల ఎత్తుతో ఆల్మట్టి డ్యాంను నిర్మించుకోవడానికి కేంద్ర జల సంఘం ఆమోదించింది. అలాగే, కేంద్ర ప్రభుత్వం నియమించిన జ్యోతిబసు కమిటీ సిఫార్సు చేసింది. సుప్రీం కోర్టు కూడా ఆ మేరకే తీర్పు ఇచ్చింది.
2000 మే 31న బచావత్ ట్రిబ్యునల్ తీర్పు గడువు ముగిసింది. కొత్త ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేయాలని కర్ణాటక, మహారాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. నాడు ఆంధ్రప్రదేశ్ కూడా అంగీకరించింది. కేంద్ర ప్రభుత్వం రెండవ కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్/ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ను 2004లో ఏర్పాటు చేసింది. ఆ ట్రిబ్యునల్ 2010లో కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.
మిగులు జలాలను వాడుకునే స్వేచ్ఛను బచావత్ ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్ కు కల్పిస్తే, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఆ స్వేచ్ఛను హరించింది. 65% ప్రామాణికంగాను మరియు సగటు (55%) లభ్యత ఆధారంగా నీటిని లెక్కగట్టి మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు పంచేసింది. కర్ణాటకకు అదనంగా కేటాయించిన నీటితో కలిపి 303 టీఎంసీలను వినియోగించుకోవడానికి వీలుగా ఆల్మట్టి డ్యాం ఎత్తును 524.256 మీటర్లకు పెంచుకోవడానికి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అనుమతించింది.
ఆ తీర్పు తెలుగు ప్రజలకు శరాఘాతంగా భావించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది. పర్యవసానంగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమలులోకి రాలేదు. బచావత్ ట్రిబ్యునల్ తీర్పే నేటికి అమలులో ఉన్నది. కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాలు బచావత్ ట్రిబ్యునల్ తీర్పును ఉల్లంఘిస్తూ, అక్రమంగా పలు ప్రాజెక్టులను నిర్మించుకుంటున్నాయి.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థికరణ చట్టంలోని షెడ్యూల్ 11(10) జాబితాలో ఉన్న తెలుగు గంగ, హంద్రీ – నీవా, గాలేరు – నగరి, వెలిగొండ, కల్వకుర్తి, నెట్టంపాడు మినహా కొత్త ప్రాజెక్టుల నిర్మాణాన్ని కృష్ణా నది యాజమాన్య బోర్డు సిఫార్సు మరియు అపెక్స్ కౌన్సిల్ ఆమోదం, కేంద్ర జల సంఘం ఆమోదం లేకుండా చేపట్టడానికి వీల్లేదు.
తెలంగాణ ప్రభుత్వం చట్టాన్ని ఉల్లంఘించి పాలమూరు – రంగారెడ్డి మరియు డిండి ఎత్తిపోతల పథకాలను 120 టీఎంసీల వినియోగ సామర్థ్యంతో నిర్మిస్తున్నది. తాజాగా 300 టిఎంసిలకుపైగా అక్రమ వినియోగానికి పథకాల డిపియర్ లు రూపొందించే పనిలో ఉన్నది.
ఈ విషయాలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు తెలియదా! “మీరు ప్రాజెక్టులు నిర్మించుకోండి, మేము నిర్మించుకుంటాం”, అంటూ ముఖ్యమంత్రి పదేపదే వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వైఖరి ఆంధ్రప్రదేశ్ ను నిండా ముంచుతుంది. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు తీసుకున్న నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్ నీటి హక్కులకు శరాఘాతంగా పరిణమిస్తున్నాయి.
మన రాష్ట్రం కృష్ణా నది బేసిన్ లో చివరలో ఉన్నది. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు ఎగువన ఉన్నాయి. నేడు అమలులో ఉన్న బచావత్ ట్రిబ్యునల్ తీర్పును ఉల్లంఘంచి కృష్ణా జలాలను పై రాష్ట్రాలు అక్రమంగా వాడుకోవడానికి దూకుడుగా వ్యవహరిస్తుంటే మన రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం అత్యంత గర్హనీయం. రాష్ట్రానికి శాశ్వతంగా కోలుకోలేని నష్టం సంభవించే ప్రమాదం ముంచుకొస్తున్నా కూటమి ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉన్నదో బోధపడడం లేదు.
ప్రస్తుతం శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. జలవనరుల అంశంపై ముఖ్యమంత్రి శాసనసభలో ప్రసంగించారు. కానీ, ఈ అంశాలను మాట వరసకు కూడా ప్రస్తావించకపోవడం ఆశ్చర్యం కలిగించింది.
కృష్ణా, గోదావరి నదీ జలాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హక్కులను పరిరక్షించడానికి శాసనసభలో సమగ్రంగా చర్చించి, కర్ణాటక మరియు తెలంగాణ అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాన్ని మరియు నదీ జలాల అక్రమ వినియోగాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ తీర్మానం చేసి, కేంద్ర జలశక్తి మంత్రికి, కేంద్ర జల సంఘానికి తక్షణం పంపాలని డిమాండ్ చేస్తున్నాం.
ఏబి వెంకటేశ్వరరావు, 7569691530
అక్కినేని భవానీ ప్రసాద్, 9493799969
టి. లక్ష్మీనారాయణ, 9490952221