జిల్లాల్లో ధర్నా, రాస్తారోకో
అరెస్టు అప్రజాస్వామని నినాదాలు
గాంధీ విగ్రహం వద్ద ప్రసూన, షకీలారెడ్డి మౌనదీక్ష
నగరంలో కిశోర్ నేతృత్వంలో టీడీపీ నేతల ధర్నా
ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగంహ బక్కని నర్శింహులు
బాబు అరెస్టును ఖండించిన కంభంపాటి, రావుల, బక్కని
హైదరాబాద్: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు అరెస్టును నిరసిస్తూ, తెలంగాణలోని వివిధ జిల్లాల్లో టీడీపీ శ్రేణులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. హైదరాబాద్ లోని పార్టీ ప్రధాన కార్యాలయం, నగర పార్టీ కార్యాలయం, తెలంగాణలోని వివిధ జిల్లాల్లో టీడీపీ కార్యకర్తలు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర ఉపాథ్యక్షురాలు కాట్రగడ్డప్రసూన, తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు భవనం షకీలారెడ్డి నాయకత్వంలో తెలుగుమహిళలు గాంధీ విగ్రహం వద్ద మౌనదీక్ష నిర్వహించారు. బాబు అరెస్టు అప్రజాస్వామ్యమని, సీఎం జగన్‌కు రోజులు దగ్గరపడ్డాయని వారిద్దరూ విరుచుకుపడ్డారు. ఎఫ్ఐఆర్లో పేర్లు లేకుండా, నోటీసులు ఇవ్వకుండా జగన్ ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం అమలుచేస్తున్నారని ఆరోపించారు. లోకేష్ పాదయాత్రకు పెరుగుతున్న ఆదరణను చూసి జగన్ ఓర్వలేకపోతున్నారన్నారు. చంద్రబాబుకు తెలుగు ప్రజలంతా మద్దుతునివ్వాలని కోరారు.
టీడీపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బక్కని నర్శింహులు మాట్లాడుతూ.. ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగం బదులు, రాజారెడ్డి రాజ్యాంగం అమలుకావడం ప్రజాస్వామ్యం దౌర్భాగ్యమన్నారు. బాబుపై ఉమ్మేస్తే అది వైసీపీ వారి మీదే పడుతుందన్నారు. ఏపీలో నడుస్తున్న రాజారెడ్డి రాజ్యాంగం కేంద్రం గమనించాలన్నారు. చంద్రబాబుకు తెలుగు ప్రజలను అండగా ఉన్నారని స్పష్టం చేశారు.
నగర పార్టీ కార్యాలయం వద్ద, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లెల కిశోర్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కిశోర్ మాట్లాడుతూ ఏపీలో చీకటిరాజ్యం నడుస్తోందని, త్వరలో చంద్రబాబు సారథ్యంలో వెలుతురు వస్తుందన్నారు. బాబుకు పెరుగుతున్న ప్రజాదరణ, లోకేష్ పాదయాత్రకు వస్తున్న స్పందనకు భయపడే జగన్ సర్కారు బాబును అక్రమంగా అరెస్టు చేసిందని ఆరోపించారు. అంతకుముందు టీడీపీ రాష్ట్ర కార్యాలయం వద్ద టీడీపీ నేతలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. నాగర్‌కర్నూలులో జిల్లా అధ్యక్షుడు బి.రాములు, ఎల్బీనగర్లో కృష్ణప్రసాద్, మేడ్చెల్‌లో వేముల సంజీవగౌడ్, ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద సంధ్యపోగు రాజశేఖర్ నాయకత్వంలో పార్టీ కార్యకర్తలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. మిర్యాలగూడ, కరీంనగర్, వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పార్టీ నేతలు ధర్నా చేశారు.
ఇది అప్రజాస్వామ్యం: కంభంపాటి రామ్మోహన్రావు
టీడీపీ అధినేత చంద్రబాబునము అర్ధరాతి దాటిన తర్వాత అనాగరిక పద్ధతిలో అరెస్టు చేయడం అప్రజాస్వామ్యమని టీడీపీ తెలంగాణ ఇన్చార్జి కంభంపాటి మోహన్‌రావు ఖండించారు. జగన్‌కు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని, నియంతలు రాజ్యమేలితే పరిస్థితి ఎలా ఉంటుందో ఏపీలో చూస్తున్నామని వ్యాఖ్యానించారు. చంద్రబాబు తన రాజకీయ జీవితంలో ఇలాంటి ఆటుపోట్లు ఎన్నో ఎదుర్కొన్నారని, వైఎస్‌కే భయపడని బాబు.. ఆయన కొడుక్కి ఎలా భయపడతారని ప్రశ్నించారు. బాబుపై పెట్టిన కేసుల్లో పస లేవని కొట్టిపారేశారు. తెలుగు ప్రజలంతా బాబుతో కలసి నడవాలని పిలుపునిచ్చారు.
జగన్‌ది వికృత ఆనందం: రావుల
ఏపీ సీఎం జగన్‌ది వికృత ఆనందమని, ఆయన కళ్లలో ఆనందం కోసం పోలీసులు చట్టాన్ని కూడా ధిక్కరించడం రాజ్యాంగానికే అవమానమని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎంపి రావుల చంద్రశేఖరరెడ్డి వ్యాఖ్యానించారు. పోలీసులు రాజారెడ్డి రాజ్యాంగం కాకుండా భారత రాజ్యాంగం అమలుచేయాలని సూచించారు.