Suryaa.co.in

Andhra Pradesh

పిల్లలను రెచ్చగొట్టి ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నారు

-పిల్లలతో రాజకీయాలు ఏమిటి?
-పిల్లలను రెచ్చగొట్టి ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నారు
-వారిలో ఆత్మస్థైర్యం పెంచకుండా అనైతిక రాజకీయాలు
-అవి ప్రశ్నించడం కోసమే జూమ్‌ కాన్ఫరెన్స్‌లోకి వెళ్లాం
-మా ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం లోకేష్‌కు లేదు
-అందుకే వెంటనే కాన్ఫరెన్స్‌ లైన్‌ కట్‌ చే«శాడు
విద్యార్థులకు నష్టం కలగకుండా నెల రోజుల్లోనే పరీక్షలు
-సప్లిమెంటరీగా కాకుండా రెగ్యులర్‌ మాదిరిగా పరీక్షలు
-ఆ విధంగా ఏ ఒక్క విద్యార్థి కూడా నష్టపోడు
-ఇదే సీఎంగారు చెప్పారు. అధికారులూ పని చేస్తున్నారు
-మాజీ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు వెల్లడి

మీడియాతో కొడాలి నాని ఇంకా ఏం మాట్లాడారంటే..:
కొన్ని ప్రశ్నలు అడగాలనుకున్నాను:
పదవ తరగతి ఫెయిల్‌ అయిన విద్యార్థులు ఇక దేనికి పనికి రారని భావించి, పిల్లలను రెచ్చగొట్టడం కోసమే లోకేష్‌ జూమ్‌ మీటింగ్‌ ఏర్పాటు చేశాడు. వారిని ఆత్మహత్యలకు ప్రేరేపించే విధంగా రాజకీయం చేస్తున్నాడు. దాన్ని అడ్డుకోవడం కోసమే ఆయనను కొన్ని ప్రశ్నల అడగాలనుకున్నాను.

అప్పుడేం మాట్లాడారు:
గత ఏడాది కరోనా తగ్గగానే పిల్లలకు క్లాస్‌లు ప్రారంభిస్తే ఇదే లోకేష్, ఆయన తండ్రి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ నేతలు, జనసేన, ఎల్లో మీడియా ఏం మాట్లాడాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ క్లాస్‌లు నిర్వహించొద్దు. పిల్లల చదువులకన్నా వారి ప్రాణాలు ముఖ్యమని ఆరోజు వారంతా అన్నారు. తరగతులు వాయిదా వేయమన్నారు.ఆ తర్వాత హైస్కూల్‌ విద్యార్థులు ఆన్‌లైన్‌ తరగతులకు హాజరయ్యారు. అదే సమయంలో ప్రైవేటు స్కూళ్ల విద్యార్థులు చాలా మంది సొంతంగా ట్యాబ్‌లు, కంప్యూటర్లు, స్మార్ట్‌ ఫోన్లు కొనుక్కొన్నారు. దీంతో వారు బాగా చదువుకుని, పరీక్షల్లో ప్రతిభ చూపారు. ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు మంచి స్మార్ట్‌ ఫోన్లు కానీ, ట్యాబ్‌లు కానీ లేవు.

మీది సప్లిమెంటరీ కాదు:
దాంతో కొందరు విద్యార్థులు ఒకటి, రెండు సబ్జెక్టుల్లో తప్పారు. అయినా ఎవరూ అ«ధైర్యపడొద్దు. వారు సప్లిమెంటరీ అని కాకుండా, నెల రోజుల్లోనే పరీక్షలు పెడతాం. సప్లిమెంటరీగా కాకుండా మిగిలిన విద్యార్థుల మాదిరిగా వారినీ పరిగణించేలా చూస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రిగారు ప్రకటించారు. ఆ దిశలో అధికారులు ఇప్పటికే చర్యలు మొదలుపెట్టారు. అందుకే పిల్లలు అధైర్య పడకుండా వారిలో ఆత్మస్థైర్యం పెంచాలి. కానీ ఆ పని చేయకుండా వారితో మాట్లాడుతూ రాజకీయం చేస్తున్నారు.

ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నారు:
నిజానికి పదవ తరగతి ఫెయిల్‌ అయినంత మాత్రాన ఏమీ కాదని, వెంటనే పరీక్షలకు హాజరు కావచ్చని వారిలో ఆత్మస్థైర్యం పెరిగేలా చూడాలి. వారు అధైర్య పడకుండా ప్రోత్సహించాలి. కానీ అలా కాకుండా, ఏడు మంది పిల్లలు చనిపోయారు. వారి తల్లిదండ్రులను పిల్చి కాన్ఫరెన్స్‌లో మాట్లాడతానని చెప్పి, పిల్లలు ఇంకా చనిపోయేలా ప్రేరేపించేలా వారితో జూమ్‌ యాప్‌లో మాట్లాడడం సరికాదు.

ఇప్పటికే టీడీపీ నాయకులు, ఎల్లో మీడియా, జనసేన నాయకులు పదే పదే దీని గురించి మాట్లాడుతూ, పిల్లలకు ఆత్మహత్యలు కాక మరో మార్గం లేదని చెప్పకనే చెబుతూ, రాజకీయం చేస్తున్నారు. ఆ కోవలోనే చిన్న పిల్లలతో జూమ్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ, వారిని ఆత్మహత్యలకు ప్రేరేపించే విధంగా లోకేష్‌ పని చేస్తున్నారు.

అందుకే జూమ్‌లోకి వెళ్లాం:
అది చెప్పడానికే మేము జూమ్‌ కాన్ఫరెన్స్‌లోకి వెళ్తే, పిరికి వెధవ మమ్మల్ని చూడగానే లైన్‌ కట్‌ చేశాడు. అక్కడ లోకేష్‌ చంద్రబాబు బొమ్మ, టీడీపీ జెండా పెట్టుకుని మాట్లాడుతున్నాడు. కాబట్టే, మేము వైయస్సార్‌సీపీ పక్షాన లైన్‌లోకి వెళ్లాం. వాళ్లు చేస్తోంది తప్పు అని చెప్పడానికి జూమ్‌లోకి వెళ్లాం.
మా విద్యార్థుల ఐడీతోనే మేము ఆ జూమ్‌ కాన్ఫరెన్స్‌లోకి వెళ్లాం. ఎందుకంటే లోకేష్‌ ఈ ప్రభుత్వాన్ని, సీఎంగారిని, వైయస్సార్‌సీపీని విమర్శిస్తున్నాడు. వాటిపై ప్రశ్నించడం కోసమే మేము జూమ్‌ కాన్ఫరెన్స్‌లోకి వెళ్లాం.

మేమేం తప్పు చేయలేదు:
అసలు ఆ కాన్ఫరెన్స్‌ లోకేష్‌ ఎందుకు పెట్టాడు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, కొందరు టీచర్లతోనూ, టీడీపీ వారితోనూ మాట్లాడించాడు కదా? మరి ధైర్యం ఉంటే, మాతో కూడా మాట్లాడొచ్చు కదా? మమ్మల్ని చూడగానే లైన్‌ ఎందుకు కట్‌ చేశాడు? విద్యార్థులతో రాజకీయాలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించడం కోసమే ఆన్‌ లైన్‌లోకి వెళ్లాం. అందులో తప్పేముంది?

LEAVE A RESPONSE