– ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్: ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కెసీఆర్ రీడిజైనింగ్ పేరుతో మార్పులు చేసి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు నిర్మించారు.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగిన మూడేళ్లల్లోనే మేడిగడ్డ కుంగడం, అన్నారం పగిలిపోయాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఆయన సోమవారం విలేఖర్లతో మాట్లాడారు. ప్రణాళిక, నిర్మాణ, నిర్వహణ లోపాలు ఉన్నాయని ఆనాడు కెసీఆర్ కు నిపుణులు నివేదిక అందించారు. లక్ష కోట్లుపెట్టి కట్టిన కాళేశ్వరం కూలిపోవడంపై.. అధికారంలోకి వచ్చిన వెంటనే విచారణ చేపడతామని ప్రజలకు ఆనాడు మాట ఇచ్చాం.. ఇచ్చిన మాట ప్రకారం 2023 మార్చి 14న అపార అనుభవం ఉన్న పీసీ ఘోష్ చైర్మన్ గా జ్యుడీషియల్ ఎంక్వైరీ కమిషన్ నియమించాం.
16 నెలల తరువాత జూలై 31న 665పేజీల నివేదికను పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి అందించింది. నివేదిక సారాంశాన్ని తయారు చేసి కేబినెట్ కు అందించాలని ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశాం.
ఊరు మార్చి, పేరు మార్చి అక్రమాలకు పునాదులు వేసి నిర్మించిన కాళేశ్వరం కూలిపోయింది. పీసీ ఘోష్ కమిషన్ నివేదికను కేబినెట్ లో ఆమోదించాం. రాబోయే రోజుల్లో అసెంబ్లీలో ఈ నివేదికను ప్రవేశపెట్టి అందరి అభిప్రాయాలను తీసుకుంటాం. త్వరలో అసెంబ్లీలో ప్రవేశపెట్టి అందరి అభిప్రాయాల ప్రకారం ప్రభుత్వం ముందుకు వెళుతుంది.
బీఆరెస్ కమిషన్ ఈ రిపోర్టును తప్పుపట్టడం సహజమే… నివేదిక వారికి అనుకూలంగా ఉంటే ఒకలా.. లేకపోతే మరోలా మాట్లాడటం వారికి అలవాటే… కమిషన్ నివేదికలో ఎలాంటి రాజకీయ జోక్యం లేదు. ఇది ఇండిపెండెంట్ జ్యుడీషియల్ కమిషన్ ఇచ్చిన నివేదిక. నివేదిక సారాంశం, అందరి సూచనల ప్రకారమే చర్యలు ఉంటాయి. రాజకీయ కక్ష పూరిత చర్యలకు పాల్పడం. నివేదికపై అందరి అభిప్రాయాలు తీసుకుని ముందుకెళతాం.