– 11 మంది జూనియర్ ప్రిన్సిపాళ్లకు పదోన్నతులు – సీనియర్ ప్రిన్సిపాళ్లగా నియామకం – మంత్రి సవిత కృషితో ప్రమోషన్లకు లైన్ క్లియర్ – ఎంజేపీ ఉద్యోగ సంఘాల ప్రతినిధుల హర్షం
అమరావతి : ఎంజేపీ గురుకులాల్లో ప్రమోషన్ల సందడి నెలకొంది. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత చొరవతో పదోన్నతులకు లైన్ క్లియర్ అయింది. దీంతో 11 మంది జూనియర్ ప్రిన్సిపాళ్లకు సీనియర్ ప్రిన్సిపాళ్లగా పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎంజేపీ గురుకుల పాఠశాలల్లో పదోన్నతుల కోసం జూనియర్ ప్రిన్సిపాళ్లు కొన్నేళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో పదోన్నతులపై వారి ఆశలు చిగురించాయి. ఇదే విషయమై మంత్రి సవిత దృష్టికి ఎంజేపీ గురుకులాల ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తీసుకొచ్చారు.
ఇన్చార్జిలతో గురుకులాల నిర్వహణ వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని మంత్రికి వివరించారు. మంత్రి సవిత వెంటనే స్పందించి, గురుకుల పాఠశాలల్లో పదోన్నతుల చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాలు నేపధ్యంలో 11 మంది జూనియర్ ప్రిన్సిపాళ్లకు సీనియర్ ప్రిన్సిపాళ్లగా పదోన్నతులు కల్పిస్తూ ఎంజేపీ గురుకులాల కార్యదర్శి మాధవీలత ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న ప్రమోషన్లు రావడంతో జూనియర్ ప్రిన్సిపాళ్లు, ఎంజేపీ గురుకులాల ఉద్యోగ సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తంచేశారు.