ముంబై నటి జెత్వానీ కేసును తలపిస్తున్న వైనం! దొంగ దగ్గర ఆస్తులు కొట్టేసి రాజీ చేసుకోవడానికి… చార్జ్‌షీట్‌లో 11-06-2022 ‘టైమ్ ట్రావెల్’ బ్లండర్‌తో బట్టబయలైన కక్ష సాధింపు!
భక్తులు సమర్పించుకునే శ్రీవారి కానుకలను దొంగిలించిన గుమస్తా సి.వి. రవికుమార్ కేసు… నాటి వైఎస్సార్సీపీ ప్రభుత్వ కనుసన్నల్లో జరిగిన వాటాల రాజీ నాటకంగా మారింది. దొంగను కాపాడి, కుంభకోణాన్ని కప్పిపుచ్చేందుకు, నిజం చెప్పాలనుకున్న ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ రాజు, అతని బృందంపై జరిగిన నాటి అధికార దుర్వినియోగ దాడిని… పోలీసు రికార్డుల్లోని తప్పుల తడకల తేదీలు, సంఘటనల పరిణామాల వేగమే స్పష్టం చేస్తున్నాయి.
2023, ఏప్రిల్ 29న పరకామణిలో విదేశీ కరెన్సీ దొంగలిస్తూ రవికుమార్ పట్టుబడ్డాడు. కానీ, నిందితుడికి అదే రోజు అత్యంత వేగంగా స్టేషన్ బెయిల్ మంజూరు కావడం అనుమానం కలిగింది. ఈ బెయిల్ వెనుక రాజకీయ బేరసారాలు ఉన్నాయని, రవికుమార్ తన అక్రమ ఆస్తులను లోక్ అదాలత్ రాజీ పేరుతో కొసరుగా టీటీడీకి అప్పగిస్తూ… అందులో అసలు భాగాన్ని నాటి వైకాపా అధికార పార్టీ పెద్దలకు లబ్ధి చేకూరుస్తున్నారనే సమాచారం ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ రాజుకు అందింది. ఆ విషయాలను త్రవ్వడం మొదలెట్టాడు. తెలిసిన షాకింగ్ విషయాలతో ఒక ప్రోమో వదిలాడు.
ఉలిక్కిపడ్డ కొండమీది వైకాపా దొంగల ముఠా, కుంభకోణంపై వార్తలు ప్రసారం కాకుండా ఆపడమే లక్ష్యంగా కుట్రపన్ని, దొంగ రవికుమార్ భార్యను పావుగా వాడుకుంది.
జర్నలిస్ట్ రాజును ట్రాప్ చేసి, అతని గొంతును నొక్కడానికి 02-07-2023 న అత్యంత వేగంతో కుట్ర అమలు చేశారు:
ఉదయం 9:59 గంటలు: పరకామణి దొంగ రవికుమార్ తరఫు నుంచి రాజు అనే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అకౌంట్‌కు ₹10,000 అనధికారికంగా బదిలీ అయ్యింది.
ఈ డబ్బు పడగానే రాజు… వెంటనే రవికుమార్‌కు ఫోన్ చేసి, “నాకు డబ్బు ఎందుకు పంపించారు? నేను మీ మీద కేసు పెడతా” అంటూ తీవ్రంగా హెచ్చరించాడు. దీనికి భయపడిన రవికుమార్… “తప్పు జరిగిపోయింది, నన్ను కాపాడండి” అంటూ ప్రాధేయపడ్డాడు. రాజు తన వివరణ ఇవ్వడానికి వస్తే, నిష్పాక్షికంగా ప్రసారం చేస్తామని చెప్పి, డబ్బు పంపమని ఎవరు అడిగారని గట్టిగా నిలదీశాడు.
ఉదయం 10:40 గంటలు: రాజు హెచ్చరించిన కేవలం 41 నిమిషాలలోనే, దొంగ రవికుమార్ భార్య… జర్నలిస్టుపై ఎక్స్టార్షన్ కేసు (Cr. No. 90/2023) ను తిరుమల II టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదు చేసింది.
ఉదయం 11:00 గంటలు: ఎఫ్ఐఆర్ కాపీ స్టేషన్లో ఉన్నప్పటికీ, తిరుపతిలోని రవికుమార్ ఇంటి వద్ద లైవ్‌కి సిద్ధంగా ఉన్న రాజును, అతనితో పాటు ఉన్న రిపోర్టర్ సునీల్, కెమెరామెన్ బాలూలను అక్కడికక్కడే అరెస్ట్ చేశారు. తదనంతరం తిరుపతి టౌన్ రిపోర్టర్ వెంకటరత్నం పేరును కూడా ఈ కేసులో చేర్చారు.
