Suryaa.co.in

Telangana

టీజీఐఐసి భూములు పరిరక్షించండి

– మంత్రి శ్రీధర్ బాబు

వరంగల్: తెలంగాణా పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ భూములను ఆక్రమణల నుంచి పరిరక్షించుకోవాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు. సంస్థ భూములను ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుని స్వాధీనం చేసుకోవాలని సూచించారు.

పరిశ్రమల పేరుతో భూములు పొంది తర్వాత వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న వారిని గుర్తించి అపరాధ రుసం వసూలు చేయాలని అన్నారు. జిల్లాల వారిగా సంస్థకున్న ఖాళీ భూములను కాపాడేందుకు కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ కార్యాలయాన్ని గురువారం నాడు మంత్రి ఆకస్మిక తనిఖీ చేశారు.

కార్యాలయంలో సిబ్బంది పనిచేసేందుకు సరైన కుర్చీలు కూడా లేకపోవడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేసారు. నెల రోజుల వ్యవధిలో ఆఫీసును ఆధునీకరించి కనీస సౌకర్యాలు కల్పించాలని జోనల్ మేనేజర్ స్వామిని ఆదేశించారు. వరంగల్ జిల్లాలో పరిశ్రమలకు రాయితీ ధరపై కేటాయించిన రాంపూర్, మడికొండ పారిశ్రామిక వాడల్లో వాణిజ్య కార్యకలాపాలు జరుగుతుండడం పట్ల శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

తక్షణం సర్వే చేసి కమర్షియల్ వినియోగినానికి మార్చిన భూములను గుర్తించాలని ఆదేశించారు. కేటాయింపులు పొందిన వారి నుంచి నిబంధనల ప్రకారం రోడ్ల వెడల్పును బట్టి 20%, 50% పెనాల్టీని వసూలు చేయాలని సూచించారు.

అన్ని జిల్లాల్లో ఐటీ పార్కులు
సాఫ్ట్ వేర్ పరిశ్రమలన్నీ హైదరాబాద్ లోనే కేంద్రీకృతం కాకుండా జిల్లాలకు తరలివెళ్తే భవనాలతో పాటు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని శ్రీధర్ బాబు వెల్లడించారు. హన్మకొండలోని కాకతీయ సాఫ్ట్ వేర్ టెక్నాలజి పార్క్ ను ఆయన సందర్శించారు.

ప్రస్తుతం అందులో ఆరు సాప్ట్ వేర్ కంపెనీలు పనిచేస్తున్నాయని, మరో రెండు నెలల్లో 8 సంస్థలు కార్యకలాపాలు సాగించేందుకు సంప్రదింపులు జరుపుతున్నాయని ఆయన వెల్లడించారు. ఐటీ పార్క్ లో 64 సీట్ల ప్లగ్ అండ్ ప్లే సౌకర్యం ఉండగా సగం సీట్లను సాఫ్ట్ వేర్, యానిమేషన్ సంస్థలు లీజుకు తీసుకున్నట్టు తెలిపారు. ఎన్ ఆర్ ఐలు, ప్రధాన ఐటీ కంపెనీలు జిల్లాల్లో ప్రాంతీయ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.

ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఐటీ పార్కుల ఏర్పాటుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వివరించారు. దీని వల్ల స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు. మంత్రి శ్రీధర్ బాబు తో పాటు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కూడా తనిఖీల్లో పాల్గొన్నారు

LEAVE A RESPONSE