Suryaa.co.in

Andhra Pradesh

ఫోన్‌ ట్యాపింగ్‌ నుంచి రక్షణ కల్పించాలి

-డేటా ప్రొటెక్షన్‌ బిల్లుపై చర్చలో విజయసాయి రెడ్డి

న్యూఢిల్లీ, ఆగస్టు 9: ఫోన్‌ ట్యాపింగ్‌ ద్వారా మొబైల్‌ ఫోన్‌ వినియోగదారులకు సంబంధించిన డేటాను తస్కరించే చర్యల నుంచి రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని రాజ్యసభలో బుధవారం వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఇటీవల కాలంలో ఫోన్‌ ట్యాపింగ్‌ ఉదంతాలు అనేకం వెలుగుచూస్తున్న నేపధ్యంలో దీనిని అరికట్టేందుకు పటిష్టమైన చర్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు.

డేటా ప్రొటెక్షన్‌ బిల్లుపై బుధవారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ ఒక వ్యక్తి మొబైల్‌ ఫోన్‌ను ట్యాప్‌ చేయాలంటే సర్వీసు ప్రొవైడర్‌ లేదా మొబైల్‌ టవర్‌ సహాయం అవసరం లేకుండా మొబైల్‌ ఫోన్‌లోని స్పీకర్‌, కెమేరా ద్వారా సంభాషణలను ట్యాప్‌ చేయడం, ఆ ఫోన్‌లోని డేటాను తస్కరించే సామర్ధ్యంతో అనేక విదేశీ కంపెనీలు సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చాయని చెప్పారు.

ఇలాంటివి దాదాపు 15 నుంచి 20 రకాల సాఫ్ట్‌వేర్‌లు మార్కెట్లో ఉన్నాయని అన్నారు. సాఫ్ట్‌వేర్‌ ద్వారా మొబైల్‌ ఫోన్‌ను ఎలా ట్యాప్‌ చేయవచ్చో, డేటాను ఎలా తస్కరించచ్చో తాను ప్రత్యక్షంగా పరిశీలించాలనని ఆయన చెప్పారు. మొబైల్‌ ఫోన్‌లోని వాట్సాప్‌, ఫేస్‌టైమ్‌, టెలిగ్రామ్, సిగ్నల్‌ వంటి యాప్‌ల ద్వారా జరిగే సంభాషణలను సైతం ఎలా ట్యాప్‌ చేయవచ్చో ఒక విదేశీ కంపెనీ ఇచ్చిన డెమోను తాను ప్రత్యక్షంగా వీక్షించానని చెప్పారు.

ఈ సాఫ్ట్‌వేర్‌ ద్వారా తమ రాజకీయ ప్రత్యర్ధుల ఫోన్‌లను బగ్‌ చేసి వారి సంభాషణలను ట్యాప్‌ చేసే అవకాశం ఉంది. గతంలో ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ఈ తరహా ఫోన్‌ ట్యాపింగ్‌ కార్యకలాపాలకు పాల్పడిందని ఆయన అన్నారు.

అయితే ఫోన్‌ ట్యాపింగ్‌ సాఫ్ట్‌వేర్‌ను కేవలం ప్రభుత్వాలకు, ప్రభుత్వ విభాగాల వినియోగానికి మాత్రమే విక్రయించాలన్న షరతు ఉంది. ఈ సాఫ్ట్‌వేర్‌ 50 నుంచి 100 కోట్ల రూపాయలకు విక్రయిస్తారు. వార్షిక నిర్వహణ కోసం ఆ మొత్తంలో 20 శాతం చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని ప్రైవేట్‌ సంస్థలు ఈ సాఫ్ట్‌వేర్‌ను అక్రమంగా సంపాదించి ఫోన్‌ ట్యాపింగ్‌కు వినియోగిస్తున్నాయి.

ప్రభుత్వాలు లేదా ప్రభుత్వ విభాగాలు వినియోగించే ఈ సాఫ్ట్‌వేర్‌ను కొన్ని ప్రైవేట్‌ సంస్థలు చేజిక్కించుకుని దుర్వినియోగానికి పాల్పడటం ఆందోళనకరమని ఆయన అన్నారు. ఈ విధంగా ఫోన్‌ ట్యాపింగ్‌ ద్వారా జరిగే డేటా చౌర్యాన్ని నిరోధించేందుకు, అక్రమార్కుల ఆగడాలకు చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని విజయసాయి రెడ్డి కోరారు.

LEAVE A RESPONSE