వైఎస్సార్సీపీ ట్రోలింగ్: అరెస్ట్ అయిన జర్నలిస్టులను పోలీస్ వాహనంలో తిరుమలకు తీసుకు వెళ్లేలోగానే… వారి ఫోటోలతో కూడిన ‘మీడియా ముసుగులో దందాలు’ అంటూ వైఎస్సార్సీపీ సోషల్ మీడియా పెంపుడు బ్యాచులు, వారికే తెలియకుండా ఆ పాపంలో పావులై, ట్రోల్స్‌ను ప్రారంభించాయి. ఈ కుట్ర, దాడి… మొత్తం వ్యవహారం ప్రభుత్వ కనుసన్నల్లో, ఒక పకడ్బందీ ప్రణాళికతో జరిగిందని రుజువు చేసింది.
కుట్రను పట్టించిన 11-06-2022 ‘తేదీ తప్పిదం’!
ఈ కక్ష సాధింపులో ఘోరమైన తప్పిదం… పోలీసుల చార్జ్ షీట్లో దొరికిన అసాధ్యమైన తేదీ.
పోలీసు రికార్డు ప్రకారం, ఈ ఎక్స్టార్షన్ కేసులో కీలక సాక్షులను దర్యాప్తు అధికారి 11-06-2022 న విచారించారు.
చట్టాన్ని ఉల్లంఘించిన తేదీ: కేసు నమోదు (02-07-2023) కంటే ఈ తేదీ ఒక సంవత్సరం, 21 రోజులు ముందు ఉంది. అంతేకాదు, రవికుమార్ దొంగతనం చేసిన తేదీ (ఏప్రిల్ 29, 2023) కంటే కూడా ఇది పది నెలలు ముందుంది.
దొంగతనం జరగకముందే, దానిపై ఎక్స్టార్షన్ కేసు గురించి పోలీసులు విచారణ చేయడం చట్టవిరుద్ధం. రాజకీయ పెద్దల ఆస్తుల వ్యవహారం బయటపడకూడదనే ఏకైక లక్ష్యంతో రాత్రికి రాత్రే తప్పుల తడకతో కూడిన రికార్డులను సృష్టించే క్రమంలో ఈ ‘టైమ్ ట్రావెల్’ బ్లండర్ బయటపడింది.
తిరుమల పవిత్రతను కాపాడటానికి బదులు… దొంగను కాపాడి, జర్నలిస్టును అరెస్ట్ చేసి, వ్యవస్థను దుర్వినియోగం చేసిన వైఎస్సార్సీపీ ప్రభుత్వ వైఖరికి ఈ తేదీ, నిమిషాల వ్యవధిలో జరిగిన అరెస్ట్‌లే తిరుగులేని సాక్ష్యాలు. దొంగకు రక్షణ, నిజం చెప్పే గొంతుకకు సంకెళ్లు… ఇదే నాటి జగన్ అరాచక పాలన విధానం.
ఫిర్యాదు చేసిన నాటి విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్‌ను ఇటీవలే హత్య చేశారు. జగన్ చెప్పినట్లు చాలా చిన్న చోరీ కాదు. వైకాపా పాపాల పుట్ట పగిలింది. కలియుగ వైకుంఠంలో చేసిన మహాపరాధాలు, ఆనాటి అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ధైర్యం చేసి ఆ నాడు తమను అక్రమంగా రిమాండుకు పంపిన విషయాలను తాజాగా రాజు బయటపెట్టాడు. అతని ప్రాణాలకు ముప్పు తలపెట్టవచ్చు ఈ వైకాపా దొంగల ముఠా.
వెనుక పట్టువస్త్రం తెరకట్టి, బ్రాండెడ్ బట్టలు వేసి “నేను చేసింది మహాపరాధం, కుటుంబం, పిల్లలు కుమిలిపోతున్నాం” అంటూ దొంగ ఏడుపుల డ్రామా వీడియోను, వైకాపా సోషల్ మీడియా అకౌంట్ నుండే పోస్ట్ చేశారు. ఆ దొంగ పెళ్లాం చేత దొంగ కేసు పెట్టించడం గమనార్హం.
– చాకిరేవు