Suryaa.co.in

Telangana

ప్రపంచ స్థాయి వేదికపై తెలంగాణ టూరిజం ప్రమోషన్

– ఐఎమ్ఇఎక్స్ అమెరికా 2024 ట్రేడ్ షో లో తెలంగాణ టూరిజం స్టాల్ ఏర్పాటు
– పాల్గొన్న ప‌ర్యాట‌క శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు

లాస్ వెగాస్‌లోని మాండలే బేలో నిర్వ‌హించిన “IMEX అమెరికా 2024” ట్రేడ్ షో లో తెలంగాణ ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణ‌రావు పాల్గొన్నారు. ప్ర‌పంచ‌ స్థాయి వేదిక‌పై ఏర్పాటు చేసిన తెలంగాణ టూరిజం స్టాల్ ను మంత్రి జూప‌ల్లి ప్రారంభించారు.
తెలంగాణ.. శతాబ్దాల ఘనమైన చరిత్ర‌, వారసత్వం, సుసంపన్న సంస్కృతి, ప్ర‌కృతి ర‌మణీయ‌త‌, పర్యాటక ప్రాంతాల గురించి స్థానిక మీడియా, ట్రావెల్ సొల్యూషన్స్ ప్రతినిధులు, తెలుగు అసోసియేషన్ సభ్యులతో చర్చించారు.

విశ్వ‌న‌గ‌ర‌మైన‌ హైదరాబాదు “భారతదేశం యొక్క సదస్సుల రాజధానిగా” అంత‌ర్జాతీయ సద‌స్సుల‌కువేదిక‌గా, ప్రపంచ స్థాయి పెట్టుబడులకు కేంద్ర బిందువు గా మారింద‌ని, ప‌ర్యాట‌క‌, వినోదం, వ్యాపార‌, ఐటీ, హెల్త్, ఫార్మా రంగాల్లో అత్యుత్త‌మ గ‌మ్య‌స్థానంగా నిలుస్తుంద‌ని చెప్పారు. ప్రగతిశీల విధానాల‌తో త‌మ ప్ర‌భుత్వం పెట్టుబడులను ప్రోత్సహించ‌డంతో పాటు పర్యాటక రంగంలో భాగ‌స్వాముల‌ సహకారంపై దృష్టి పెట్టామ‌ని పేర్కొన్నారు.

వాణిజ్య ప్ర‌ద‌ర్శ‌న‌లో ఏర్పాటు చేసిన విదేశీ స్టాళ్ల‌ను మంత్రి జూప‌ల్లి సంద‌ర్శించారు. కొత్త అనుభూతులు, అన్వేషించని ప్రదేశాలను చూడాలని కోరుకునే నేటి తరం పర్యాటకులకు స్వాగతం పలికేందుకు తెలంగాణ రాష్ట్రం సిద్దంగా ఉందని, ఘనమైన వారసత్వ సంపదతో అలరారుతున్న తెలంగాణ రాష్ట్రంలో ప‌ర్య‌టించాల‌ని ఆయా దేశాల ప్ర‌తినిధుల‌కు మంత్రి జూప‌ల్లి ఆహ్వానం ప‌లికారు. భారతదేశం నుండి వ‌చ్చిన అతి కొద్దిమందిలో ఒక తెలంగాణ ప్ర‌తినిధిగా ఈ ట్రేడ్ షోలో పాల్గొన‌డం సంతోషంగా ఉంద‌న్నారు.

ఈ కార్యక్రమానికి తెలంగాణ పర్యాటక అభివృద్ది సంస్థ‌ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. ప్రకాష్ రెడ్డి, పర్యాటక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డి.ఎస్. ఓంప్రకాశ్, టిఎస్టిడిసి మార్కెటింగ్ జిఎం కె. అంజి రెడ్డి, హెచ్సీవిబి (HCVB) సిఇఓ గ్యారీ ఖాన్, హైటెక్స్, మీటీ, నాంధారి ఈవెంట్స్ నుండి సహ ప్రదర్శకులు హాజరయ్యారు.

LEAVE A RESPONSE